బడ్జెట్‌లో నూతన సంక్షేమ పథకాలు
ABN , Publish Date - Mar 21 , 2026 | 01:44 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ జనరంజకంగా ఉందంటూ అధికార పక్షం ప్రశంసిస్తుంటే విపక్షాలు మాత్రం భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెడుతున్న పథకాల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం, కేజీ టు ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు అల్పాహా రం, మధ్యాహ్న భోజనం అందించే పథకం, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు రహిత ఆరోగ్యభద్రతా పథకం, ఐటీఐ, ఏటీసీలలో చదివే విద్యార్థులకు నెలకు 2 వేల ఉపకార వేతనాలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించుకొని బడ్జెట్‌లో కేటాయింపులు చేసింది.
- ఇది జనరంజక బడ్జెట్ : అధికార కాంగ్రెస్
- పెదవి విరుస్తున్న ప్రతిపక్షం
- నిధుల కేటాయింపులపై భిన్నాభిప్రాయాలు
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ జనరంజకంగా ఉందంటూ అధికార పక్షం ప్రశంసిస్తుంటే విపక్షాలు మాత్రం భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెడుతున్న పథకాల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం, కేజీ టు ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు అల్పాహా రం, మధ్యాహ్న భోజనం అందించే పథకం, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు రహిత ఆరోగ్యభద్రతా పథకం, ఐటీఐ, ఏటీసీలలో చదివే విద్యార్థులకు నెలకు 2 వేల ఉపకార వేతనాలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించుకొని బడ్జెట్‌లో కేటాయింపులు చేసింది. ఇంది రమ్మ కుటుంబ బీమా పథకంతో రాష్ట్ర వ్యాప్తంగా 1.15 కోట్ల కుటుంబాలకు లబ్ధిచేకూర నుండగా జిల్లాలోని 3 లక్షల పైచిలుకు కుటుంబాలు ఈ పథకంతో ప్రయోజనం పొందను న్నాయి. ఆదాయ పరిమితులు లేకుండా ప్రతి కుటుంబానికి దీనిని వర్తింపజేయాలని నిర్ణయిం చడం ప్రజలందరూ హర్షిస్తున్నారు. అర్హులైన వారందరికీ చేయూత పథకం ద్వారా 2 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేస్తామని ప్రకటిస్తూ ప్రభుత్వం బడ్జెట్‌లో 14,861 కోట్లను కేటాయించింది. జిల్లాలో ఈ పథకం కింద 6 నుంచి 7 వేల మందికి ఈ పెన్షన్ లభించే అవకాశమున్నది. కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం అందించే పథకంలో 25వేల విద్యార్థులు ప్రయోజనం పొందనున్నారు. ఉద్యోగుల బీమా పథకా న్ని తొలిసారిగా రాష్ట్రంలోనే ప్రవేశపెడుతున్నారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరణిస్తే కోటి 20 లక్షల రూపాయల ప్రమాద బీమా వర్తిస్తుంది. యువతకు వివిధ రంగాలలో తగిన నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు వివిధ దేశాల్లో ఉపాధి పొందేందుకు వీలుగా భాషాజ్ఞానం కల్పించడం, వీసా పొందేందుకు సూచనలివ్వడం, విదేశీ ప్రయాణానికి కావ లసిన సేవలందించడానికి సీఎం ఓవర్సీస్ ఎంప్లాయిమెంట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనున్నారు. దీనితో విదేశీ విద్యకు వెళ్లే విద్యార్థులందరూ ప్రయోజనం పొందనున్నారు. నగదు రహిత ఆరోగ్యభద్రతా పథకం ఉద్యోగస్తులకు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూర్చనున్నది. జిల్లాలో ఉన్న ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు సుమారు 60వేల మంది ప్రయోజనం పొందనున్నారు. ఏటీసీలో శిక్షణ పొందేవారికి 2వేల రూపాయల స్కాలర్‌షిప్ ఇవ్వాలని నిర్ణయించడం కూడా ప్రజలు హర్షిస్తున్నారు. 3,24,234 కోట్లతో 2026-27 వార్షిక బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థికశాఖమంత్రి, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క అసెంబ్లీలో శుక్రవారం ప్రవేశపెట్టారు. దేశంలోనే తెలంగాణ ను నెంబర్-1గా నిలుపుతామని, రాష్ట్ర బడ్జెట్‌లో రైతు సంక్షేమం, మహిళాసాధికారత, యువతకు ఉపాధి కల్పించడానికి ప్రాధాన్యతనిచ్చామని ఆయన ప్రకటించారు. ఈబడ్జెట్‌పై వెల్లడైన అభిప్రాయాలు.. వారి మాటల్లో..
