Share News

నిఘా నీడలో ‘నీట్‌’

ABN , Publish Date - Jun 21 , 2026 | 12:23 AM

వైద్య విద్యలో ప్రవేశానికి రాయాల్సిన నేషనల్‌ ఎలిజిబిలిటి కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (నీట్‌) రీ-ఎగ్జామ్‌కు అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.

నిఘా నీడలో ‘నీట్‌’

కరీంనగర్‌ టౌన్‌, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): వైద్య విద్యలో ప్రవేశానికి రాయాల్సిన నేషనల్‌ ఎలిజిబిలిటి కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (నీట్‌) రీ-ఎగ్జామ్‌కు అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.15 వరకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఆధ్వర్యంలో పెన్‌ అండ్‌ పేపర్‌ విధానంలో నిర్వహించే ఈ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దివ్యాంగ విద్యార్థులు పరీక్ష రాసేందుకు అదనపు సమయాన్ని కేటాయించారు. వారు సాయంత్రం 6.20 గంటల వరకు పరీక్షలు రాసేందుకు అనుమతిస్తారు. గత నెల 3న నిర్వహించిన నీట్‌ను రద్దు చేసి రీ ఎగ్జామ్‌ నిర్వహిస్తుండడంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. సోషల్‌ మీడియాలో ఈ పరీక్షపై అనేక వదంతులు, తప్పుడు వార్తలు వస్తుండడంతో విద్యార్థులకు సలహాలు, సూచనలిచ్చేందుకు అదనపు కలెక్టర్‌ డి శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. హెల్ప్‌లైన్‌ నంబర్‌ 08782997247కు అభ్యర్థులు ఫోన్‌ చేసి వివరాలను తెలుసుకునేందుకు శని, ఆదివారాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు ప్రత్యేక విధులను అప్పగించి విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తున్నారు. జిల్లాలో ఏడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రశ్నపత్రాలను జీపీఎస్‌ అమర్చిన వాహనాల్లో పోలీసు బందోబస్తు మధ్య తరలించడంతోపాటు పరీక్షా కేంద్రాల్లో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేసి కేంద్ర కంట్రోల్‌ రూమ్‌ నుంచి పరీక్షలను పర్యవేక్షిస్తారు.

ఫ ఉదయం 11 నుంచి అనుమతి

ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత పరీక్షా కేంద్రం ప్రధాన ద్వారాన్ని మూసివేస్తారు. ఆ తర్వాత వచ్చే విద్యార్థులను పరీక్షలకు అనుమతించరు. విద్యార్థులు ఒరిజినల్‌ గుర్తింపుకార్డుతో హాజరు కావాలని సూచించారు. మొబైల్‌ ఫోన్‌తోపాటు మరే ఇతర వస్తువులను అనుమతించరు. బయో మెట్రిక్‌ అటెండెన్సు ఉంటుందని, విద్యార్థులు నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. విద్యార్థుల కోసం ఎన్‌టీఏ 91 7827980287 నెంబరుతో ఒక అధికారిక వాట్సాప్‌ నంబర్‌ను ప్రకటించింది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ పేరుతో ఉండే ఈ ఖాతాకు బ్లూటిక్‌ ఉంటుంది. విద్యార్థుల పరీక్షా కేంద్రాల వివరాలు, అప్‌డేట్స్‌ను ఈ నంబరు నుండి పంపిస్తామని తెలిపింది. బ్లూ టిక్‌ లేకుండా ఈ నంబరుతో ఎవరైనా వాట్సాప్‌కు మెస్సేజ్‌ పంపిస్తే వాటిని నమ్మకూడదని సూచించింది.

ఫ పరీక్షా కేంద్రాలు :

కరీంనగర్‌లో నీట్‌ రీ ఎగ్జామ్‌ కోసం ఏడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎస్‌ఆర్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ మహిళా డిగ్రీ క ళాశాల, అల్గునూర్‌ కేంద్రీయ విద్యాలయం, సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ స్కూల్‌, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాల, చింతకుంట ఎస్సీ రెసిడెన్షియల్‌ స్కూల్‌, కేబుల్‌ బ్రిడ్జి సమీపంలోని ప్రభుత్వ మైనార్టీ స్కూల్‌లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఏడు కేంద్రాల్లో సౌకర్యాలు, సీసీ కెమెరాలు, బయోమెట్రిక్‌ ఏర్పాట్లను అధికారుల బృందం శనివారం పరిశీలించింది.

ఫ పటిష్ట బందోబస్తు...

కరీంనగర్‌ క్రైం: నీట్‌ రీ ఎగ్జామ్‌కు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు సీపీ గౌస్‌ ఆలం తెలిపారు. శనివారం అస్త్ర కన్వెన్షన్‌ హాల్‌లో పరీక్షల భద్రతా ఏర్పాట్లపై ఆయన పోలీస్‌ అధికారులతో సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించి, పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ... కరీంనగర్‌ పరిధిలో మొత్తం ఏడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, మూడు వేల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని, ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుంపులుగా చేరడం నిషిద్ధమని స్పష్టం చేశారు. పరీక్ష జరుగుతున్న సమయంలో కేంద్రాల సమీపంలోని జిరాక్స్‌ సెంటర్లు, ఇంటర్నెట్‌ కేఫ్‌లను తప్పనిసరిగా మూసివేయించాలన్నారు. అభ్యర్థులను రెండంచెలలో తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతించాలని ఆదేశించారు. సమావేశంలో ఏసీపీలు విజయకుమార్‌, యాదగిరిస్వామి, సతీష్‌, వెంకటస్వామి పాల్గొన్నారు.

Updated Date - Jun 21 , 2026 | 12:23 AM