ముగిసిన నామినేషన్ల పర్వం
ABN , Publish Date - Jan 31 , 2026 | 01:43 AM
జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల స్వీకరణ ముగిసింది. ఇక ప్రధాన రాజకీయ పక్షాలు, అభ్యర్థులు, ఆశావహులు ప్రచారంపై దృష్టిసారించారు. కాగా నామినేషన్ల స్వీకరణ ముగిసినప్పటికీ ప్రధానపార్టీలు అభ్యర్థుల జాబితాను విడుదల చేయలేదు. తమకే టికెట్ వస్తుందనే నమ్మకంతో ఓవైపు ఆశావహులు నామినేషన్లు దాఖలు చేయగా...మరోవైపు నామినేషన్ల ఉపసంహరణ సమయం వరకు వేచిచూసే ఆలోచనతో ఆయా పార్టీలు ఉన్నాయి.
- ఉపసంహరణ సమయానికి బీ ఫారాలు
- అభ్యర్థుల ఎంపికలో ప్రధానపార్టీల ఎత్తుగడ
- నామపత్రాలు సమర్పించిన ఆశావహులు
జగిత్యాల, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల స్వీకరణ ముగిసింది. ఇక ప్రధాన రాజకీయ పక్షాలు, అభ్యర్థులు, ఆశావహులు ప్రచారంపై దృష్టిసారించారు. కాగా నామినేషన్ల స్వీకరణ ముగిసినప్పటికీ ప్రధానపార్టీలు అభ్యర్థుల జాబితాను విడుదల చేయలేదు. తమకే టికెట్ వస్తుందనే నమ్మకంతో ఓవైపు ఆశావహులు నామినేషన్లు దాఖలు చేయగా...మరోవైపు నామినేషన్ల ఉపసంహరణ సమయం వరకు వేచిచూసే ఆలోచనతో ఆయా పార్టీలు ఉన్నాయి. ప్రత్యర్థి పార్టీల కదలికలు, ఆశావహులు, అభ్యర్థుల ఎంపికను క్షుణ్ణంగా గమనిస్తున్నాయి. జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, రాయికల్ మున్సిపాలిటీల్లోని 136 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి.
కొందరికి అంతర్గతంగా గ్రీనసిగ్నల్...
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలుకు సమయం లేకపోవడంతో ఆశావహులు హైరనా పడుతూనే తమ నామినేషన్లను సమర్పించారు. నామినేషన్లు దాఖలు చేసుకోవాలని కొందరికి ఆయా పార్టీలు అంతర్గతంగా గ్రీనసిగ్నిల్ ఇచ్చినప్పటికీ బీ ఫారాలు ఇచ్చే విషయంలో మాత్రం తాత్సారం చేస్తున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ సమయానికి ముందు అభ్యర్థులకు బీఫారాలు ఇచ్చేందుకు పార్టీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల జాబితా విడుదల కానప్పటికీ అంతర్గతంగా గ్రీనసిగ్నల్ లభించిన అభ్యర్థులు మాత్రం పార్టీల పేరుతో నామినేషన్లు దాఖలు చేశారు. బీ ఫారాల కేటాయింపులో తీవ్రఉత్కంఠ నెలకొంది. రాజకీయ పక్షాలు బీ ఫారాల విషయంలో సేఫ్ గేమ్ ఆడుతున్నాయి. ఈక్రమంలో పలువురు అభ్యర్థులు వివిధ సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
పార్టీ కాకపోతే.. స్వతంత్రంగా..
జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో కొందరు ఆశావహులు ఒక పార్టీ నుంచి టికెట్లు కోసం ప్రయత్నాలు చేస్తూనే మరో పార్టీలోనూ టికెట్ విషయంలో టచలో ఉంటున్నారు. ఈ పార్టీలో కాకపోతే ఆ పార్టీలో..లేదంటే స్వతంత్రంగా అనే విధంగా ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. అయితే ఆయా పార్టీలు సైతం తమకు అనుకూలంగా ఉంటాడుతున్న అభ్యర్థి ప్రత్యర్థి పార్టీని వీడి తమ పార్టీ అభ్యర్థిత్వానికి రాకపోతాడా అనే లెక్కలతో గేమ్ ఆడుతున్నాయి. ప్రత్యర్థిపార్టీల కదలికలను, అభ్యర్థులను ఎంపికను పార్టీలు క్షుణ్ణంగా గమనిస్తున్నాయి. ఆశావహులు జంపింగ్ జపాంగ్‌ల విషయమై ఆలోచన చేస్తున్నప్పటికీ పార్టీలు సైతం జంపింగ్‌లను ప్రోత్సహించే విధంగా వ్యవహరిస్తున్నా యి. ఈ క్రమంలో ప్రత్యర్థి పార్టీలకు చెందిన అభ్యర్థుల జాబితా ఇదేనంటూ సోషల్‌మీడియాలో వైరల్ చేస్తున్నాయి. కాగా అభ్యర్థుల ఎంపిక విషయమై మూడురోజులుగా నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇనచార్జి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో హైద్రాబాద్‌లో సమావేశాలు జరుగుతున్నాయి. మరోవైపు బీజేపీ కోర్ కమిటీ సైతం తమ పార్టీ ఒక వార్డుకు ముగ్గురి చొప్పున ఆశావహుల జాబితాను రాష్ట్రనాయకత్వానికి సమర్పిం చిందని ప్రచారం జరుగుతోంది. బీఆర్‌ఎస్ అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది.
