మౌనముని పాత్రను పోషిస్తున్న నరేంద్ర మోదీ..
ABN , Publish Date - Mar 14 , 2026 | 12:21 AM
భారత దేశం ఎప్పుడూ కూడా అలీన విదేశీ విధానాన్ని అవలంభించిందని, ఆధిపత్య పోరును అంతమెందించడానికి నిలబడిందని ప్రస్తుతం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మౌనముని పాత్రను పోషిస్తున్నాడని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు.
సిరిసిల్ల టౌన్, మార్చి 13 (ఆంధ్రజ్యోతి) : భారత దేశం ఎప్పుడూ కూడా అలీన విదేశీ విధానాన్ని అవలంభించిందని, ఆధిపత్య పోరును అంతమెందించడానికి నిలబడిందని ప్రస్తుతం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మౌనముని పాత్రను పోషిస్తున్నాడని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం సిరిసిల్ల పట్టణంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో చాడ వెంకటరెడ్డి మాట్లాడారు. అమెరికా ప్రపంచం మీద పెత్తనం కోసం హద్దులు మీరి వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో కాకుండా ఐక్యరాజ్య సమితిని కూడా ధిక్కరిస్తూ వ్యక్తిగత పోకడలతో ట్రంప్ ప్రపంచంలో ప్రకంపనాలు సృష్టిస్తున్నాడని ఆరోపించారు. ఇరాన్, ఇజ్రాయిల్ దేశాల యుద్ధం ద్వారా అరబ్ దేశాలు టార్గెట్ అవుతున్నాయని అన్నారు. చిన్నచిన్న దేశాలపై పెత్తనం చేసి ఆధిపత్యం పెంచుకోవడం కోసం అమెరికాకు అధ్యక్షుడిగా అయిన ట్రంప్ అనేక దేశాలపై ఆంక్షలు పెడుతూ వాణిజ్య ఒప్పందాలను, అభివృద్ధిని దెబ్బతీస్తున్నాడని ఆరోపించారు. ఈ యుద్ధాలతో ఎక్కడెక్కడ ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయో అవన్నీ ప్రస్తుత పరిస్థితుల్లో తుడిచిపెట్టుకుపోయే పరిస్థితులు కనబడతున్నాయన్నారు. ప్రస్తుతం గ్యాస్ కొరత, రానున్న రోజుల్లో పెట్రోల్, డీజీల్, కిరోసిన్ కొరత వచ్చే అవకాశాలతో ప్రపంచంలోని మానవాళిపై ప్రభావం పడే అవకాశాలున్నాయన్నారు. ప్రపంచంలో చైనాతో పాటు భారత దేశం జనాభాలో అతిపెద్ద దేశం అన్నారు. భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మౌనముని పాత్రను పోషిస్తూ ట్రంప్‌కు పూర్తిగా దాసోహం చేసే విధంగా దిగజారిపోయాడని ఆరోపించారు. భారత దేశ ఉనికికి నరేంద్రమోదీ తూట్లు పెట్టడాన్ని దుర్మార్గచర్యగా తాము భావిస్తున్నామన్నారు. ఇప్పటికైనా నరేంద్రమోదీ నోరు తెరవాలని, ప్రపంచానికి వాస్తవాలతో పాటు జరుగుతున్న పరిణామాలను చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రపంచ మానవాళిని రక్షించేందుకు నిలబడే విధంగా పని చేయాలన్నారు. యుద్ధం వద్దు ప్రపంచమే ముద్దు అనే వాతవరణతో భారత దేశం ముందుకు అడుగులు వేయాలన్నారు. పార్లమెంట్ సమావేశంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి దేశంలో గ్యాస్ కొరత లేదంటూ చెప్పిందన్నారు. దేశంలో వాణిజ్య సిలిండర్లు కొరతతో హోటల్స్ బంద్ అవుతున్నాయన్నారు. అబద్ధాలు చెప్పడంలో మోదీ ప్రభుత్వం అందెవేసిన చేయి, అబద్ధాలతోనే నరేంద్ర మోదీ పాలన సాగుతోందని విమర్శించారు. ప్రపంచశాంతి కావాలని అన్ని దేశాలు ఒత్తిడి తీసుకురావలని, దీనిపై నరేంద్రమోదీ తక్షణమే స్పందించాలని, చర్చలతో సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రకటన విడదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశపైన సీపీఐ దేశ వ్యాప్తంగా ఈనెల 16న యుద్ధం వద్దు ప్రపంచమే ముద్దు.. ఇరాన్‌పై యుద్ధం ఆపండి.. అమెరికా పెత్తనాన్ని ఖడించాలని నిరసనలు చేపట్టాలని నిర్ణయించామన్నారు. సీపీఐ వంద సంవత్సరాల కాలంలో అనేక ఆటుపోటలను ఎదుర్కొని తన శక్తితో నిలబడిందని తెలంగాణలో కొత్తగూడెంలో మేయర్ స్థానాన్ని సాధించుకోవడం గర్వకారణంగా ఉందన్నారు. మావోయిస్టుల విషయంలో కూడా సీపీఐ రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహించడంలో ప్రధానపాత్రను పోషించిందన్నారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలని, కమ్యునిస్టు పార్టీలో చేరాలని, వామపక్ష ఉద్యమాలను బలోపేతం చేయడం కోసం కంకణ బద్ధులు కావాలని విజ్ఞప్తి చేశారు.
ఏప్రిల్ 1 నుంచి పల్లెపల్లెకి సీపీఐ ప్రజల వద్దకు సీపీఐ
రానున్న జిల్లా, మండల పరిషత్ ఎన్నికలలో పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడం కోసం నాయకులు, కార్యకర్తలు క్రీయశీలక పాత్రను పోషించాలన్నారు. పల్లెపల్లెకు సీపీఐ.. ప్రజల వద్దకు సీపీఐ.. అనే నినాదంతో ముందుకు వెళ్తామన్నారు. ఏప్రిల్ 1 నుంచి 10వరకు ప్రజల వద్దకు వెళ్లాలని ప్రజా ఉద్యమాలతో పాటు మిలిటెంట్ ఉద్యమాలకు సన్నద్ధం కావాలని పార్టీ సమావేశంలో నిర్ణయించామన్నారు. తెలంగాణ సాయుధ పోరాటాల చరిత్రను నేటి తరానికి తెలియపరిచేందుకు తెలంగాణ అమరవీరుల ట్రస్టు అధ్యక్షుడిగా బాధ్యతలను నిర్వహిస్తున్నానని తెలిపారు. తెలంగాణలో జరిగిన ఎన్‌కౌంటర్ ప్రదేశాల వద్ద స్తూపాలను ఏర్పాటు చేసి నాటి అమరుల త్యాగాలను నేటితరాలకు తెలియజేస్తామన్నారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మంద సుదర్శన్, మాజీ కార్యదర్శి గుంటి వేణు, పట్టణ కార్యదర్శి పంతం రవి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు, నాయకులు మీసం లక్ష్మణ్, వడ్డెపల్లి లక్ష్మణ్, కొంక విజయ్, గాజుల లింగం పాల్గొన్నారు.