Share News

పోటాపోటీ...

ABN , Publish Date - Sep 02 , 2026 | 12:46 AM

జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉండడంతో ఇప్పటి నుంచే ప్రజల్లోకి దూసుకు వెళ్లేందుకు ఆయా పార్టీలు రంగం సిద్ధం చేశాయి.

పోటాపోటీ...

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉండడంతో ఇప్పటి నుంచే ప్రజల్లోకి దూసుకు వెళ్లేందుకు ఆయా పార్టీలు రంగం సిద్ధం చేశాయి. వెయ్యి రోజుల పాలనలో తాము చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు గురించి అధికార కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు వివరించాలని నిర్ణయించగా, పాలనా వైఫల్యాలు, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల గురించి ప్రజలకు వివరించేందుకు బీఆర్‌ఎస్‌ పోరుబాట పట్టింది. బుధవారం నుంచి 8వ తేదీ వరకు వరుస కార్యక్రమాలు నిర్వహించి ఇంటింటికీ బాకీ కార్డులను పంపిణీ చేసేందుకు బీఆర్‌ఎస్‌ సన్నద్ధమవుతోంది. అలాగే ఈనెల 10న ఉద్యోగ, ఉపాధ్యాయులు, కార్మికులు చేపడుతున్న నిరసన కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. బుధవారం ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలు వైఫల్యంపై నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నా, 3న మం డల కేంద్రాల్లో రైతు సదస్సులు, 4న మహిళలు, దివ్యాంగులతో మండల కేంద్రాల్లో ధర్నాలు, 5న విద్యార్థులు, యువతతో నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు, 6న గ్రామీణ, పట్టణ సమస్యలపై ఎక్కడి కక్కడే నిరసనలు, 7న ప్రజావాణిలో వినతిపత్రాల సమర్పణ, 8న ఏ వర్గాలకు ఎంత బాకీ ఉన్నారో బాకీ కార్డులను ఇంటింటికి పంపిణీ చేయాలని నిర్ణయించారు.

ఫ పూర్వ వైభవం కోసం బీఆర్‌ఎస్‌..

పూర్వ వైభవం పొందేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ఉవ్విళ్లూరుతున్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో మంథని నుంచి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పెద్దపల్లి నుంచి చింతకుంట విజయరమణారావు, రామగుండం నుంచి రాజ్‌ ఠాకూర్‌ మక్కాన్‌ సింగ్‌లు గెలుపొందిన విషయం తెలిసిందే. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం చెందిందని భావిస్తున్న బీఆర్‌ఎస్‌ పార్టీ అగ్ర నాయకత్వం చేపడుతున్న పలు నిరసన కార్యక్రమాలతో ప్రజలకు చేరువై వచ్చే ఎన్నికల్లో జిల్లాలో గులాబీ జెండా ఎగుర వేయాలని భావిస్తున్నారు. పూర్వవైభవాన్ని చాటుకునేందుకు పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు పోరుబాట కార్యక్రమం ద్వారా తమ ఉనికిని చాటుకునేందుకు సిద్ధమయ్యారు. పెద్దపల్లి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి, మంథనిలో పుట్ట మధూకర్‌, రామగుండంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్‌ నిరసన కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. చేయూత పింఛన్లు పెంచలేదని, మహి ళలకు నెలనెలా రూ.2,500, రైతు బీమా, యువతకు ఉద్యోగాలు, విద్యార్థినులకు స్కూటీలు ఇవ్వడం లేదని, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల ద్వారా తులం బంగారం ఇవ్వడం లేదనే అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుక వెళ్లి వారి మద్దతును పొందాలని భావిస్తున్నారు.

ఫ కాంగ్రెస్‌ వెయ్యి రోజుల ప్రగతి పండుగ..

వెయ్యి రోజుల ప్రగతి పండుగ పేరిట అధికార కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ప్రజల్లోకి వెళ్లేందుకు సంసిద్ధం అవుతున్నారు. వెయ్యి రోజుల పాలనలో ఇప్పటి వరకు అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం, ఇందిరమ్మ ఇళ్ల పథకం, రూ. 500కే సబ్సిడీ వంట గ్యాస్‌, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్‌, 2 లక్షల వరకు రుణ మాఫీ, రైతు భరోసా అమలు, వ్యవసాయానికి 24 గంటల కరెంట్‌, సన్న ధాన్యానికి బోనస్‌, కొత్త రేషన్‌ కార్డుల జారీ, సన్న బియ్యం పంపిణీతోపాటు నియోజక వర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించాలని కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు నిర్ణయించారు. అటు.. బీఆర్‌ఎస్‌, ఇటు.. కాంగ్రెస్‌ పార్టీ పోటాపోటీగా ప్రజల్లోకి వెళ్లనుండడంతో రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి.

Updated Date - Sep 02 , 2026 | 12:46 AM