ఫ ప్రజా వంచన బడ్జెట్ ఇది
- కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్
రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ పూర్తిగా మోసం.. దగా.. ప్రజా వంచన బడ్జెట్. కరీంనగర్‌లో ఆయన బడ్జెట్‌పై మాట్లాడారు. కేటాయింపుల ప్రగాల్భాలే తప్ప ఒరిగిందేమీ లేదు. ఆదాయాన్ని పండబెట్టి, అప్పుల కోసం అర్రులు చాచే బడ్జెట్ ఇది. మరో లక్ష కోట్లు అదనంగా అప్పు భారం మోపేం దుకు సిద్ధమవ్వడం సిగ్గుచేటు. కేంద్రంపై ఆధారపడటం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదు. రైతుభరోసా పైసలు రెండు విడతలు ఎగ్గొట్టారు. రూపాయి బిళ్ల కూడా ఇవ్వకుండా కౌలు రైతులు, వ్యవసాయ కూలీల నోట్లో మళ్లీ మట్టికొట్టారు. మహిళలను మళ్లీ వంచించారు. తులం బంగారం తుస్.. రూ.2,500 నిల్. అవ్వాతాతల నోట్లో మట్టి కొట్టారు. రూ.4వేల పెన్షన్ పెంపు ఊసే లేదు. నిరుద్యోగులున్నారనే సోయే లేదు. బడ్జెట్‌లో నిరుద్యోగ భృతి అంశమే లేదు. విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు కాదు రూపాయి బిళ్ల కేటాయించలేదు. ఆరు గ్యారెంటీలకు పాడె కట్టే బడ్జెట్ ఇది. విద్యకు 16శాతం నిధులు కే టాయించాలని విద్యాశాఖ కమిషన్ ప్రతిపాదిస్తే 8శాతానికే పరిమితమయ్యారు. దేవాదాయశాఖకు గత బడ్జెట్‌లో రూ.190 కోట్లు కేటాయిస్తే, ఈసారి కేటాయింపుల ప్రస్తావనే లేదు. 12 ఏళ్ళకు ఒకసారి వచ్చే పుష్కరాలకు కంటి తుడుపు కేటాయింపులు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేశారు. మైనార్టీలకు గత ఏడాదికంటే ఎక్కువ నిధులు కేటాయించడం విడ్డూరం.
ఫ జనరంజక బడ్జెట్
- డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
రాష్ట్ర ఆర్థికశాఖమంత్రి భట్టివిక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ జనరంజకంగా ఉంది. కొత్తగా అమలు చేయనున్న పలు పథకాలతో పేద,మధ్యతరగతి ప్రజలకు మేలుకలుగనున్నది. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు ఇవ్వడం సాహసోపేతమైన నిర్ణయం. ఈ పెన్షన్లు వారి జీవితాల్లో వెలుగులు నింపనున్నాయి. ఎల్‌కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులందరికీ బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందనున్నది. ఉద్యోగులకు, పెన్షనర్లకు క్యాష్‌లెస్ వైద్యం అందించేందుకు, అలాగే ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం అమలుతో అన్ని కుటుంబాలకు బీమా సౌకర్యం కలుగనున్నది. మొత్తంగా అన్ని రంగాలకు, అన్నివర్గాల ప్రజలకు ఈ బడ్జెట్ ప్రయోజనం చేకూర్చనున్నది.
