Share News

పోషకాల రేషన్‌ బంద్‌

ABN , Publish Date - Mar 14 , 2026 | 01:21 AM

రేషన్‌ లబ్ధిదారుల్లో రక్తహీనత, పోషకాహార లోపం, నివారించే దిశగా ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ బి12 పోషకాలతో కూడిన ఫోర్టిఫైడ్‌ బియ్యం సరఫరాను నిలిపివేయనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటివరకు పౌరసరఫరాల శాఖ గోదాముల్లో ఉన్న పూర్తి ఫోర్టిపైడ్‌ రైస్‌ నిల్వల మేరకే వాడుకోవాలని కొత్త సరఫరాలో ఎఫ్‌ఆర్‌కే కలపకుండానే బియ్యం పౌరసరఫరాల శాఖ సేకరించే విధంగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో జిల్లాలో రైస్‌మిల్లుల్లో ఫోర్టిఫైడ్‌ బియ్యం సరఫరా కోసం రైస్‌మిల్లర్లు ప్రతి మిల్లులో అదనంగా ఏర్పాటు చేసుకున్న మిషన్ల పరిస్థితి ఏమిటనే సందిగ్ధంలో పడ్డారు.

పోషకాల రేషన్‌ బంద్‌

- స్టాక్‌ ఉన్నంత వరకు ఎఫ్‌ఆర్‌కే బియ్యం

- జిల్లాలో 1.94 లక్షల రేషన్‌ కార్డులు

- ప్రతినెల 37,13,043 కిలోల బియ్యం పంపిణీ

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

రేషన్‌ లబ్ధిదారుల్లో రక్తహీనత, పోషకాహార లోపం, నివారించే దిశగా ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ బి12 పోషకాలతో కూడిన ఫోర్టిఫైడ్‌ బియ్యం సరఫరాను నిలిపివేయనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటివరకు పౌరసరఫరాల శాఖ గోదాముల్లో ఉన్న పూర్తి ఫోర్టిపైడ్‌ రైస్‌ నిల్వల మేరకే వాడుకోవాలని కొత్త సరఫరాలో ఎఫ్‌ఆర్‌కే కలపకుండానే బియ్యం పౌరసరఫరాల శాఖ సేకరించే విధంగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో జిల్లాలో రైస్‌మిల్లుల్లో ఫోర్టిఫైడ్‌ బియ్యం సరఫరా కోసం రైస్‌మిల్లర్లు ప్రతి మిల్లులో అదనంగా ఏర్పాటు చేసుకున్న మిషన్ల పరిస్థితి ఏమిటనే సందిగ్ధంలో పడ్డారు. 2021 సంవత్సరంలో ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన పథకం కింద ప్రజలకు పంపిణీ చేసే రేషన్‌ బియ్యంలో ఒక శాతం పోషకాలు కలపాలని నిర్ణయించారు. దీంతో ఒక క్వింటాల్‌ బియ్యంలో ఒక కిలో ఎఫ్‌ఆర్‌కే బియ్యం ఉంటాయి. ఒక శాతం ఎఫ్‌ఆర్‌కే కలపడానికి జిల్లాలో 130 రైస్‌ మిల్లులు ఉండగా, దాదాపు అన్ని మిల్లులో రూ 10 నుంచి 15 లక్షల వరకు ఖర్చు చేసి ఎఫ్‌ఆర్‌కే మిషనరీలను ఏర్పాటుచేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా రేషన్‌ లబ్ధిదారులతో పాటు అంగన్‌వాడీ, హాస్టల్లో, రెసిడెన్షియల్‌ పాఠశాలకు ఎస్‌ఆర్‌కే బియ్యమే వాడుతున్నారు. ఇప్పటికే బియ్యం సరఫరాలో నాణ్యత లేకపోవడం, ప్లాస్టిక్‌ బియ్యమని, పిండితో కల్తీ చేశారని రకరకాల ప్రచారంతో అపోహలు వచ్చాయి. అంతేకాకుండా ఎఫ్‌ఆర్‌కే బియ్యం ఎక్కువ రోజులు గోదాంలో నిల్వ ఉండడం వల్ల అనుకున్నంత మేరకు పోషకాలు ఉండడం లేదనే కారణంగానే బియ్యం నిలిపివేస్తున్నట్లు తెలిసింది. పోషకాల లోపం నివారణ కోసం ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను చూస్తోంది. ప్రస్తుతం గోదాంలో ఉన్న నిల్వల తర్వాత నాన్‌ ఎఫ్‌ఆర్‌కే బియ్యమే సరఫరా చేయనున్నారు.

జిల్లాలో 5.37 లక్షల మంది లబ్ధిదారులు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 344 రేషన్‌ దుకాణాలు ఉండగా, 1,94,958 రేషన్‌ కార్డులు ఉన్నాయి. వీటిపరిధిలో 5,73,638 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఆహార భద్రత కార్డులు 1,80,928 ఉండగా లబ్ధిదారులు 5,37,828 మంది, అంత్యోదయ కార్డులు 13,831 ఉండగా లబ్ధిదారులు 35,605 ఉన్నారు. అన్నపూర్ణ కార్డులు 199 ఉండగా, 205 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీటితో పాటు అంగన్‌వాడీ, ప్రభుత్వ పాఠశాల్లో మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు.

మూడు నెలల బియ్యం ఒకేసారి..

ఈసారి ఎండలు మండిపోతాయనే హెచ్చరికలతో రేషన్‌ లబ్ధిదారులకు మూడు నెలల బియ్యం కోటాను ఒకేసారి ఇవ్వన్నారు. ఇప్పటికే పౌరసరఫరాల శాఖ అధికారులకు మౌఖిక ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. పౌరసరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఏడాది జూన్‌లో వర్షాల కారణంగా ఇలాగే మూడు నెలల కోట బియ్యం ముందస్తుగానే వినియోగదారులకు అందించారు. అదే మాదిరిగా వేసవి తీవ్రత నేపథ్యంలో ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున మూడు నెలలకు 18 కిలోలు ఇవ్వనున్నారు. జిల్లాలో 1.94 లక్షల రేషన్‌ కార్డులు ఉండగా, 5.73లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి 6 కిలోల చొప్పున రేషన్‌ దుకాణాల ద్వారా 37,13,043 కిలోల బియ్యాన్ని కేటాయిస్తున్నారు. ఇందులో రేషన్‌ డీలర్ల వద్ద మిగిలింది మినహాయించి పౌరసరఫరాల శాఖ అందిస్తుంది.

జిల్లాలో రేషన్‌ కార్డులు లబ్ధిదారులు

మండలం కార్డులు లబ్ధిదారులు

బోయిన్‌పల్లి 13,249 37,515

చందుర్తి 12,118 35,000

గంబీరావుపేట 15,781 46,206

ఇల్లంతకుంట 17,280 49,104

కోనరావుపేట 15,619 46,087

ముస్తాబాద్‌ 16,484 48,808

రుద్రంగి 5,445 17,325

సిరిసిల్ల 30,282 91,210

తంగళ్లపల్లి 16,015 46,119

వీర్నపల్లి 4,775 15,030

వేములవాడ 22,001 66,047

వేములవాడ రూరల్‌ 8,430 24,191

ఎల్లారెడ్డిపేట 17,479 50,996

మొత్తం 1,94,958 57,36,380

Updated Date - Mar 14 , 2026 | 01:21 AM