పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణ
ABN , Publish Date - Feb 12 , 2026 | 12:32 AM
కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సీపీ గౌస్ ఆలం తెలిపారు. బుధవారం జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను ఆయన క్షేత్రస్థాయిలో సందర్శించి, భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు.
- సమస్యాత్మక కేంద్రాల వద్ద భారీ బందోబస్తు
కరీంనగర్ క్రైం, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సీపీ గౌస్ ఆలం తెలిపారు. బుధవారం జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను ఆయన క్షేత్రస్థాయిలో సందర్శించి, భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించిన సీపీ, అక్కడ ఏర్పాటు చేసిన బందోబస్తును తనిఖీ చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై క్షేత్రస్థాయి అధికారులకు పలు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రానికి వచ్చే ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, వృద్ధులు, దివ్యాంగులకు ప్రాధాన్యమివ్వాలని ఆదేశించారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద సీసీ కెమెరాల నిఘా నిరంతరం ఉండాలని, అనుమానిత వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. విధుల్లో ఉన్న పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలతో మర్యాదగా ప్రవర్తిస్తూనే, శాంతిభద్రతల విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు కట్టుదిట్టమైన బందోబస్తు కొనసాగుతుందని, ప్రజలు భయాందోళనలు చెందకుండా ఓటు వేయాలని సీపీ గౌస్ ఆలం పిలుపునిచ్చారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయన్నారు. పోలీస్ కమిషనర్ వెంట ట్రైనీ ఐపీఎస్ సోహం పాల్గొన్నారు.