వానా లేదు సాగు లేదు
ABN , Publish Date - Jul 17 , 2026 | 12:41 AM
ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురియడం లేదు..
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
జిల్లాలో ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు కొనసాగుతుండటంతో రైతుల్లో పంటల సాగుపై రోజురోజుకు ఆందోళన పెరుగుతున్నది. ఇప్పటికే సాధారణం కంటే 30 శాతం తక్కువ లోటు వర్షపాతం నమోదవుతుండగా, రానున్న రోజుల్లోనూ వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోతే ఖరీఫ్ సాగుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. ఇప్పటి వరకు జిల్లా సగటు వర్షపాతం 294.0 మిల్లీ మీటర్లకుగాను, 206.7 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోద య్యింది.ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేందుకు రైతులను ప్రోత్సహించేందుకు అధికారులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. వ్యవసాయ శాఖ రూపొందించిన ఎల్‌నినో ప్రభావ అంచనాల ప్రకారం జిల్లాలోని 263 గ్రామాలు మోస్తరు ప్రభా వానికి గురయ్యే అవకాశం ఉంది. తీవ్ర, స్వల్ప ప్రభావం ఉన్న గ్రామాలు లేనప్పటికీ, వర్షపాతం అనిశ్చితంగా ఉండే పరిస్థితుల్లో పంటల ఎంపిక విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా వర్షాధారంగా సాగు చేసే రైతులు తక్కువ కాలంలో పండే, తక్కువ నీటితో సాగయ్యే పంటలను ఎంచుకోవడం వల్ల నష్టాలను కొంతవరకు తగ్గించుకోవచ్చని వ్యవసాయ నిపుణులు సూచిస్తు న్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు జిల్లా వ్యవసాయ శాఖ ఈ నెలాఖరు వరకు 89,892 ఎకరాల్లో ప్రత్యామ్నాయ పం టల ప్రణాళికను రూపొందించి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
ఫ జిల్లాలో 89,892 ఎకరాల్లో పంటల సాగు..
జిల్లాలో ఈ సీజన్‌లో 2,75,806 ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు అం చనా వేశారు. జూలై 15 నాటికి 91,136 ఎకరాల్లో మాత్రమే సాగు పూర్తయింది. ఇందులో 10,510 ఎకరాలు వర్షాధార పంటలు, 80,626 ఎకరాలు సాగునీటి ఆధారిత పంటలు ఉన్నాయి. ఖరీఫ్ లక్ష్యానికి అనుగుణంగా చూస్తే ఇంకా 1,84,671 ఎకరాల్లో సాగు ప్రారంభం కావాల్సి ఉంది. వర్షాలు ఆలస్యం అవుతుండటంతో అనేక ప్రాంతాల్లో రైతులు వరి నార్లు పోసుకున్నప్పటికీ పొలాలు దున్ని నాట్లు వేయలేని పరిస్థితి నెలకొన్నది. దీంతో ఆకాశం వైపు దిక్కులు చూస్తున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈనెల 16 నుంచి 31 వరకు 89,892 ఎకరాల్లో వివిధ పంటల సాగు చేపట్టేలా వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించింది. ఇందులో 84,500 ఎకరాల్లో వరి సాగు ప్రధానంగా ఉండగా, 1,814 ఎకరాల్లో కందులు, 1,182 ఎకరాల్లో పెసర, 186 ఎకరాల్లో మినుములు, 136 ఎకరాల్లో అలసందలు, 16 ఎకరాల్లో ఉలవలు, 8 ఎకరాల్లో ఆముదం, 925 ఎకరాల్లో మొక్కజొన్న, 3 ఎకరాల్లో పశుగ్రాస జొన్న, 471 ఎకరాల్లో కూరగాయలు, 651 ఎకరాల్లో ఇతర పంటలను కూడా సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వర్షాభావ పరిస్థితుల్లో పప్పుధాన్యాలు, ఇతర ప్రత్యామ్నాయ పంటల సాగు పెరిగితే రైతులకు కొంత మేర ఆదాయం లభించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రతిపాదిత సాగుకు అవసరమైన 17,259.03 క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని అంచనా వేయగా, జిల్లాలో ఇప్పటికే 21,564.44 క్వింటాళ్ల విత్తనాలు నిల్వ ఉన్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బి శ్రీనివాస్ పేర్కొన్నారు. దీంతో రైతులకు విత్తనాల కొరత తలెత్తే పరిస్థితి లేదని, అవసరమైన ప్రాంతాలకు వెంటనే విత్తనాలు చేరేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
ఫ రైతువేదికల్లో అవగాహన కార్యక్రమాలు..
ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాభావం నెలకొన్న నేపథ్యంలో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక, విత్తనాల వినియోగం, నీటి యాజమాన్య పద్ధతులు, పంటల సంరక్షణపై వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖాధికారులు, రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్‌లు కలిసి రైతువేదికల్లో అవగాహన కల్పిస్తున్నారు. అలాగే పొలాలు, చేన్ల వద్దకు వెళ్లి, చుట్టూ పక్కల ఉండే రైతులందరినీ ఒక చోటికి చేర్చి అక్కడ కూడా ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షాలు తగ్గే పరిస్థితులు ఏర్పడితే రైతులు సంప్రదాయ సాగుపై పూర్తిగా ఆధారపడకుండా ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవడం ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. జిల్లాలో రానున్న రెండు వారాలు ఖరీఫ్ సాగుకు కీలకంగా మారనున్న నేపథ్యంలో రైతులు వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వ్యవసాయ శాఖ సూచనల మేరకు సాగు పనులు చేపట్టాల్సిన అవసరం ఉందని కలెక్టర్ పేర్కొంటున్నారు.