Share News

మున్సిపోల్స్‌ జోష్‌

ABN , Publish Date - Jan 02 , 2026 | 12:51 AM

గ్రామపంచాయతీ ఎన్నికలు ముగియడంతో పల్లెల్లో రాజకీయ వేడి తగ్గింది.

మున్సిపోల్స్‌ జోష్‌

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

గ్రామపంచాయతీ ఎన్నికలు ముగియడంతో పల్లెల్లో రాజకీయ వేడి తగ్గింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు ప్రారంభించడంతో అందరి దృష్టి మున్సిపాలిటీలపై పడింది. ఎన్నికల కమిషన్‌ జనవరి 10 నాటికి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో తుది ఓటరు జాబితాలను సిద్ధం చేసేందుకు కార్యాచరణ ప్రారంభించింది. గురువారం అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ముసాయిదా ఓటరు జాబితాలను విడుదల చేశారు. గత సంవత్సరం అక్టోబరు 1 నాటి డేటా ప్రకారం అసెంబ్లీ నియోజకవర్గాల ఓటరు జాబితాల ఆధారంగా ముసాయిదా ఓటరు జాబితాలను ప్రకటించారు. వార్డుల వారీగా పోలింగ్‌ స్టేషన్ల ఏర్పాటు ప్రక్రియ చేపడుతున్నారు. జనవరి 1న అభ్యంతరాలను స్వీకరించి 5న రాజకీయ పార్టీల ప్రతినిధులతో చర్చించి, వాటిని పరిష్కరిస్తారు. జిల్లా స్థాయి రాజకీయపార్టీల ప్రతినిధులతో జనవరి 6న సమావేశం నిర్వహిస్తారు. వారి సలహాలు, సూచనలు, అభ్యంతరాలను స్వీకరించి, పరిశీలించి ఓటర్ల తుదిజాబితాను జనవరి 10న ప్రకటిస్తారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఈ ప్రక్రియ ప్రారంభించడంతో పట్టణాలు, నగరాల్లో రాజకీయం వేడెక్కింది.

ఫ జిల్లాలో కరీంనగర్‌ కార్పొరేషన్‌, మూడు మున్సిపాలిటీలు

జిల్లాలో కరీంనగర్‌ నగరపాలక సంస్థతోపాటు హుజూరాబాద్‌, జమ్మికుంట, చొప్పదండి మున్సిపాలిటీలు ఉన్నాయి. గత ఏడాది కరీంనగర్‌ నగరపాలక సంస్థ, చొప్పదండి, జమ్మికుంట, హుజూరాబాద్‌ మున్సిపాలిటీల పాలకవర్గ పదవీ కాలం కూడా ముగిసింది.

- కరీంనగర్‌ నగరపాలక సంస్థలో 66 డివిజన్లు ఉండగా ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారంగా మొత్తం 3,40,775 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,69,763 మంది పురుషులు, 1,70,969 మంది మహిళలు, ఇతరులు 43 మంది ఉన్నారు.

- జమ్మికుంట మున్సిపాలిటీలో 30 వార్డులను గుర్తించి వాటి పరిధిలో 34,595 మంది ఓటర్లు ఉన్నట్లు ముసాయిదా జాబితాలో పేర్కొన్నారు. వీరిలో 16,870 మంది పురుషులు, 17,224 మంది మహిళలు, ఇతరులు ఒకరు ఉన్నారు.

- హుజూరాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో 30 వార్డులను గుర్తించారు. వీటిలో 29,599 మంది ఓటర్లు ఉన్నారు, వీరిలో 15,200 మంది మహిళలు, 14,395 మంది పురుషులు, ఇతరులు నలుగురు ఉన్నారు. వార్డుల వారీగా ఓటర్ల వివరాలను ముసాయిదా జాబితాలో పేర్కొన్నారు.

- చొప్పదండి మున్సిపాలిటీలో 14 వార్డులు ఉండగా 13,916 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 6,743 మంది పురుషులు, మహిళలు 7,173 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.

ఫ ఊపందుకున్న రాజకీయాలు

జనవరి 10 తర్వాత ఎప్పుడైనా మున్సిపల్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడే అవకాశముందని, ఫిబ్రవరి మొదటి లేదా రెండో వారంలో ఎన్నికలు నిర్వహిస్తారని ప్రచారం జరగుతోంది. దీంతో ఒక్కసారిగా పట్టణాలు, నగరాల్లో ఎలక్షన్‌ జోష్‌ నెలకొన్నది. కరీంనగర్‌ కార్పొరేషన్‌తోపాటు మూడు మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు ఇప్పటికే ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌తోపాటు ఎంఐఎం ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించిన కాంగ్రెస్‌ పురపాలక సంఘాల్లోనూ ఆధిపత్యం చాటుకోవాలని ప్రయత్నిస్తున్నది. పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు తమవైపే ఉన్నారని మెజార్టీ స్థానాలను, మున్సిపాలిటీలను సాధించుకుంటామన్న ధీమా బీజేపీలో వ్యక్తమవుతున్నది. బీఆర్‌ఎస్‌ కూడా అంతే ధీమాతో ఉన్నది. కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌, డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ కరీంనగర్‌ కార్పొరేషన్‌పై తమ పార్టీ జెండానే ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈసారి అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటామని ఎంఐఎం విశ్వాసంతో ముందుకెళుతోంది.

ఫ ఫ్లెక్సీలతో ఆశావహుల ప్రచారాలు

పార్టీల నుంచి టికెట్లను ఆశిస్తున్న ఆశావహులతోపాటు, స్వతంత్ర అభ్యర్థులు అప్పుడే ప్రచారాన్ని మొదలు పెట్టారు. డిసెంబరు 30న ముక్కోటి ఏకాదశి, జనవరి 1 ఆంగ్ల నూతన సంవత్సరం, సంక్రాంతి, ఇదే నెల 26న గణతంత్ర దినోత్సవం ఉండడంతో కరీంనగర్‌, ఇతర మున్సిపాలిటీల్లో ఆశావహులు పెద్ద ఎత్తున ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి వచ్చే మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీలో ఉంటున్నామనే సంకేతాన్ని ఇచ్చారు. ముక్కోటి ఏకాదశి రోజున ఆలయాల వద్ద, నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం రాత్రి, గురువారం రెండు రోజులు డివిజన్లలో, ప్రధాన కూడళ్లలో కేక్‌లు కట్‌ చేసి, స్వీట్లను పంపిణీ చేస్తూ ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు.

Updated Date - Jan 02 , 2026 | 12:51 AM