‘నామినేటెడ్’ ఆశలు
ABN , Publish Date - Apr 25 , 2026 | 01:50 AM
అధికార పార్టీ కాంగ్రెస్ పల్లె నేతల్లో నామినేటెడ్ ఆశలు ముందుకు వచ్చాయి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ పద్ధతిలో పాలకవర్గం నియమించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించడంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సింగిల్‌విండో సభ్యుల్లో నామినేటెడ్ సందడి మొదలైంది.
- ఎట్టకేలకు సహకార సంఘాల ఎన్నికలకు తెర
- 13 మంది సభ్యులతో సొసైటీ పాలక వర్గం
- జిల్లాలో 24 సహకార సంఘాలు.. 74,728 మంది సభ్యులు
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
అధికార పార్టీ కాంగ్రెస్ పల్లె నేతల్లో నామినేటెడ్ ఆశలు ముందుకు వచ్చాయి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ పద్ధతిలో పాలకవర్గం నియమించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించడంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సింగిల్‌విండో సభ్యుల్లో నామినేటెడ్ సందడి మొదలైంది. మంత్రివర్గ నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీలోని పెద్దల చుట్టూ పదవుల కోసం తిరగడం మొదలుపెట్టారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, సహకార మార్కెటింగ్ సమాఖ్య, రాష్ట్రస్థాయిలో మార్క్‌ఫెడ్, టెస్కాబ్‌లకు కూడా నామినేటెడ్ పాలకవర్గాలు రానుండడంతో పదవులు దక్కించుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. జిల్లాలో గత సంవత్సరంలో బీఆర్‌ఎస్ హయాంలో ఉన్న పాలకవర్గాల గడువు ముగిసినా ఎన్నికలు నిర్వహించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించింది. దీంతో కాంగ్రెస్ నేతల్లోనూ అసంతృప్తి వ్యక్తమైంది. సహకార సంఘాల పాలకవర్గాల పొడిగింపు సమయంలో కాంగ్రెస్ పార్టీలోకి వలస వచ్చిన ప్రతినిధులను మినహాయించి మార్పులు చేయడంతో కొందరు కోర్టుకు వెళ్లడం ప్రభుత్వానికి తలనొప్పి తెచ్చింది. ఈక్రమంలోనే సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించారని భావించారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే ఫలితాలు రావడంతో సహకార సంఘాల ఎన్నికలు సులభంగానే నెట్టుకురావచ్చని భావించి డీసీసీబీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీల పాలకవర్గాలను రద్దుచేసి ప్రత్యేక అధికారులను నియమించారు. కొద్ది రోజుల్లోనే ఎన్నికల విధివిధానాల కోసం ఎదురుచూస్తున్న క్రమంలో నామినేటెడ్ అంశం ముందుకు వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రస్తుతం 24 సంఘాలు ఉన్నాయి. సంఘాల పరిధిలో 74,728 మంది సభ్యులు ఉన్నారు. సిరిసిల్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో 12,859 మంది సభ్యులు ఉండగా, పెద్దూరు సొసైటీలో 1,336 మంది, నేరెల్ల సొసైటీలో 1,257 మంది, కోనరావుపేట సొసైటీలో 6,196 మంది, కొలనూరు సొసైటీలో 3,018 మంది, వేములవాడ సొసైటీలో 8,180 మంది, నాంపెల్లి సొసైటీలో 1,191 మంది, రుద్రవరం సొసైటీలో 998 మంది, చందుర్తి సొసైటీలో 3,369 మంది, సనుగుల సొసైటీలో 1,733 మంది, బోయినిపల్లి సొసైటీలో 910 మంది, కోరెం సొసైటీలో 1,694 మంది, మాన్వాడ సొసైటీలో 1,163 మంది, నర్సింగాపూర్ సొసైటీలో 1,684 మంది, ఇల్లంతకుంట సొసైటీలో 3,547 మంది, గాలిపెల్లి సొసైటీలో 1,680 మంది, ముస్తాబాద్ సొసైటీలో 2,082 మంది, పోత్గల్ సొసైటీలో 7,169 మంది, గంభీరావుపేట సొసైటీలో 8,183 మంది, కొత్తపెల్లి సొసైటీలో 3,680 మంది, ఎల్లారెడ్డిపేట సొసైటీలో 3,864 మంది, అల్మాస్‌పూర్ సొసైటీలో 2,139 మంది, తిమ్మాపూర్ సొసైటీలో 1,597 మంది, మానాల సొసైటీలో 199 మంది సభ్యులు ఉన్నారు.
జిల్లాలో 312 మందికి పదవులు..
