చెరువులపై నజర్
ABN , Publish Date - May 09 , 2026 | 02:02 AM
జిల్లాలో చెరువుల పరిరక్షణ, ఆక్రమణలను అడ్డుకోవడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా వ్యాప్తంగా చెరువుల శిఖం భూములు, కాలువల ఆక్రమణలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడానికి కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో నీటి పారుదల శాఖ, రెవెన్యూ, సర్వే శాఖ, మున్సిపల్‌కు చెందిన ప్రత్యేక బృందాలు కసరత్తు చేస్తున్నాయి.
- సంరక్షణకు ప్రత్యేక కమిటీలు
- ఎఫ్‌టీఎల్ గుర్తింపునకు డిజిటల్ సర్వే
-ఆక్రమణలకు చెక్ పట్టేందుకు చర్యలు
జగిత్యాల, మే8(ఆంధ్రజ్యోతి): జిల్లాలో చెరువుల పరిరక్షణ, ఆక్రమణలను అడ్డుకోవడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా వ్యాప్తంగా చెరువుల శిఖం భూములు, కాలువల ఆక్రమణలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడానికి కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో నీటి పారుదల శాఖ, రెవెన్యూ, సర్వే శాఖ, మున్సిపల్‌కు చెందిన ప్రత్యేక బృందాలు కసరత్తు చేస్తున్నాయి. నీటి మట్టం గుర్తించి హద్దుల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. డిజిటల్ సర్వే నిర్వహించేందుకు రంగంలోకి దిగారు. జిల్లాలో ఇప్పటికే చెరువుల ఎఫ్‌టీఎల్(ఫుల్ ట్యాంక్ లెవల్) హద్దులను గుర్తించేందుకు మొదటి దశలో 500 నీటి వనరులను గుర్తించారు. ఒక్కో మండలంలో నిర్ణీత చెరువులను సర్వే చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. దీంతో చెరువుల ఎఫ్‌టీఎల్ కబ్జాలకు తెరపడనుంది.
జిల్లాలోని ప్రధాన పట్టణాలయిన జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్, ధర్మపురి పరిసర ప్రాంతాల్లో చెరువులు కబ్జాకు గురవుతున్నాయనే ఆరోపణలున్నాయి. మరోవైపు పలు పల్లెల్లో సైతం చెరువు భూముల ఆక్రమణలు జరుగుతున్నాయి. పట్టణాల్లో అక్రమంగా చెరువు భూములు కబ్జా చేసి భవన నిర్మాణాలు చేపడుతున్న సంఘటనలు ఉన్నాయి. ముందుగా ఎఫ్‌టీఎల్ ప్రాంతాల్లో మట్టి నింపి తర్వాత నిర్మాణాలు చేపట్టిన సంఘనలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం డిజిటల్ సర్వే నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది.
ఫజిల్లాలో 1,125 చెరువులు..
జిల్లా వ్యాప్తంగా 1,125 చెరువులున్నాయి. ఇందులో వంద ఎకరాలకు పైబడి ఆయకట్టు కలిగిన చెరువులు 166 ఉన్నాయి. వంద ఎకరాల కంటే తక్కువ ఆయకట్టు ఉన్న చెరువులు 959 ఉన్నాయి. కాగా జిల్లా వ్యాప్తంగా చెరువుల ఆయకట్టు 58,847 ఎకరాలు ఉంది. ఇందులో వంద ఎకరాలు పైబడిన చెరువుల ఆయకట్టు 33,455.11 ఎకరాలు, వంద ఎకరాల కంటే తక్కువ కలిగిన చెరువుల ఆయకట్టు 2,531.54 ఎకరాలు ఉంది.
ఫపక్కాగా హద్దులు..
జిల్లాలో మొదటి దశలో గుర్తించి సుమారు 500 చెరువులను డిజిటల్ సర్వే నిర్వహించేందుకు అధికారులతో కూడిన కమిటీలను నియమించారు. ఇందులో తహసీల్ధార్, రెవెన్యూ సర్వేయర్, ఇరిగేషన్ ఏఈ, అటవీ శాఖ అధికారులతో కూడిన కమిటీ చెరువులను పరిశీలిస్తుంది. మున్సిపాలిటీల పరిధిలో టౌన్ ప్లానింగ్ అధికారులు సైతం భాగస్వామ్యం అవుతున్నారు. ముందుగా తహసీల్దార్ కార్యాలయంలో అందుబాటులో ఉన్న చెరువు నక్షతో పాటు గూగుల్ మ్యాప్ ఆధారంగా డిజిటల్ సర్వే నిర్వహించనున్నారు. ఎఫ్‌టీఎల్‌ను గుర్తించి హద్దులు ఏర్పాటు చేస్తున్నారు.
ఫఆక్రమణలు గుర్తింపు..
చెరువుల ఆక్రమణను గుర్తించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం ప్రత్యేక ఫార్మాట్‌ను ఏర్పాటు చేసి దాని ఆధారంగా నివేదిక అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో చెరువులు, కుంటలు, ఇతర చిన్న నీటి వనరులు, వాగులను కమిటీ సభ్యులు పరిశీలిస్తారు. ఆక్రమణలకు గురైన చెరువులు, కుంటలు, వాగులను గుర్తించి వాటి ఫొటోలను తీయడంతో పాటు ఎంత విస్తీర్ణం, ఆక్రమణకు గురైందో నివేదికను ప్రభుత్వానికి అందిస్తారు. మండల పరిషత్, గ్రామం, చెరువు పేరు, గుర్తించిన తేదీ, పరిశీలన జరిపిన తేదీలను పొందుపరుస్తారు. ఇందులో అటవీ శాఖ, తహసీల్ధార్, మండల సర్వేయర్, ఎంపీడీఓ, పంచాయతీ రాజ్, ఇరిగేషన్ అధికారులు పాల్గొంటున్నారు. చెరువులు ఏ మేరకు కబ్జాకు గురయ్యాయో వాటిని వివరంగా తీసుకొని జిల్లా ల్యాండ్ సర్వే అధికారులకు పంపిస్తారు. ఇప్పటికే చెరువులను వివిధ శాఖల అధికారులు సమన్వయం చేసుకొని గుర్తించారు. మున్సిపాలిటీలు, గ్రామాల స్థాయిలో ఆక్రమణలకు గురవుతున్న చెరువులు, కుంటల పరిరక్షణకు హద్దులు గుర్తించే ప్రక్రియ చేపట్టారు.
చెరువులు కబ్జాకు గురికాకుండా చర్యలు
-సత్యప్రసాద్, కలెక్టర్
జిల్లాలో చెరువులు కబ్జాకు గురికాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాంు. చెరువుల సర్వే నిర్వహించి హద్దుల ఏర్పాటు చేయిస్తున్నాం. హద్దుల ఏర్పాటుతో చెరువులు, కుంటలు, ఇతర చిన్న నీటి వనరులు కబ్జాకు గురి కాకుండా ఉంటాయి.