రైతన్నకు మరింత ‘మద్దతు’
ABN , Publish Date - May 15 , 2026 | 01:07 AM
వివిధ పంటలకు మద్దతు ధర పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతన్నల్లో సంతోషాన్ని నింపింది.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
వివిధ పంటలకు మద్దతు ధర పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతన్నల్లో సంతోషాన్ని నింపింది. పెట్టుబడులు, శ్రమకు తగిన ఫలితం రావడం లేదని, ప్రస్తుతం ఇస్తున్న మద్దతు ధరతో గిట్టుబాటు కావడం లేదని రైతన్నలు వాపోతున్న దశలో కేంద్రం తీసుకున్న నిర్ణయం ఊరట కలిగించింది. ప్రభుత్వం 14 రకాల పంటలకు కనీస మద్దతు ధరలను ప్రకటించింది. వరికి క్వింటాల్‌కు 72 రూపాయలు, పత్తికి క్వింటాల్‌కు 557 రూపాయలు ధర పెంచింది. మొక్కజొన్న పంటకు క్వింటాల్‌కు 10 రూపాయలు మాత్రమే పెంచడం మొక్కుబడి నిర్ణయంగా భావిస్తున్నారు. ఇప్పటికే మొక్కజొన్నలు కొనేవారు లేక ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే తక్కువ ధరకే ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. క్వింటాల్‌కు 10 రూపాయలు మాత్రమే పెంచడంతో మొక్కజొన్న సాగు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది.
వరికి క్వింటాల్‌కు రూ. 72
జిల్లాలో వానా కాలం సీజన్‌లో మూడు లక్షలపైచిలుకు ఎకరాల్లో, యాసంగిలో 2 లక్షల 70వేల ఎకరాల్లో వరి సాగు చేస్తారు. రెండు సీజన్లలో కలిపి 13 నుంచి 14 లక్షల టన్నుల వరి ధాన్యం దిగుబడి వస్తున్నది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సాధారణ వరి ధాన్యానికి క్వింటాల్‌కు 2,369, ఏ-గ్రేడ్ రకానికి 2,389 రూపాయలు చెల్లిస్తున్నది. ఈ రెండు రకాలపై క్వింటాల్‌కు 72 రూపాయలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో జిల్లా రైతులు రెండుసీజన్లలో కలిపి సాధించే వరి దిగుబడిపై 100 కోట్ల రూపాయల మేరకు లబ్ధి పొందనున్నారు. జిల్లాలో వానా కాలంలో 50వేల ఎకరాల్లో పత్తి సాగుచేస్తారు. యాసంగి సీజన్‌లో పత్తికి బదులు ఇదే విస్తీర్ణంలో కొంత తగ్గించి సుమారు 30 వేల నుంచి 35వేల ఎకరాల్లో మొక్కజొన్నను సాగు చేస్తారు.
ఫ పత్తికి క్వింటాల్‌కు రూ. 557
ప్రస్తుతం పత్తి మీడియం రకం క్వింటాల్‌కు 7710 రూపాయల ధర ఉండగా లాంగ్ రకం పత్తికి 8110 మద్దతు ధరగా చెల్లిస్తున్నారు. ప్రస్తుతం కేంద్రం ఈ రెండు రకాలపై క్వింటాల్‌కు 557 రూపాయల మద్దతును పెంచింది. జిల్లాలో సగటున ఎకరాకు 12 క్వింటాళ్ల చొప్పున దిగుబడి సాధిస్తారు. ఆరు లక్షల క్వింటాళ్ల మేరకు దిగుబడి వస్తుంది. ప్రభుత్వం పెంచిన మద్దతు ధరతో జిల్లాకు చెందిన రైతులు 33.5 కోట్ల లబ్దిపొందనున్నారు. మొక్కజొన్న సాగుతో ఎనిమిది లక్షల క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నారు. క్వింటాల్‌కు 10 రూపాయల చొప్పున మద్దతు ధర పెరుగడంతో రైతులు 80 లక్షల రూపాయలు లాభపడనున్నారు. కేంద్రం పెంచిన ఈ మద్దతు ధరలతో జిల్లా రైతులకు సుమారు 135 నుంచి 140 కోట్ల రూపాయల అదనంగా లబ్దిచేకూరనున్నది. మొక్కజొన్నకు మద్దతు ధర పెద్దగా పెరగక పోవడం, మార్కెట్‌లో ప్రతిసారి కొనేవారు లేక తక్కువ ధరకే అమ్ముకోవలసి రావడంతో రైతులు ఆ సాగును మానేసి పత్తి సాగుకు మొగ్గుచూపే అవకాశమున్నది.
ఫ కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలు ఇలా...
పంట పాత ధర పెంచిన ధర పెరిగింది
(క్వింటాల్‌కు రూపాయలలో)
------------------------------------------------------------------------------------------------
వరి ‘ఎ’ గ్రేడ్ 2,389 2,461 72
వరి ‘బి’ గ్రేడ్ 2,369 2,441 72
మొక్కజొన్న 2,400 2,410 10
కందులు 8,000 8,415 415
పెసలు 8,768 8,780 12
మినుములు 7,800 8,200 400
పత్తి క్వాలీటీ 8,110 8,667 557
పత్తి సాధారణం 7,710 8,267 557
వేరుశనగ 7,263 7,517 254
నువ్వులు 9,846 1,0346 500
పొద్దుతిరుగుడు 7,726 8,343 617