గింజ కొన్నది లేదు..
ABN , Publish Date - Nov 18 , 2026 | 01:25 AM
రైతన్నలు అరుగాలం కష్టించి పండించిన వరి పంట కొనుగోలు కేంద్రాల్లోనే మూలుగుతోంది. యాసంగిలో వరి సాగు వద్దంటున్న నేపథ్యంలో వానా కాలంలో పండించిన పంటకు అఽధిక ధర వస్తుందని ఆశించిన రైతులకు అసలుకే మోసం వస్తున్నది.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
రైతన్నలు అరుగాలం కష్టించి పండించిన వరి పంట కొనుగోలు కేంద్రాల్లోనే మూలుగుతోంది. యాసంగిలో వరి సాగు వద్దంటున్న నేపథ్యంలో వానా కాలంలో పండించిన పంటకు అఽధిక ధర వస్తుందని ఆశించిన రైతులకు అసలుకే మోసం వస్తున్నది. కోతలు ప్రారంభమైన తొలి రోజుల్లో పచ్చి వడ్లకే మద్దతు ధరకు మించి ప్రైవేట్ వ్యాపారులు చెల్లించారు. కోతలు ఊపందుకున్న సమయంలో సర్కారుకు, మిల్లర్లకు మధ్య కస్టం మిల్లింగ్ విషయంలో ఏర్పడిన ప్రతిష్టంబనతో రేట్లు తగ్గించి కొంటున్నారు. ధాన్యం పూర్తి స్థాయిలో ఎండలేదంటూ మద్ధతు ధరకంటే కొంత తక్కువకే ధర చెల్లించి కొంటామంటుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఫ ఇప్పటి వరకు కొన్నది 259 మెట్రిక్ టన్నులే..
ఉమ్మడి జిల్లాలో 20.55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేయగా ఇప్పటి వరకు కొనుగోలు చేసింది కేవలం 259 మెట్రిక్ టన్నులే కావడం గమనార్హం అది కూడా ఒక్క పెద్దపల్లి జిల్లాలోని 12 కేంద్రాలలో మాత్రమే. కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 70 శాతం వరి కోతలు పూర్తయి ధాన్యం కొనుగోలు కేంద్రాలతోపాటు అన్ని గ్రామాల రోడ్లపై కుప్పలుగా పడి ఉన్నా కొనే వారే లేకుండా పోయారు. ప్రభుత్వం ప్రతి గింజను కొనుగోలు చేస్తామని ప్రకటించి అందు కోసం రూపొందించిన కార్యాచరణ ఆచరణకు నోచుకోవడం లేదు. దీంతో రైతులు ప్రైవేట్ వ్యాపారుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ధాన్యం అమ్ముకోవడం కోసం ఎదురు చూస్తున్నారు.
ఫ 9,31,506 ఎకరాల్లో వరి సాగు
ఉమ్మడి జిల్లాలో 9,31,506 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇందులో 7,25,018 ఎకరాల్లో సన్న వరి రకాలు, 2,06,488 ఎకరాల్లో దొడ్డు రకాలను వేశారు. ఈ విస్తీర్ణంలో 14,28,876 మెట్రిక్ టన్నుల సన్న వరి ధాన్యం 6,50,328 మెట్రిక్ టన్నుల దొడ్డు వరి ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. సన్న, దొడ్డు వరి రకాలు కలిపి 20,55,079 మెట్రిక్ టన్నుల దిగుబడిని అంచనా వేసిన అధికారులు వీటి కొనుగోలు కోసం కరీంనగర్ జిల్లాలో 318, జగిత్యాల జిల్లాలో 428, పెద్దపల్లి జిల్లాలో 311, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 254, మొత్తం 1,311 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో ఇప్పటికే 550 కేంద్రాలు ప్రారంభమైనా పెద్దపల్లి జిల్లాలోని 12 కేంద్రాల్లో మాత్రమే ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటి వరకు కేవలం 259 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే ఇక్కడ కొనుగోలు అయింది.
ఫ కొనుగోళ్లలో జాప్యానికి కారణం..
