Share News

అల్పాహారం.. మధ్యాహ్న భోజనం లేదు..

ABN , Publish Date - Jun 17 , 2026 | 12:10 AM

జిల్లాలో 11 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. వీటిలో ఒక్క కళాశాలనూ మధ్యాహ్న భోజన పథకం, అల్పాహార పథకానికి ఎంపిక చేయలేదు.

అల్పాహారం.. మధ్యాహ్న భోజనం లేదు..

కరీంనగర్‌ టౌన, జూన 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 11 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. వీటిలో ఒక్క కళాశాలనూ మధ్యాహ్న భోజన పథకం, అల్పాహార పథకానికి ఎంపిక చేయలేదు. దీంతో ఇంటర్‌ విద్యార్థులకు ఈ యేడు మధ్యాహ్నభోజనం, అల్పాహారం (బ్రేక్‌ఫాస్ట్‌) ఉంటుందో లేదోనన్న చర్చ జరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరం నుంచి ఇంటర్‌ విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తామని ప్రకటించింది. జూనియర్‌ కళాశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్కులు, బ్యాగ్‌ తదితర వస్తువులతోకూడిన కిట్‌ను అందిస్తామని తెలిపింది. దీనితో ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని భావించారు. కానీ జిల్లాలో పాఠ్యపుస్తకాలు తప్ప మిగతావేవి అందలేదు.

ఫ అడ్మిషన్ల కోసం ఆరాటం

రాష్ట్రవ్యాప్తంగా 404 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉండగా తొలి విడతలో 76 కళాశాలలను పైలట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది. వీటిలో 33 కళాశాలల విద్యార్థులకు బ్రేక్‌ ఫాస్ట్‌తోపాటు మధ్యాహ్నభోజనం, మరో 43 కళాశాలలకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ఈనెల 1 నుంచి కళాశాలలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్న భోజనం, అల్పాహారం, పాఠ్యపుస్తకాలు, నోట్‌ బుక్స్‌తో కూడిన కిట్స్‌ ఉచితంగా అందిస్తామని, వీటితోపాటు నాణ్యమైన విద్యకూడా అందుతుందని ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లు తీసుకోవాలంటూ ఆయా కళాశాలల అధ్యాపకులు, ప్రిన్సిపాల్స్‌ ప్రచారం చేస్తున్నారు. జిల్లాలోని కొన్ని చోట్ల బడిబాట కార్యక్రమం మాదిరిగా లెక్చరర్లు, ప్రిన్సిపాల్స్‌ కళాశాలల పరిధిలోని కాలనీలు, గ్రామాలకు వెళ్లి పిల్లలను కళాశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులను కోరుతున్నారు. గత సంవత్సరం జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థుల అడ్మిషన్ల సంఖ్య నాలుగు వేల వరకు ఉండగా ఈయేడు ఆ సంఖ్యను ఐదు వేలకు పెంచాలని బోర్డు ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఉన్నతాధికారులు ప్రిన్సిపాల్స్‌, లెక్చరర్లకు టార్గెట్‌ విధించారు. ప్రభుత్వం ప్రకటించినట్లు విద్యార్థులకు బ్రేక్‌ ఫాస్ట్‌, మధ్యాహ్న భోజనం పెడితే లక్ష్యాన్ని చేరుకోవచ్చని లెక్చరర్లు భావించారు. తొలి విడత ఎంపిక చేసిన పైలట్‌ ప్రాజెక్టులో ఉమ్మడి జిలా నుంచి ఒక్క కళాశాలను ఎంపిక చేయకపోవడంతో విద్యార్థులు, సిబ్బంది నిరాశ చెందారు. జిల్లాలోని కళాశాలలపై ప్రభుత్వం వివక్ష చూపడం సరికాదని, తొలివిడతలో ఒకటి, రెండు కళాశాలలనైనా ఎంపిక చేసి మలి విడతలో మిగిలిన కళాశాలలకు మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరిస్తే బాగుండేదని అభిప్రాయ పడుతున్నారు. మరోవైపు విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రభుత్వం ప్రకించిన విధంగా కిట్స్‌, బ్రేక్‌ఫాస్ట్‌, లంచ అందించాలని కోరుతున్నారు. పైలెట్‌ ప్రాజెక్టుకు ఎంపిక చేసిన కళాశాలల్లో సక్సెస్‌ విధానాన్ని బట్టి రాష్ట్రంలోని అన్ని కళాశాలల్లోని విద్యార్థులకు ఈపథకాన్ని విస్తరించి అందరికీ మధ్యాహ్నభోజనం, బ్రేక్‌ఫాస్ట్‌ అందిస్తుందని అధికారపార్టీ నాయకులు అంటున్నారు.

Updated Date - Jun 17 , 2026 | 12:10 AM