నో డ్యూ కోసం క్యూ..
జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీల్లో నో డ్యూ సర్టిఫికేట్ల కోసం ఆశావహులు క్యూ కట్టడంతో జాతరను తలపించింది. మున్సిపాలిటీల్లో అన్ని పార్టీల నుంచి టికెట్ల కోసం వచ్చి దరఖాస్తులు సుమారు వెయ్యికిపైగా ఉన్నాయి. దీంతో అత్యధిక మంది నో డ్యూ సర్టిఫికెట్ల కోసం క్యూ కట్టారు. ఈనెల 29వ తేదీ వరకే 483 మంది నో డ్యూ సర్టిఫికేట్లు సమర్పించి నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల చివరిరోజు మరింత ఎక్కువ సంఖ్యలో ఆశావహులు నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో మున్సిపల్ కార్యాలయాల్లో నో డ్యూ సర్టిఫికెట్ల కోసం సందడి నెలకొంది.
ప్రచారంపై ప్రణాళిక..
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ముగియడంతో ఒకవైపు అభ్యర్థులు, ఆశావహులు, ప్రధాన రాజకీయ పక్షాలు ప్రచారంపై దృష్టి సారించా యి. వార్డుల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించడానికి ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తున్నాయి. వాల్ పోస్టర్లు, కరపత్రాలు, పోల్ చీటీలు, బ్యానర్లు, ఫ్లకార్డులు, కండువాలు, ఫ్లెక్సీలు ఇలా ప్రచార సామగ్రిని తయారు చేసుకుంటున్నాయి. పలు రాజకీయ పార్టీలు ప్రచార రథాలను ఇప్పటికే సిద్దం చేసుకున్నాయి. స్టార్ క్యాంపెయినర్లతో ప్రచారం నిర్వహించడానికి షెడ్యూల్ ఖరారు చేస్తున్నాయి. మున్సిపాలిటీలో ప్రధాన సమస్యలు గుర్తిస్తున్నాయి. వార్డుస్థాయిలో నెలకొన్న సమస్యలను సైతం అధ్యయనం చేసి ప్రచారంలో హామీనిచ్చి పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో మునుముందు రోజుల్లో కాలనీలు, మున్సిపాలిటీలు ప్రచారంతో హోరెత్తనున్నాయి.
జిల్లాలో 1,371 నామినేషన్లు
జగిత్యాల, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా గత మూడు రోజులుగా నిర్వహించిన నామినేషన్ల స్వీకరణ కార్యక్ర మంలో 1,029 మంది అభ్యర్థులు, 1,371 నామినేషన్లు సమర్పించినట్లు శుక్రవా రం కలెక్టర్ కార్యాలయ అధికారులు ప్రకటించారు. ఇందులో జిల్లాలోని జగిత్యా ల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీలు కలిపి కాంగ్రెస్ 519, బీజేపీ 289, బీఆర్‌ఎస్ 289, సీపీఐ (ఎం) 3, సీపీఐ 4, ఎఎంఐఎం 46, బీఎస్‌పీ 1, ఏఏపీ 5, బీఎస్‌పీ 1, జనసేన 31, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 11, ఇతరు లు 149 నామినేషన్లు దాఖలు చేసినట్లు ప్రకటించారు. ధర్మపురి మున్సిపా లిటీలో 113 నామినేషన్లు, జగిత్యాలలో 530 నామినేషన్లు, కోరుట్లలో 337 నామినేషన్లు, మెట్‌పల్లిలో 291 నామినేషన్లు, రాయికల్‌లో 100 నామినేషన్లను అధికారులు స్వీకరించారు.
మూడు రోజులుగా ఇలా..
ఈనెల 28వ తేదీన ధర్మపురిలో 9 మంది అభ్యర్థులు 10 నామినేషన్లు, జగిత్యాలలో 21 మంది అభ్యర్థులు 21 నామినేషన్లు, కోరుట్లలో 7 గురు అభ్యర్థులు 7 నామినేషన్లు, మెట్‌పల్లిలో 15 మంది అభ్యర్థులు 17 నామినేషన్లు, రాయికల్‌లో 9 మంది అభ్యర్థులు 9 నామినేషన్లు సమర్పించారు. ఈనెల 29వ తేదీన ధర్మపురిలో 38 మంది అభ్యర్థులు 40 నామినేషన్లు, జగిత్యాలలో 165 మంది అభ్యర్థులు 169 నామినేషన్లు, కోరుట్లలో 72 మంది అభ్యర్థులు 84 నామినేషన్లు, మెట్‌పల్లిలో 81 మంది అభ్యర్థులు 92 నామినేషన్లు, రాయికల్ లో 33 మంది అభ్యర్థులు 34 నామినేషన్లు సమర్పించారు. ఈనెల 30వ తేదీన ధర్మపురిలో 59 మంది అభ్యర్థులు 63 నామినేషన్లు, జగిత్యాలలో 276 మంది అభ్యర్థులు 340 నామినేషన్లు, కోరుట్లలో 111 మంది అభ్యర్థులు 246 నామినేషన్లు, మెట్‌పల్లిలో 100 మంది అభ్యర్థులు 182 నామినేషన్లు, రాయికల్‌లో 33 మంది అభ్యర్థులు 57 నామినేషన్లు సమర్పించారు.