నాలుగు జిల్లాల్లోని 1311 కొనుగోలు కేంద్రాలను నోటిఫై చేసి ఆయా జిల్లాల సివిల్ సప్లయిస్ శాఖ అధికారులు ప్రతీరోజు కేంద్రాలకు వెళుతున్నారు. ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు రోజుకో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్నారు. ఏ కొనుగోలు కేంద్రంలోనూ ధాన్యం కొనేవారు లేరు. ధాన్యం కొనుగోలు చేస్తే వెంటనే వాటిని రైస్ మిల్లులకు తరలించాల్సి ఉంటుంది. ఏ కేంద్రానికి ఏ మిల్లును కేటాయించారో అధికారులు ఉత్తర్వులు ఇవ్వక పోవడంతో కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. కస్టం మిల్లింగ్‌లో అక్రమాలకు పాల్పడ్డ మిల్లర్లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో పలువురిపై కేసులు నమోదై జైలుకు వెళ్లారు. ఎందరో పెనాల్టీలు చెల్లించి ఇంకా బకాయి ఉన్న నేపథ్యంలో డిఫాల్టర్ల లిస్టులో ఉన్నారు. గత యాసంగి సీజనలో కస్టం మిల్లింగ్ కోసం ఇచ్చిన వడ్లను మిల్లర్లు బియ్యంగా మార్చినా ఎఫ్‌సీఐ వాటిని కేంద్రం విధించిన కోటాకు మించి తీసుకోక పోవడం, పారా బాయిల్డ్ బియ్యాన్ని అంగీకరించక పోవడంతో మిల్లుల్లో బియ్యం, వడ్లు పేరుకు పోయాయి. వాటిని తీసుకుంటే తప్ప కొత్త వడ్లు తీసుకోవడానికి స్థలం లేదని మిల్లర్లు చేతులెత్తేస్తున్నారు. ప్రస్తుతం కస్టం మిల్లింగ్ కోసం వడ్లు కేటాయించడానికి మిల్లు కెపాసిటీకి అనుగుణంగా కేటాయింంచే దాన్యం విలువలో పది శాతం బ్యాంకు గ్యారంటీని, ఇద్దరు మిల్లర్ల గ్యారెంటీని ఇవ్వాలనే నిబంధన విధించారు. ఇప్పటికే చాలా మిల్లులు డిఫాల్ట్ లిస్టులో పడిపోవడం, కేసులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ధాన్యం తీసుకుంటే సకాలంలో తిరిగి బియ్యం ఇవ్వకపోతే మళ్లీ కేసులు నమోదు చేస్తారని ఆలోచిస్తున్న పలువురు మిల్లర్లు తమకు ధాన్యం కేటాయించాల్సిన అవసరం లేదని రిజక్ట్ చేస్తున్నారు. నిబంధనలు కఠినంగా ఉండడంతో కస్టం మిల్లింగ్‌కు చాలా మంది సుముఖంగా లేరు. ఈ కారణంగా మిల్లర్లతో అగ్రిమెంట్ కుదరక మిల్లులు కేటాయించక కొనుగోళ్లు ప్రారంభం కావడం లేదు.
ఫ మురిపించి.. నిరాశ పరుస్తున్న ధరలు
ఎల్‌నినో కారణంగా యాసంగిలో వరి సాగు చేయవద్దని, ఆరుతడి పంటలు వేయాలని ప్రభుత్వం సూచిస్తుండడంతో మార్కెట్లో ఒక్కసారిగా బియ్యం ధరలు పెరిగిపోయాయి. వానాకాలంలో పండించిన ధాన్యం కొనుగోలు చేసి బియ్యం వ్యాపారం చేస్తే లాభాలు అర్జించవచ్చని పలువురు వ్యాపారులు, మిల్లర్లు ముందస్తుగా కోతలు పూర్తి చేసుకున్న రైతుల నుంచి ధాన్యాన్ని పోటీలు పడి కొనుగోలు చేశారు. పొలాల వద్దకే వెళ్లి సన్న వరి రకాలను క్వింటాల్‌కు 3,200, జైశ్రీరాం లాంటి ప్రీమియం రకాన్ని 3,800 నుంచి నాలుగు వేల వరకు, దొడ్డు ధాన్యాన్ని 2,800 రూపాయల వరకు చెల్లించి కొనుగోలు చేశారు. ప్రస్తుతం కస్టం మిల్లింగ్ విషయంలో మిల్లర్లతో ప్రభుత్వానికి ఒప్పందం కుదరక పోవడంతో కొనుగోళ్లు జరగడం లేదు. కోతలు ముమ్మరంగా సాగుతూ ధాన్యం కుప్పలు తెప్పలుగా కేంద్రాలకు వస్తున్నది. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ వ్యాపారులు, మిల్లర్లు ధాన్యం ధర తగ్గించి కొంటున్నారు. ప్రభుత్వం సన్న వరి రకాలకు బోనస్‌తో కలుపుకుని 2,961, కామన రకాలకు మద్ధతు ధర 2,441 రూపాయలు ప్రకటించింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకు పోవడంతో వ్యాపారులు ఒక్కసారిగా తాము ముందు చెల్లించిన ధరను తగ్గించి మద్ధతు ధరకు కొంచెం అటు ఇటుగా చెల్లిస్తున్నారు. కేంద్రాల్లె ఎప్పుడు ధాన్యం కొంటారో తెలియక, కొనే అవకాశం ఉందో తెలియక వ్యాపారులు చెబుతున్న ధరకే వాటిని విక్రయించడానికి ముందుకు వస్తున్నారు. ప్రభుత్వం కొనుగోళ్లు ప్రారంభిస్తే సన్న వరి రకాలకు ప్రభుత్వ ధరకంటే క్వింటాల్‌కు 300 నుంచి 400 రూపాయలు అధికంగా ధర పలికే అవకాశం ఉన్నది. ప్రజా ప్రతినిధులు ఈ విషయంలో చొరవ తీసుకుని కొనుగోళ్లు ప్రారంభమయ్యేలా చూడాలని రైతులు కోరుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో వరి సాగు వివరాలు
--------------------------------------------------------------------------------------------
జిల్లా సాగు విస్తీర్ణం దిగుబడి(మె.ట) కొనుగోలు కేంద్రాలు
కరీంనగర్ 2,65,734 6,25,983 318
జగిత్యాల 3,02,860 6,72,264 428
పెద్దపల్లి 2,15,000 4,49,000 311
రాజన్న సిరిసిల్ల 1,47,912 3,07,832 254
------------------------------------------------------------------------------------------------
మొత్తం 9,31,506 20,55,079 1,311
--------------------------------------------------------------------------------------------------