ఇక ‘స్మార్ట్’గా రేషన్..
ABN , Publish Date - Aug 14 , 2026 | 12:45 AM
ప్రజా పంపిణీ వ్యవస్థ మరింత స్మార్ట్‌గా మారుతోంది.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
ప్రజా పంపిణీ వ్యవస్థ మరింత స్మార్ట్‌గా మారుతోంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రేషన్ కార్డులను పంపిణీ చేస్తామంటూ ఊరిస్తూ వచ్చారు. 12 ఏళ్లకు పైగా జిరాక్స్ కాగితాలే లబ్ధిదారులకు రేషన్ కార్డులుగా ఉపయోగపడుతూ వచ్చాయి. జిరాక్స్ కాగితాలు చినిగిపోతూ ఇబ్బంది పడుతున్న లబ్ధిదారులు రేషన్ కార్డులు ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పంద్రాగస్టు రోజు నుంచి సరికొత్త హంగులతో పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డులను అందించడానికి శ్రీకారం చుట్టింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మండలాల్లో ఇప్పటికే ముద్రణ పూర్తి చేసుకున్న స్మార్ట్ రేషన్ కార్డులు సిద్ధంగా ఉంచారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున లాంఛనంగా ప్రారంభించిన వెంటనే లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. గతంలో దారిద్య్ర రేఖకు దిగువ ఉన్నవారికి తెలుపు రంగు కార్డులు, ఎగువనున్నవారికి గులాబీ రంగు కార్డులు ఉండేవి. గులాబీ రంగు కార్డుదారులకు బియ్యం మినహా ఇతర సరుకులు పంపిణీ చేసేవారు. రేషన్ దుకాణాల ద్వారా బియ్యం పంపిణీకి పరిమితం కావడంతో గత ప్రభుత్వం గులాబీ కార్డులను రద్దు చేసింది. ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా, ఆధునికంగా మార్చే దిశగా ఎలాంటి ట్యాంపరింగ్ చేయడానికి వీలులేని విధంగా ఏటీఎం, పాన్ కార్డు మాదిరిగా డిజిటలైజేషన్, స్మార్ట్ టెక్నాలజీ ఆధారితంగా పంపిణీ చేసే పీవీసీ కార్డు, చిప్, బార్ కోడ్, డిజిటల్ వెరిఫికేషన్ వంటి టెక్నాలజీతో స్మార్ట్ రేషన్ కార్డులు ముద్రించారు. దీనిని ద్వారా స్కాన్ చేయడంతో కార్డులో ఉన్న కుటుంబ సభ్యులకు పూర్తి సమాచారం వస్తుంది. ఆధునిక భద్రతా ఫీచర్లను పొందుపరచి స్మార్డ్ కార్డులు లబ్ధిదారులను ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం రోజు నుంచి లబ్ధిదారులకు చేరనున్నాయి.
జిల్లాలో 5.77 లక్షల లబ్ధిదారులు
జిల్లాలో 1.96 లక్షల కార్డులు ఉండగా, 5.77లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో ఆహార భద్రత కార్డులు 182444 ఉండగా, 5419144 మంది లబ్ధిదారులు ఉన్నారు. అంత్యోదయ అన్నయోజన కార్డులు 13827 ఉండగా, 35428 మంది లబ్ధిదారులు ఉన్నారు. అన్నపూర్ల యోజన కార్డులు 199 ఉండగా 205 మంది లబ్ధిదారులు ఉన్నారు. జిల్లాలో రేషన్ కార్డుల్లో బోయినపల్లిలో 13326 కార్డులు, చందుర్తిలో 12253 కార్డులు, గంభీరావుపేటలో 15927 కార్డులు, ఇల్లంతకుంటలో 17367 కార్డులు, కోనరావుపేటలో 15713 కార్డులు, ముస్తాబాదులో 16661 కార్డులు, రుద్రంగిలో 5529 కార్డులు, సిరిసిల్లలో 30526 కార్డులు, తంగళ్ళపల్లిలో 16128 కార్డులు, వీర్నపల్లిలో 4814 కార్డులు, వేములవాడలో 22171 కార్డులు, వేములవాడ రూరల్ 8471 కార్డులు, ఎల్లారెడ్డిపేటలో 17584 కార్డులు ఉన్నాయి. వీటి పరిధిలో లబ్ధిదారుల్లో బోయినపల్లిలో 37711 మంది లబ్ధిదారులు, చందుర్తిలో 35413 మంది లబ్ధిదారులు, గంభీరావుపేటలో 49380 మంది లబ్ధిదారులు, ఇల్లంతకుంటలో 49257మంది లబ్ధిదారులు, కోనరావుపేటలో 46236 మంది లబ్ధిదారులు, ముస్తాబాద్‌లో 49257 మంది లబ్ధిదారులు, రుద్రంగిలో 17551 మంది లబ్ధిదారులు, సిరిసిల్లలో 9161 మంది లబ్ధిదారులు, తంగళ్ళపల్లిలో 46445 మంది లబ్ధిదారులు, వీర్నపల్లిలో 15119 మంది లబ్ధిదారులు, వేములవాడలో 66475 మంది లబ్ధిదారులు, వేములవాడ రూరల్‌లో 24272 మంది లబ్ధిదారులు, ఎల్లారెడ్డిపేటలో 51267 మంది లబ్ధిదారులు ఉన్నారు.
లబ్ధిదారులకు ఎక్కడైనా సరుకులు..
ప్రభుత్వం ఇప్పటికే రేషన్ సరుకులు బయోమెట్రిక్ ద్వారా రేషన్ దుకాణాల్లో ఎక్కడైనా సరుకులు పొందే అవకాశం ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. స్మార్ట్ కార్డు ద్వారా రాష్ట్రంలోని ఏ రేషన్ దుకాణంలోనైనా సరుకులు పొందడానికి సులువుగా మారుతుంది. క్యూఆర్ కోడ్ ఉండడంతో కార్డులు డూప్లికేట్ కాకుండా ఉంటుంది. జిల్లాలో ప్రస్తుతం రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులందరికీ స్మార్ట్ కార్డులను రేషన్ షాప్‌లో పాత కార్డు చూపించి స్మార్ట్ కార్డును పొందవచ్చు. అంతేకాకుండా టీఎస్‌ఈపాస్ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని కూడా స్మార్ట్ కార్డు తీసుకునే వీలు కల్పిస్తున్నారు. కొత్తగా అందించే స్మార్ట్ రేషన్ కార్డులు ముందు భాగంలో కుటుంబ యజమాని ఫొటో, రేషన్ కార్డు నంబర్, రేషన్ దుకాణం నంబర్ ముద్రిస్తారు. కార్డు వెనకవైపు కుటుంబ సభ్యుల వివరాలతో పాటు ఇతర అవసరమైన సమాచారాన్ని పొందపరిచారు.