మున్సి‘పోల్స్’ నేడే
ABN , Publish Date - Feb 11 , 2026 | 01:20 AM
మున్సి‘పోల్స్’కు సర్వం సిద్ధమైంది. జిల్లాలోని కరీంనగర్ కార్పొరేషన్‌తోపాటు చొప్పదండి, జమ్మికుంట, హుజురాబాద్ మున్సిపాలిటీల్లో నేడు ఎన్నికలు జరుగనున్నాయి. పోలింగ్ సజావుగా జరిగేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. పోలింగ్ అధికారులు, సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు తీసుకొని మంగళవారం రాత్రికి చేరుకున్నారు.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
మున్సి‘పోల్స్’కు సర్వం సిద్ధమైంది. జిల్లాలోని కరీంనగర్ కార్పొరేషన్‌తోపాటు చొప్పదండి, జమ్మికుంట, హుజురాబాద్ మున్సిపాలిటీల్లో నేడు ఎన్నికలు జరుగనున్నాయి. పోలింగ్ సజావుగా జరిగేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. పోలింగ్ అధికారులు, సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు తీసుకొని మంగళవారం రాత్రికి చేరుకున్నారు. జిల్లా పోలీసు యంత్రాంగం, ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్చగా వినియోగించుకునేందుకు వీలుగా పకడ్బందీ ఏర్పాట్లను చేసింది. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
- కరీంనగర్ కార్పొరేషన్‌లో 66 డివిజన్లలో పోలింగ్ జరుగనున్నది. ఈ డివిజన్ల పరిధిలో 1,70,858 మంది మహిళలు, 1,69,679 మంది పురుషులు, 43 మంది ఇతరులు ఓటర ్లుగా ఉన్నారు. 477 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 389 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరందరి తలరాతను ఓటర్లు తమ బ్యాలెట్ ద్వారా బుధవారం రాయనున్నారు. ఈనెల 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.
- జమ్మికుంట మున్సిపాలిటీలో 34,455 మంది ఓటర్లు ఉన్నారు. ఆ మున్సిపాలిటీ పరిధిలో 30 వార్డులుండగా 159 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. పోలింగ్ నిర్వహణ కోసం 60 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 700 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు.
- హుజూరాబాద్‌మున్సిపాలిటీలో 29,531 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 30 వార్డులున్న ఈ మున్సిపాలిటీలో 60 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి 700 మంది సిబ్బందిని నియమించారు. 30 వార్డులకు గాను 143 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
- చొప్పదండి మున్సిపాలిటీలోని 14 వార్డుల్లో 64 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఇక్కడ 13,916 మంది ఓటర్లు ఉండగా 28 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 300 మంది సిబ్బందిని నియమించారు. కరీంనగర్ కార్పొరేషన్‌లో పోలింగ్ ముగిసిన వెంటనే ఎస్సారార్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌కు బ్యాలెట్ బాక్సులను తరలిస్తారు.
ఫ 18 రకాల గుర్తింపుకార్డులు :
ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి 18 రకాల గుర్తింపుకార్డుల్లో ఏదైనా ఒకదానిని వెంట తీసుకొని రావలసి ఉంటుంది. ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్‌కార్డు, ఉపాధిహామీ జాబ్‌కార్డు, ఫొటోతో కూడిన పోస్టాఫీసు లేక బ్యాంకు పాస్‌బుక్, కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ జారీ చేసిన హెల్త్ ఇన్సూరెన్సు స్మార్ట్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, పాన్‌కార్డు, ఫొటోతో కూడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ కుల ధ్రువీకరణ పత్రాలు, భారతీయ పాస్‌పోర్టు, ఫొటోతో కూడిన పెన్షన్ డాక్యుమెంట్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసిన ఉద్యోగ గుర్తింపు కార్డు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అధికారిక గుర్తింపుకార్డు, దివ్యాంగుల గుర్తింపుకార్డు, పట్టాదారు పాసుపుస్తకం, రేషన్‌కార్డు, ఫొటోతో కూడిన ఆయుధ లైసెన్సు, స్వతంత్య్ర సమరయోధుల ఐడీ కార్డులు, ఆర్‌జీఐ జారీ చేసిన ఎన్‌పీఆర్ స్మార్ట్ కార్డులలో ఏదైనా ఒకదానిని ఓటరు స్లిప్‌తోపాటు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.
ఫ 1300 సిబ్బందితో పటిష్ట బందోబస్తు
మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 109 పోలింగ్ కేంద్రాల్లో 28 కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ఈ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించనున్నారు. కార్పొరేషన్‌లోని 66 డివిజన్లను 33 రూట్లుగా విభజించి ప్రతి రూట్‌కు ఒక ఎస్‌ఐ, ప్రతి రెండు రూట్లకు సీఐలతో పర్యవేక్షిస్తారు. ప్రతి నాలుగు క్లస్టర్లకు ఒక ఏసీపీ అధికారిని నియమించారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఏసీపీ స్థాయి అధికారులతో స్పెషల్ స్ర్టైకింగ్ ఫోర్స్‌ను రంగంలోకి దింపారు. 12వ తేదీ ఉదయం 6 గంటల వరకు భారతీయ నాగరిక్ సురక్షా సంహిత సెక్షన్ 163 అమలులో ఉంటుంది. ఐదుగరు, అంతకంటే ఎక్కువ మంది గుమికూడడం నిషేధం. జిల్లాలోని కరీంనగర్ కార్పొరేషన్‌తోపాటు చొప్పదండి, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు 1,300 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లు సీపీ గౌస్ ఆలం తెలిపారు.
ఫ 13న ఓట్ల లెక్కింపు :
పోలింగ్ ముగిసిన వెంటనే బ్యాలెట్ బాక్సులను పటిష్ట బందోబస్తు మధ్య కౌంటింగ్ కేంద్రాలకు తరలించి, ఈనెల 13న వాటిని లెక్కిస్తారు. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే ఫలితాలను వెల్లడిస్తారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 66 డివిజన్ల ఓట్లను ఎస్‌ఆర్‌ఆర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో లెక్కించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. చొప్పదండి, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల ఓట్లనే అక్కడే ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. ఈనెల 16న కార్పొషన్‌లో మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికలను నిర్వహిస్తారు. హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి మున్సిపాలిటీల్లో చైర్మన్లు, వైస్ చైర్మన్లను వార్డుసభ్యులు ఎన్నుకుంటారు.