నైపుణ్యాల వెలికితీతకే నూతన ఆవిష్కరణలు
ABN , Publish Date - Mar 01 , 2026 | 12:42 AM
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నైపుణ్యాలను వెలికి తీసేందుకే రాష్ట్ర ప్రభుత్వం నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహాన్ని అందిస్తోందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.
- రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
మంథని, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నైపుణ్యాలను వెలికి తీసేందుకే రాష్ట్ర ప్రభుత్వం నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహాన్ని అందిస్తోందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో టీవర్క్ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన ఇన్నోవేషన ఎక్స్‌పో-2026 కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొని మాట్లాడారు. డ్రీమ్ రైస్ స్టార్ట్ నినాదంతో ఇన్నోవేషన ఎక్స్‌పో-26ను మంథనిలో ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. మంథనిలో ఉన్న టీవర్క్ యూనిట్స్ బృందం కలెక్టర్ సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో పర్యటిస్తూ విద్యార్థులు నూతన అవిష్కరణపై ఆసక్తిని పెంపొందించే దిశగా కృషి చేశారన్నారు. నూతన ఆవిష్కరణలు పట్టణాలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తామన్నారు. 2034 నాటికి తెలంగాణను ట్రిలియన డాలర్ల ఆర్థికశక్తిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. అనంతరం కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ.. టీవర్క్ యూనిట్‌ను మంథనిలో ఏడు నెలల క్రితం ప్రారంభించామని, ఇక్కడ పిల్లలు అనేక నూతన అవిష్కరణ చేసేందుకు ఉత్సాహంగా ముందుకు వచ్చారని తెలిపారు. జిల్లాలో ముందస్తుగా 20 ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ఆధారిత బోధన, కృతిమ మేధస్సు పై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక తరగతులను నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో టీవర్క్ సీఈవో జోగేందర్, మున్సిపల్ చైర్మన వొడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన ముస్కుల సహేందర్‌రెడ్డి, ఆర్డీవో సురేష్, మున్సిపల్ కమిషనర్ మనోహర్, తహసీల్దార్ ఆరీఫోద్దీన పాల్గొన్నారు.