ధాన్యం తరలింపులో నూతన విధానం..
ABN , Publish Date - Apr 29 , 2026 | 12:47 AM
రైస్‌మిల్లుల సామర్థ్యానికి మించి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి ఇష్టారాజ్యంగా ధాన్యం పంపించకుండా ఉండేందుకు ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకవచ్చింది.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
రైస్‌మిల్లుల సామర్థ్యానికి మించి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి ఇష్టారాజ్యంగా ధాన్యం పంపించకుండా ఉండేందుకు ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకవచ్చింది. ఈ సీజన్ నుంచి కేంద్రాల వారీగా రైస్‌మిల్లుల కేటాయింపు లేకుండా ఆన్‌లైన్‌లో రైతుల వివరాలు, వాళ్లు కేంద్రానికి తీసుకవచ్చిన ధాన్యం తూకం వివరాలు నమోదు చేసిన వెంటనే జనరేట్ అయ్యే మిల్లుకే ధాన్యాన్ని పంపించాల్సి ఉంటుంది. దీంతో ఆయా రైస్‌మిల్లర్లు సకాలంలో ధాన్యాన్ని మర ఆడించి సీఎంఆర్ కింద బియ్యం పెట్టేం దుకు సంబంధిత అధికారులు పర్యవేక్షించడానికి సులువుగా ఉం టుంది. అంతేగాకుండా సంబంధిత అధికారులపై రైస్‌మిల్లర్లు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల నుంచి తీసుకవచ్చే ఒత్తిళ్లకు లొంగకుండా, అధికారులు సైతం అక్రమాలకు పాల్పడకుండా ఉం డేందుకు ఈ విధానం తోడ్పడనున్నది
ఫ 4.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం..
జిల్లాలో ఈ యాసంగి సీజన్‌లో 2 లక్షల ఎకరాల్లో రైతులు వరి పంటను సాగు చేశారు. తద్వారా వచ్చే పంటను కొనుగోలు చేసేం దుకు జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఐకేపీ ద్వారా 345 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పది రోజుల నుంచి జిల్లాలో వరి కోతలు నడుస్తుండగా, కేంద్రాల్లో కొనగోళ్లు కూడా చేపట్టారు. కేంద్రాల ద్వారా 4 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. యాసంగిలో పండించే ధాన్యం ఎక్కువగా నూక అవుతుంది రైతులు మొత్తం పంటను కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధరలు పొందుతారు. జిల్లాలో 250కి పైగా రైస్‌మిల్లులు ఉండగా, 114 మిల్లులకు ధాన్యం ఇవ్వాలని కలెక్టర్, పౌరసరఫరాల శాఖాధికారులు నిర్ణయించారు. సీఎంఆర్ బియ్యం డెలివరీ విషయంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ డి వేణు, సివిల్ సప్లయ్ డీఎం శ్రీకాంత్ రెడ్డి, డీఎస్‌వో శ్రీనాధ్ ప్రత్యేక దృష్టి సారించడంతో 2024-25 వానాకాలం సీజన్‌లో వంద శాతం, యాసంగిలో 93 శాతం, 2025-26లో వానాకాలం సీజన్‌లో 36 శాతం పూర్తి చేశారు. డిఫాల్టర్ మిల్లులకు గాకుండా బ్యాంకు గ్చారంటీలు ఇచ్చిన వారికి ఆయా మిల్లుల సామర్ధ్యం ఆధారంగా ధాన్యాన్ని ఇవ్వనున్నారు. 112 రైస్‌మిల్లుల సామర్థ్యం 3 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఉంటుందని పౌరసరఫరాల శాఖాధికారులు చెబుతున్నారు.
ఫ గతంలో సామర్థ్యానికి మించి కేటాయింపులు..
గతంలో ఆయా రైస్‌మిల్లుల మిల్లింగ్ సామర్థ్యానికి మించి ధాన్యాన్ని ఇవ్వడంతో సకాలంలో సీఎంఆర్ పూర్తి కాలేదు. కొందరు మిల్లర్లు ఇదే అదనుగా జాప్యం చేస్తూ సర్కార్ ధాన్యాన్ని పక్కదారి పట్టించారు. దానిని తిరిగి ఇచ్చేందుకు మీనమేషాలు లెక్కించ డంతో ప్రభుత్వం కొరఢా ఝుళిపించింది. కొందరు మిల్లర్లపై క్రిమినల్ కేసులను సైతం నమోదు చేసింది. ప్రభుత్వానికి బియ్యం బకాయిపడిన మిల్లర్లకు 3 నెలల అవకాశం ఇవ్వడంతో బియ్యం పెడుతున్నారు. ఈసారి డిఫాల్టర్లకు ధాన్యం ఇవ్వకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నారు. అంతేగాకుండా సామర్థ్యానికి మించ కుండా ధాన్యం ఇవ్వకుండా ఆన్‌లైన్ విధానాన్ని తీసుకవచ్చారు. కేంద్రాల్లో రైతులు ధాన్యం విక్రయించిన వెంటనే రైతుల వివరాలు, ధాన్యం వివరాలు నమోదు చేసిన వెంటనే ఆ ధాన్యాన్ని ఏ రైస్ మిల్లుకు తరలించాలో ఆ మిల్లు పేరు ఆటోమేటిక్‌గా ఆన్‌లైన్‌లో జనరేట్ అవుతుంది. ఒక కొనుగోలు కేంద్రం నుంచి ఒకే రైస్ మిల్లుకు గాకుండా వేర్వేరు రైస్‌మిల్లులకు ధాన్యం తరలనున్నది.