Share News

అభివృద్ధి పనులపై నజర్‌

ABN , Publish Date - Jan 21 , 2026 | 01:35 AM

పంచాయతీ ఎన్నికల్లో ఉత్తమ ఫలితాలను సాధించిన కాంగ్రెస్‌ పార్టీ మున్సిపాల్‌ ఎన్నికల్లో సైతం విజయం సాధించేందుకు సమాయత్తం అవుతోంది. వచ్చే వారం రోజుల్లో మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనున్న నేపథ్యంలో జిల్లాలోని జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్‌ మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, సంక్షేమ కార్యక్రమాలు చేసే పనుల్లో అధికార పార్టీ నేతలు నిమగ్నమయ్యారు.

అభివృద్ధి పనులపై నజర్‌

- మున్సిపాలిటీల్లో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

- నోటిఫికేషన్‌ వచ్చేలోగా పలు పనులు ప్రారంభించేలా ప్రణాళిక

- ఇప్పటికే మున్సిపాలిటీల్లో పలుమార్లు పర్యటించిన మంత్రి అడ్లూరి

- నేడు ధర్మపురిలో డిప్యూటీ సీఎం పర్యటన

జగిత్యాల, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల్లో ఉత్తమ ఫలితాలను సాధించిన కాంగ్రెస్‌ పార్టీ మున్సిపాల్‌ ఎన్నికల్లో సైతం విజయం సాధించేందుకు సమాయత్తం అవుతోంది. వచ్చే వారం రోజుల్లో మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనున్న నేపథ్యంలో జిల్లాలోని జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్‌ మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, సంక్షేమ కార్యక్రమాలు చేసే పనుల్లో అధికార పార్టీ నేతలు నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలు మున్సిపాలిటీల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ఇతర కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు పర్యటించి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించారు. బుధవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా ధర్మపురి మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.

ఫజగిత్యాలలో మంత్రి అడ్లూరి చేతుల మీదుగా..

జగిత్యాల మున్సిపల్‌లో రెండు, మూడు రోజులుగా పలు అభివృద్ధి పనుల వేగాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌లు పెంచుతున్నారు. ఇప్పటికే పలు పర్యాయాలు మంత్రి అడ్లూరి జగిత్యాలలో పర్యటించారు. తాజాగా జిల్లా కేంద్రంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ పర్యటించి రూ.కోట్ల నిధులతో అభివృద్ధి పనులు ప్రారంభం, శంకుస్థాపనలు నిర్వహించారు. మంగళవారం జిల్లా కేంద్రంలో రూ.235 కోట్ల నిధులతో ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు అనుబంధంగా 450 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి భూమి పూజ, రూ.23.5 కోట్లతో క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌ను ప్రారంభించారు. రూ.3 కోట్లతో సెంట్రల్‌ మెడిసిన్‌ స్టోర్‌ ప్రారంభం, రూ.1.50 కోట్ల నిధులతో టీఆర్‌ నగర్‌ ప్రభుత్వ వయో వృద్ధుల సదనం ప్రారంభం తదర అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఫనేడు ఇంటిగ్రేటెడ్‌ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన

ధర్మపురి మున్సిపాలిటీలో బుధవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించడానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ నిర్ణయించారు. రూ.200 కోట్లతో యంగ్‌ ఇంటిగ్రేటెడ్‌ పాఠశాల నిర్మాణం, రూ.17 కోట్ల నిధులతో సివరేజ్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నారు. టీఎఫ్‌ఐడీ నిధులు రూ.15 కోట్లతో మున్సిపాలిటీల్లో పలు అభివృద్ధి పనులు, రూ.4 కోట్లతో విద్యుత్‌ స్తంభాలు, కొత్త లైన్ల ఏర్పాటు, రూ.2 కోట్ల నిధులతో పలు కుల సంఘాల భవనాల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌లు నిర్వహించడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు ఏర్పాటు చేస్తున్నారు.

ఫ 2,094 సంఘాలకు వడ్డీ లేని రుణాలు

జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్‌, ధర్మపురి మున్సిపాలిటీల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలను తాజాగా ప్రభుత్వం మంజూరు చేసింది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో గల 2,094 మహిళా సంఘాలకు రూ.6,80,57,296 వడ్డీ లేని రుణాలు మంజూరు అయ్యాయి. వీటిని లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలోని డిసెంబర్‌, జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసాలకు చెందిన రుణాల వడ్డీ, 2024-25 ఆర్థిక సంవత్సరానికి చెందిన రుణాల వడ్డీ ప్రభుత్వం విడుదల చేసింది. రెండు రోజుల క్రితం జగిత్యాలలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, ఎమ్మెల్యే డాక్టర్‌ మాకునూరి సంజయ్‌ కుమార్‌, కలెక్టర్‌ సత్య ప్రసాద్‌ తదితరుల చేతుల మీదుగా మహిళలకు అందించారు.

ఫఐదు మున్సిపాలిటీలకు ప్రత్యేక నిధులు

జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు ప్రభుత్వం వివిధ కార్యక్రమాల కింద ఇటీవల ప్రత్యేక నిధులు మంజూరు చేసింది. నగర అభివృద్ధి కింద రాయికల్‌ మున్సిపల్‌కు రూ.15 కోట్లు, ధర్మపురి మున్సిపల్‌కు రూ.15 కోట్లు, యూఐడీఎఫ్‌ కింద మెట్‌పల్లి మున్సిపల్‌కు రూ.18.07 కోట్లు, కోరుట్ల మున్సిపల్‌కు రూ.18.07 కోట్లు, జగిత్యాల మున్సిపల్‌కు రూ. 62.05 కోట్లు మంజూరు చేశారు. ఎన్నికల కోడ్‌ కూయకముందే పనులు ప్రారంభించడానికి సమాయత్తం అవుతున్నారు.

ఫమెట్‌పల్లిలో మెగా జాబ్‌ మేళా

మున్సిపల్‌ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో యువతీ యువకులను ఆకట్టుకునేలా ఇటీవల మెట్‌పల్లి మున్సిపల్‌ మెగా జాబ్‌ మేళాను నిర్వహించారు. కోరుట్ల కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు, ధర్మపురి దేవస్థాన అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్‌ జువ్వాడి కృష్ణారావు తదితరులు జాబ్‌మేళాను నిర్వహించారు. ఈకార్యక్రమానికి కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపల్‌కు చెందిన సుమారు 450 మంది యువతీ యువకులు హాజరయ్యారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కంపెనీ ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించి 200 మందిని వివిధ ఉద్యోగాలకు ఎంపిక చేశారు.

Updated Date - Jan 21 , 2026 | 01:35 AM