Share News

మొక్కు‘బడి బాట’

ABN , Publish Date - May 20 , 2026 | 12:43 AM

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల పెంపే లక్ష్యంగా రాష్ట్ర విద్యాశాఖ ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట కార్యక్రమంపై సందిగ్ధం నెలకొన్నది

మొక్కు‘బడి బాట’

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల పెంపే లక్ష్యంగా రాష్ట్ర విద్యాశాఖ ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట కార్యక్రమంపై సందిగ్ధం నెలకొన్నది. ప్రతియేటా జూన్‌ 6 నుంచి 19 వరకు 15 రోజులపాటు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బడీడు పిల్లలను, బడిమానేసిన పిల్లలను గుర్తించి వారిని సమీపంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తారు. ప్రతియేటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూన్నా ఆశించిన మేరకు ప్రవేశాలు పెరగడం లేదు. దీంతో ఈయేడు బడిబాట కార్యక్రమాన్ని మే 14 నుంచి ప్రారంభించి జూన్‌ 19 వరకు 36 రోజులపాటు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత యేడాది ప్రవేశాల కంటే కనీసం 10శాతం పెంచాలని ఉపాధ్యాయులకు టార్గెట్‌ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లావ్యాప్తంగా జనగణన సాగుతోంది. ఉపాధ్యాయులు ఇప్పటికే ఈ విధుల్లో ఉన్నారు. ఓవైపు జనగణన.. మరోవైపు బడిబాట రెండు విధులు ఒకేసారి చేయాలంటూ ఆదేశాలు జారీ చేయడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

ఫ జనగణనకే మొగ్గు చూపుతున్న ఉపాధ్యాయులు

జనగణన విధుల్లో పాల్గొనని ఉపాధ్యాయులంతా విధిగా బడిబాటలో పాల్గొనాలని అధికారులు ఆదేశించారు. 80 శాతం ప్రాథమిక పాఠశాలల్లోని ఉపాధ్యాయుులు, 70శాతం ప్రాథమికోన్నత, ఉన్నత, కేజీబీవీ, సంక్షేమ పాఠశాలల ఉపాధ్యాయులు జనగణన విధుల్లో ఉన్నారు. ఇప్పుడు వారంతా ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున ఈపరిస్థితిలో జనగణన డ్యూటీలు చేయడమే కష్టంగా ఉందని, దీనికితోడు బడిబాటలో ఎలా పాల్గొంటామని వాపోతున్నారు. అనారోగ్యం, ఎండల తీవ్రత కారణంగానే జనగణన విధుల్లో పాల్గొనకుండా ఉంటే ఎండలు అధికంగా ఉన్న మే నెలలోనే బడిబాటను నిర్వహించి తప్పకుండా పాల్గొనాలని ఆదేశాలివ్వడమేమిటని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. జనగణన విధుల్లో పాల్గొంటే అదనంగా 24 ఆర్జిత సెలవులు ప్రభుత్వం మంజూరు చేస్తుండడంతో మెజార్టీ ఉపాధ్యాయులు ఈ విధులు నిర్వహించేందుకే మొగ్గుచూపుతున్నారు. ప్రధానోపాధ్యాయులతోపాటు సీనియర్‌ ఉపాధ్యాయులు పాఠశాలల్లో ఉండగా మిగిలిన ఉపాధ్యాయులంతా జనగణన విధుల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో బడిబాట మొక్కుబడేనా అనే చర్చ జరుగుతోంది.

ఫ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు మాత్రమే..

పాఠశాలల్లో హెడ్మాస్టర్లు, సీనియర్‌ ఉపాధ్యాయులు మాత్రమే ఉండగా మిగతావారందరికి జనగణన విధులు కేటాయించారు. దివ్యాంగ ఉపాధ్యాయులకు జనగణన విధుల నుంచి మినహాయింపు ఇచ్చారు. కొన్ని చోట్ల సీనియర్‌ ఉపాధ్యాయులకూ జనగణన విధులు వేశారు. ప్రధానోపాధ్యాయులు మాత్రం పాఠశాలలకు పరిమితమయ్యారు. పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన సర్టిఫికెట్స్‌ ఇవ్వడం నుంచి తదితర సమాచారం కోసం అక్కడే ఉండాల్సిన పరిస్థితి. జిల్లాలో మండల ప్రాథమిక పాఠశాలలు, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, మండల ప్రజాపరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలలు, సంక్షేమశాఖ పాఠశాలల్లో అనేక మంది టీచర్లు పనిచేస్తున్నారు. వీరందరూ జనగణనలోనే ఉంటే మొక్కుబడిగా నిర్వహించే బడిబాట కార్యక్రమంతో ఈవిద్యా సంవత్సరంలో ప్రవేశాలు ఎలా పెరుగుతాయనే చర్చ జరుగుతోంది.

ఫ జూన్‌ 9 వరకు జనగణన

జనగణన జూన్‌ 9వరకు కొనసాగుతుండగా బడిబాట నిర్వహణ టీచర్లకు కత్తిమీద సాములా మారింది. ఈ యేడాది బడిబాటపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతి సంవత్సరం జూన్‌ 6 నుంచి 19వ తేదీ వరకు పదిహేను రోజులపాటు బడిబాట కొనసాగించారు. ఈసారి మాత్రం మే 14 నుంచి జూన్‌ 19వరకు బడిబాట కార్యక్రమం చేపట్టడంపై అందరూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 21న అంగన్‌వాడీ టీచర్లు, మదర్స్‌కమిటీ సమావేశాలు, 28న యువత, స్థానిక నాయకులతో సమావేశం, మే 31న యూనిఫారాలు, పాఠ్యపుస్తకాలు, నోట్‌ బుక్స్‌ పంపిణీ, జూన్‌ 3 నుంచి 19వ తేదీ వరకు రెగ్యులర్‌ కార్యక్రమాలు చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేసింది. జూన్‌ 3న గ్రామసభ, 4న అవగాహన ర్యాలీ, 5న సీఎస్‌డబ్ల్యూఎన్‌ పిల్లలకు గుర్తింపు, 6న బడిబయట ఉన్న పిల్లల గుర్తింపు, 8 నుంచి 10వ తేదీ వరకు ఇంటింటా ప్రచారం, 12న వెల్‌కమ్‌ డే... 15న సామూహిక అక్షరాభ్యాసం, 16న ఎఫ్‌ఎల్‌ఎల్‌డే. 17న గర్ల్స్‌, చిల్ట్రన్స్‌ డే, 18న డిజిటల్‌ అవేర్‌నెస్‌ డే, 19న స్పోర్ట్స్‌ డే నిర్వహించాలని సూచించింది.

Updated Date - May 20 , 2026 | 12:43 AM