అధికారులు సమన్వయంతో పనిచేయాలి
ABN , Publish Date - Jul 11 , 2026 | 12:37 AM
ఆపరేషన్ ముస్కాన్‌లో అన్ని శాఖల అధికారులు సమన్వంతో పని చేసి విజయవంతం చేయాలని అదనపు ఎస్పీ చంద్రయ్య అన్నారు.
సిరిసిల్ల అర్బన్, జూలై 10 (ఆంధ్ర జ్యోతి): ఆపరేషన్ ముస్కాన్‌లో అన్ని శాఖల అధికారులు సమన్వంతో పని చేసి విజయవంతం చేయాలని అదనపు ఎస్పీ చంద్రయ్య అన్నారు. అలాగే గడిచిన పది రోజుల్లో 37 మంది పిల్లలను రెస్క్యూ చేసి సీడబ్ల్యూసీ ఎదుట హాజరుపరచగా తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించి అప్పగించామన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ మహేష్ బీగీతే ఆదేశాల మేరకు శుక్రవారం ఆపరేషన్ ముస్కాన్ టీలో ఉన్న అన్ని శాఖల అఽధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ చంద్రయ్య మాట్లాడుతూ అపరేషన్ ముస్కాన్‌లో భాగంగా జిల్లాలోని పరిశ్రమలు, హోటళ్లు, వ్యాపార సముదాయాలు, గోదాములు, మెకానిక్ దుకాణాలు, ఇటుక బట్టీలు తదితర ప్రాంతాల్లో వ్యూహాత్మాకంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టి బాల కార్మికులతో పాటు తప్పిపోయిన బాలలను గుర్తించి వారికి తగిన రక్షణ కల్పించి వారిని తల్లిదండ్రులతోపాటు సంరక్షకుల వద్దకు చేర్చే విధంగా చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఆపరేషన్ ముస్కాన్ విజయవంతం కోసం పోలీస్ శాఖతో పాటు సంబంధిత అన్ని ప్రభుత్వ శాఖలు పరస్పర సమన్వయంతో పకడ్బందీగా పని చేయా లని ప్రతి తనిఖీని ప్రణాళికాబద్ధంగా నిర్వహించి బాలల హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ఈ సంవత్సరం జూలై 1నుంచి 31 వరకు పోలీస్ శాఖ, చైల్డ్‌వెల్ఫేర్ కమిటీ, లేబర్ డిపార్ట్‌మెంట్, విద్యాశాఖ, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్‌లతో పాటు వివిధ శాఖ అధికారులతో జిల్లాలో టీంలుగా ఏర్పాటు చేసి ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలను గుర్తించి విస్తృతంగా తనిఖీలు నిర్వహించామ న్నారు. జిల్లా వ్యాప్తంగా గడిచిన పది రోజుల్లో 37 మంది పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులను వద్దకు చేర్చామన్నారు. 18 సంవత్సరాలలోపు పిల్ల లను పనిలో పెట్టుకుని వారితో పని చేయిస్తున్న వారిపై 13 కేసులు నమోదు చేశామని అదనపు ఎస్పీ వివరించారు.
ఈ సమావేశంలో జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరా జం, ఎస్‌ఐలు ప్రేమనందం, లాక్పతి, వివిధ వాఖ అధికారులు పాల్గొన్నారు.