Share News

ఇక ప్రజల వద్దకు..

ABN , Publish Date - Feb 27 , 2026 | 01:05 AM

ప్రజాపాలన పేరిట రెండేళ్లుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేపడుతోంది.

ఇక ప్రజల వద్దకు..

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

ప్రజాపాలన పేరిట రెండేళ్లుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. ఇకపై నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వారితో మమేకమై అభివృద్ధి సంక్షేమ పథకాలతో క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం కావాలని భావిస్తున్నది. పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో మంచి ఫలితాలనే సాధించిన కాంగ్రెస్‌ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు వెంటనే వెళ్లవద్దని నిర్ణయించింది. 99 రోజుల పాటు ప్రజల వద్దకు వెళ్లి వారి మన్ననలు మరింత పొందిన తర్వాత ఎన్నికలకు వెళ్లి తిరుగులేని ఫలితాలను సాధించాలని చూస్తున్నది. ఈ వ్యూహాత్మక ప్రణాళికతోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో వివిధ శాఖల ద్వారా 99 రోజులపాటు అమలు చేయడానికి వీలుగా అభివృద్ధి కార్యక్రమాల కార్యాచరణ పథకాన్ని రూపొందించేందుకు కేబినెట్‌ సబ్‌ కమిటీని వేసింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చైర్మన్‌గా ఉన్న ఈ సబ్‌ కమిటీలో ఉమ్మడి జిల్లాకు చెందిన సీనియర్‌ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సభ్యులుగా ఉన్నారు.

ఎన్నికల హామీలు నెరవేర్చేందుకు..

మున్సిపల్‌ ఎన్నికలు ముగిసిన తర్వాత కాంగ్రెస్‌ వెంటనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లి మండల పరిషత్‌లను, జిల్లా పరిషత్‌లను కైవసం చేసుకునేందుకు ప్రయత్నిస్తుందని అందరూ అనుకున్నారు. ఈ స్థానిక సంస్థలతో పాటు రెండున్నర ఏళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల కార్యాచరణ పథకాన్ని సిద్ధం చేస్తోందని భావిస్తున్నారు. ఫించన్లను నాలుగు వేల రూపాయలకు పెంచుతామన్న హామీని విడతల వారీగా అసెంబ్లీ ఎన్నికల నాటికి అమలు చేయాలని, అందులో భాగంగానే ఐదు వందల రూపాయలు వెంటనే పెంచి ఫించన్‌ దారులకు అందేలా చూడాలని ప్రభుత్వం భావిస్తున్నది. రైతు భరోసా పథకం కింద రైతులకు రబీలో అందాల్సిన సహాయాన్ని విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంతోపాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో నియోజక వర్గాల వారీగా ఉన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చేపట్టవలసిన చర్యలను 99 రోజుల కార్యాచరణలో పేర్కొని అమలు చేస్తారని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ సబ్‌ కమిటీ మార్చిలో రిపోర్టు సమర్పిస్తే ఏప్రిల్‌, మే జూన్‌ మాసాల్లో 99 రోజుల పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ యంత్రాంగం గ్రామాలకు వెళ్లి కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తారు. దీంతో ప్రభుత్వం, పార్టీ ప్రజలకు మరింత చేరువై మంచి ఫలితాలు వస్తాయని భావిస్తున్నట్లు తెలిసింది.

తిరుగులేని శక్తిగా ఎదిగేందుకు..

ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా పరిధిలోని రెండు కార్పొరేషన్లలో ఒక దానిని కాంగ్రెస్‌ కైవసం చేసుకోగా, మరొకటి బీజేపీ దక్కించుకున్నది. 13 మున్సిపాలిటీల్లో పదింటిని కాంగ్రెస్‌ గెల్చుకోగా, మూడింటిలో బీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో మూడు విడతలో 1,224 పంచాయతీలకు ఎన్నికలు జరుగగా 613 పంచాయతీల్లో కాంగ్రెస్‌, 346 పంచాయతీల్లో బీఆర్‌ఎస్‌, 104 పంచాయతీల్లో బీజేపీ, 156 పంచాయతీల్లో ఇతరులు గెలుపొందారు. పంచాయతీ ఎన్నికల్లో మున్సిపాలిటీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీగా కాంగ్రెస్‌ ఉన్నా క్షేత్ర స్థాయిలో తిరుగులేని శక్తిగా ఎదగాలని ఆ పార్టీ భావిస్తున్నది. కరీంనగర్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఓడిపోవడాన్ని ఆ పార్టీ జీర్ణించుకోలేక పోతున్నది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధి ఈ విషయంలో ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులను ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేయడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. జడ్పీటీసీ స్థానాలన్నింటిని గెల్చుకోవడం ద్వారా జిల్లా పరిషత్‌లను కైవసం చేసుకోని పక్షంలో మున్సిపల్‌ ఎన్నికల మాదిరిగానే బీఆర్‌ఎస్‌, బీజేపీ వాటిని దక్కించుకుంటే జిల్లా స్థాయి రాజకీయాల్లో ఇబ్బందులు ఎదురవుతాయని కాంగ్రెస్‌ భావిస్తున్నట్లు తెలుస్తున్నది. పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపొందినా ఆ ఎన్నికలు పార్టీ గుర్తు లేకుండా జరిగాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తుతో జరుగనన్న నేపథ్యంలో ఏ పార్టీకి ఎన్నిఓట్లు పెరిగాయి.. తగ్గాయి అన్నది స్పష్టంగా తేలిపోతుంది. పార్టీ గుర్తుతో జరిగే ఎన్నికలు అయినందు వల్ల మున్సిపాలిటీల్లో ఎదురైన పరిస్థితులు రాకుండా నివారించుకోవడానికి వీలుగా 99 రోజుల అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమం తోడ్పడుతుందని నాయకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూలైలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి.

Updated Date - Feb 27 , 2026 | 01:05 AM