ఫ రాష్ట్ర సంక్షేమానికి విరుద్ధంగా ఉన్న బడ్జెట్
- బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు
రాష్ట్ర బడ్జెట్ పూర్తిగా సంక్షేమానికి విరుద్ధంగా, ప్రజలను నిరాశపరిచే విధంగా ఉంది. ఆరు గ్యారంటీల అమలుపై ఎలాంటి స్పష్టత లేదు. మహిళలకు తులం బంగారం, స్కూటీ పథకాలకు నిధుల కేటాయింపులు లేవు. జాబ్ క్యాలెండర్‌పై ఒక్క మాట లేదు. రైతు సంక్షేమానికి సరైన ప్రాఽధాన్యం ఇవ్వలేదు. యువతకు కొత్త ప్రాజెక్టులు, ఉపాధి అవకాశాలపై ఎలాంటి దృష్టిలేదు. విద్యావ్యవస్థ బలోపేతంపై కూడా స్పష్టమైన ప్రణాళిక కనిపించలేదు. ఇది కేవలం కాగితాల మీద ఉన్న బడ్జెట్ మాత్రమే. ఢిల్లీ పార్టీ ప్రయోజనాల కోసం పనిచేస్తున్న బడ్జెట్‌లాగా అనిపిస్తోంది.
ఫ ఆరు గ్యారెంటీలకు కేటాయింపులు లేవు
- గంగాడి కృష్ణారెడ్డి , బీజేపీ జిల్లా అధ్యక్షుడు
రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌లోనైనా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తారని ప్రజలు ఎంతో ఆశగా ప్రజలు ఎంతో ఆశగా చూశారని, మళ్లీ వాళ్ల ఆశలపై కాంగ్రెస్ నీళ్లు చల్లింది. బడ్జెట్‌లో కాంగ్రెస్ హామీలకు, ఆరు గ్యారంటీలకు కేటాయింపులే లేవు. మహిళలకు రూ.2,500, చేయూత కింద ఇస్తామన్న రూ.4వేల పింఛన్ అతీగతీ లేదు. తులం బంగారం, నిరుద్యోగ భృతికి కేటాయింపులు లేవు. బడ్జెట్ అంకెలు కేటాయింపులు మాత్రమే.
ఫ అందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్
- కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి , సుడా చైర్మన్
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అందరికీ ఆమోదయోగ్యంగా ఉంది. అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాలకు, ఆరు గ్యారంటీలకు అధిక నిధులు కేటాయించడం, ఇందిరమ్మ ఇళ్లకు పెద్దపీట వేడయం హర్షనీయం. ప్రజా రవాణాకు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి, విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. 2 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు ఇవ్వడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజలు అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లే విధంగా బడ్జెట్‌ను రూపకల్పన చేశారు. ప్రభుత్వానికి ప్రజలు అభినందనలు తెలిపే సమయం.
ఫ అత్యంత నిరాశజనకంగా రాష్ట్ర బడ్జెట్
- బీజేపీ రాష్ట్ర అధికారప్రతినిధి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్‌రావు
రాష్ట్ర ఆర్థికమంత్రి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలను నిరాశపరిచే విధంగా ఉంది. ఐదు దఫాలుగా రైతుభరోసా ఇవ్వాల్సి ఉండగా సరిగ్గా ఇవ్వకపోవడంతో ప్రతి రైతుకు ఎకరాకు 45వేలకుపైగా బాకీపడి ఎగ్గొట్టారు. నిరుద్యోగ భృతి 4వేలు, మహిళలకు 2.500 ఆర్థిక సాయం ఊసేలేదు. బడ్జెట్ అంకెల ఆర్భాఆటలు, కేటాయింపుల ప్రగాల్బాలే తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు. ఆదాయం పెంచలేని ప్రభుత్వం, మరో లక్ష కోట్ల అదనంగా అప్పుల భారం మోపేందుకు సిద్ధమవ్వడం సిగ్గు చేటు. కేంద్రంపై ఆధారపడటం తప్ప రాష్ట్రప్రభుత్వం స్వయంగా చేసిన అభివృద్ధి ఏదీ లేదు. అంకెల గారడీతో ప్రజలను మోసం చేసే బడ్జెట్.