జిల్లాలో 24 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. నామినేటెడ్ ద్వారా 312 మందికి పదవులు దక్కనున్నాయి. సహకార చట్టం ప్రకారం ప్రతి సొసైటీకి 13 మందితో పాలకవర్గం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందులో ఒకరు చైర్మన్, ఒక వైస్‌చైర్మన్, 11 మంది డైరెక్టర్లు ఉంటారు. ఎస్సీ మహిళా, ఎస్టీ జనరల్, బీసీ జనరల్‌కు మూడు డైరెక్టర్ పోస్టులను కేటాయించాల్సి ఉంటుంది. ఇదే మాదిరిగా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్, జిల్లా సహకార మార్కెటింగ్ సమాఖ్య, మార్క్‌ఫెడ్, టెస్కాబ్ పాలవర్గాలు కూడా నియమిస్తారు. ప్రభుత్వం మాత్రం సొసైటీలో సభ్యత్వం ఉన్నవారిని నామినేటెడ్ చేసే ఆలోచనలు ఉండడంతో సొసైటీలో అధికార పార్టీకి చెందిన సభ్యులు ముందుకు వస్తున్నారు. దీంతో జిల్లాలో మరోసారి అధికార పార్టీలో నేతల మధ్య నామినేటెడ్ చర్చలు మొదలయ్యాయి. ఇందుకు సంబంధించిన విధివిధానాలు ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి సొసైటీ సభ్యులు ఏర్పడింది.
వ్యాపార రంగాల్లోకి సహకార సంఘాలు
వ్యవసాయ సహకార పరపతి సంఘాల బలోపేతం వైపు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సహకార రంగంలో వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా రైతులకు విసృత సేవలు అందించే దిశగా చర్యలు తీసుకుంది. సహకార పరపతి సంఘాలను పునర్విభజన చేసే కార్యక్రమాలు జరుగుతుండగానే వ్యాపార రంగాల్లోకి సహకార సంఘాలను తీసుకవచ్చే దిశగా పరపతి సంఘాలను రైతు ఉత్పత్తిదారుల సంస్థలుగా మార్చుతుంది. ప్రస్తుతం సహకార సంఘాల ద్వారా విత్తనాలు, ఎరువుల విక్రయాలతో పాటు ధాన్యం కొనుగోళ్లతో లాభాలు ఆర్జిస్తున్నాయి. వీటి స్థానంలోనే రైతు ఉత్పత్తిదారుల సంస్థలుగా ఏర్పాటు చేసి ఇతర వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే దిశగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో 311 వ్యవసాయ సహకార పరపతి సంఘాలను రైతు ఉత్పత్తిదారుల సంస్థలుగా మార్పులు చేసింది. దీని ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని వ్యవసాయ పనిముట్లు అందుబాటులోకి తేవడం, ఇతర రంగాల్లోనూ అడుగుపెట్టే దిశగా ముందుకు చర్యలు చేపట్టింది. జిల్లాలో 24 వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో తొలి విడతగా ఆరు సంఘాలను రైతు ఉత్పత్తిదారుల సంస్థలుగా మార్పులు చేసింది. జిల్లాలో వేములవాడ, సనుగుల, నాంపల్లి, అల్మాస్‌పూర్, గంభీరావుపేట, ఇల్లంతకుంట సహకార సంఘాలను రైతు ఉత్పత్తిదారుల సంస్థలుగా మార్పులు చేసి సేవలు అందించనున్నారు. ఈ సంస్థల్లో వాటాదారులుగా చేర్చుకుంటారు. సభ్యులు తమ వాటాకు అనుగుణంగా ఈక్విటీగా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. ఈ సొసైటీలకు ఈక్విటీ వాటాగా కేంద్ర ప్రభుత్వం రూ.15 లక్షల వరకు ఒక్కో సొసైటీకి మ్యాచింగ్ గ్రాంట్ కింద అందిస్తుంది. మూడు సంవత్సరాల నిర్వహణకు ఏడాదికి రూ.6 లక్షల చొప్పున రూ.18 లక్షలు ఇస్తుంది. ప్రస్తుతం సహకార శాఖ అధికారులు ఉద్యోగులకే రైతు ఉత్పత్తి సంస్థల బాధ్యతలను అప్పగించనుంది. ఈ పథకానికి సంబంధించి ప్రత్యేక క్రెడిట్ గ్యారంటీ కింద నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. ఎన్‌సీడీసీ, నాబార్డ్ ద్వారా ఈ పథకాన్ని అమల్లోకి తీసుకరానున్నారు. రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, సహకార సంఘాలు వేర్వేరు లక్ష్యాలతో ఉన్న ఇవి రెండు ఒకే రకమైన సంస్థలుగా పనిచేస్తాయి. ఎఫ్‌పీవోలు ప్రధానంగా రైతుల ఆదాయం పెంచడానికి ఉత్పత్తులు పెంచడానికి, ప్రాసెసింగ్ చేయడంపై దృష్టి పెడతారు. రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపర్చే దిశగానే రైతు ఉత్పత్తి సంస్థలు పనిచేస్తాయి. సంస్థల ఏర్పాట్లకు ప్రభుత్వం రూ.18.96 లక్షలు అందించింది.