ఫ ప్రజలను మభ్యపెట్టే బడ్జెట్
- మిల్కూరి వాసుదేవరెడ్డి , సీపీఎం జిల్లా కార్యదర్శి
బడ్జెట్ ప్రజలను మభ్యపెట్టే విధంగా ఉంది. అంకెలగారడీ తప్ప ఒరిగిందేమీ లేదు. ఉత్పాదక రంగాలకు తగినంత నిధులు కేటాయించలేదు. జిల్లా కేంద్రంలోని దశాబ్దకాలంగా ఉన్న డంపుయార్డు సమస్య ఊసేలేదు. పెండింగ్ రైల్వే లైన్లకు అలకేషన్స్ లేవు. ఇరిగేషన్ శాఖకు కేవలం 22,615 కోట్లు మాత్రమే కేటాయించారు. ఉన్నత విద్యపై ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదని తేలింది. విద్యాకమిషన్ సిఫారసుల మేరకు నిధులు కేటాయింపులు లేవు. 9,500 కోట్లకు పైగా ఉన్న ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిల, అసంఘటిత కార్మికుల ఊసేలేదు.
ఫ జిల్లా అభివృద్ధిపై బడ్జెట్‌లో ఎలాంటి ప్రస్తావన చేయలేదు
- పంజాల శ్రీనివాస్, సీపీఐ జిల్లా కార్యదర్శి
రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తుంటే ఆడంబరంగా అంకెల్లో భారీ బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ అమలుచేయడానికి మాత్రం ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకుండా పోతున్నాయి. 5 లక్షల ప్రమాద బీమా, విద్యార్థులకు మధ్యాహ్నభోజనం, అల్పాహారం, ఉద్యోగు లకు ప్రమాదబీమా మంచిదే అయినప్పటికీ పేదలకు ఇండ్లు, పెన్షన్లు ఇవ్వక పోవడం దారుణం. కరీంనగర్ జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ప్రత్యేకించి బడ్జెట్‌లో ప్రస్తావన లేక పోవడం దారుణం. మానేరు రివర్‌ఫ్రంట్, కేబుల్ బ్రిడ్జి పురోగతికి నిధులు కేటాయించలేదు.
ఫ బీసీ సంక్షేమానికి నిధుల కేటాయింపులో వివక్ష
- గుంజపడుగు హరిప్రసాద్, తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు
రాష్ట్ర ఆర్థికమంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ ప్రజలను ముఖ్యంగా మహిళలను పూర్తిగా నిరాశపరిచింది. ఆరు గ్యారంటీల్లో అతి ముఖ్యమైన నెలకు 2,500 రూపాయలు ఇవ్వ కుండా మహిళలను మోసం చేసింది. బీసీ డిక్లరేషన్‌లో బీసీ సంక్షేమానికి ప్రతి సంవత్సరం 20వేల కోట్లను కేటాయిస్తామని చెప్పి కేవలం 12వేల కోట్లు మాత్రమే కేటాయించి బీసీలను నయవంచనకు గురిచేసింది.
ఫ దేవాదాయశాఖకు నిధులు కేటాయించక పోవడం సిగ్గుచేటు
- జనసేన పార్టీ పార్లమెంట్ కో ఆర్డినేటర్ బేతి మహేందర్‌రెడ్డి
సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మైనార్టీలపట్ల ఉన్న ప్రేమ మెజార్టీ హిందూ దేవాలయాలపై లేదు. దేవాదాయశాఖకు ఈసారి బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా కేటాయించక పోవడం సిగ్గుచేటు. హిందూ దేవాలయాల నుంచి వచ్చే ఆదాయాన్ని బడ్జెట్ రూపేణా మైనార్టీశాఖకు మళ్లించడం కాంగ్రెస్ ప్రభుత్వ ద్వంద వైఖరి తేటతెల్లమైంది.
ఫ రిటైర్డు ఉద్యోగులకు బడ్జెట్‌లో మొండి చేయి
- రిటైర్డు ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ కోహెడ చంద్రమౌళి
రాష్ట్రంలో 2024 మార్చి నుంచి రిటైర్డు అయిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావలసిన బకాయిలను ఈ బడ్జెట్‌లో కేటాయిస్తారని ఆశించిన రిటైర్డు ఉద్యోగులకు ప్రభుత్వం మొండి చేయి చూపించింది. పదవీ విరమణ పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులు రెండేళ్లు గడిచినా వారికి రావలసిన బకాయిలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బడ్జెట్‌లో బకాయిల ఊసెత్తలేదు.