సబ్స్టేషన్లకు ఆధునిక హంగులు
ABN , Publish Date - Nov 12 , 2026 | 01:02 AM
విద్యుత్ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కొత్త మార్పులకు నాంది పలుకుతోంది. పెరుగుతున్న విద్యుత్ అవసరాలు, మారుతున్న వినియోగ పరిస్థితులకు అనుగుణంగా పెద్దపల్లి విద్యుత్ సర్కిల్ పరిధిలో సరఫరా వ్యవస్థను బలోపేతం చేసేందుకు టీజీ ఎన్పీడీసీఎల్ ప్రత్యేక కార్యాచరణ చేపడుతోంది. ఏళ్ల తరబడి సేవలందిస్తున్న పాత విద్యుత్ సబ్స్టేషన్లను ఆధునికీకరిస్తూనే.. మరోవైపు అత్యాధునిక సాంకేతికతతో విద్యుత్ సరఫరాపై నిరంతర పర్యవేక్షణకు శ్రీకారం చుట్టింది.
- సాంకేతికతతో కొత్త పుంతలు
- వెంటనే సమస్య గుర్తింపు
- వినియోగదారులకు మెరుగైన సేవలు
పెద్దపల్లి, నవంబరు11(ఆంధ్రజ్యోతి): విద్యుత్ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కొత్త మార్పులకు నాంది పలుకుతోంది. పెరుగుతున్న విద్యుత్ అవసరాలు, మారుతున్న వినియోగ పరిస్థితులకు అనుగుణంగా పెద్దపల్లి విద్యుత్ సర్కిల్ పరిధిలో సరఫరా వ్యవస్థను బలోపేతం చేసేందుకు టీజీ ఎన్పీడీసీఎల్ ప్రత్యేక కార్యాచరణ చేపడుతోంది. ఏళ్ల తరబడి సేవలందిస్తున్న పాత విద్యుత్ సబ్స్టేషన్లను ఆధునికీకరిస్తూనే.. మరోవైపు అత్యాధునిక సాంకేతికతతో విద్యుత్ సరఫరాపై నిరంతర పర్యవేక్షణకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రియల్‌టైమ్ ఫీడర్ మానిటరింగ్ సిస్టమ్ మొదటి దశలో 65 సబ్స్టేషన్లను స్కాడాతో అనుసంధానించి వంద శాతం లక్ష్యాన్ని సాధించింది. అదేవిధంగా 25ఏళ్లకు పైగా సేవలందిస్తున్న 33/11 కేవీ సబ్స్టేషన్ల ఆధునికీకరణ పనులను కూడా చేపడుతోంది. ఇప్పటివరకు ఆరు సబ్స్టేషన్లలో పనులు పూర్తికాగా, మరో 13 చోట్ల కొనసాగుతున్నాయి. ఈ రెండు కార్యక్రమాలతో విద్యుత్ సరఫరాలో అంతరాయాలను తగ్గించి, నాణ్యతను పెంచడంతో పాటు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు మార్గం సుగమమవుతోంది.
ఫ 65 సబ్స్టేషన్లపై రియల్‌టైమ్ నిఘా
విద్యుత్ సరఫరా వ్యవస్థలో ఎక్కడైనా సమస్య తలెత్తితే గుర్తించేందుకు గతంలో క్షేత్రస్థాయి సిబ్బంది సమాచారం, పరిశీలనపై ఎక్కువగా ఆధారప డాల్సి వచ్చేది. ప్రస్తుతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ పరిస్థితిలో మార్పు వస్తోంది. ఆర్టీఎఫ్ఎంఎస్ ద్వారా విద్యుత్ ఫీడర్ల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించే అవకాశం ఏర్పడింది. పెద్దపల్లి సర్కిల్ పరిధిలో మొదటి దశలో 65 సబ్స్టేషన్లను స్కాడా వ్యవస్థతో అనుసంధానం చేసి 100 శాతం పనులు పూర్తి చేశారు. స్కాడా కంట్రోల్ రూమ్ నుంచే విద్యుత్ సరఫరా పరిస్థితిని పరిశీలించే వీలుండటంతో పాటు ఫీడర్లలో అంతరాయాలు, ఓవర్‌లోడ్, వోల్టేజ్ హెచ్చుతగ్గులను తక్షణమే గుర్తించే వెసులుబాటు నెలకొంది. సంబంధిత క్షేత్రస్థాయి సిబ్బందిని వెంటనే అప్రమత్తం చేయడం ద్వారా మరమ్మతులు వేగంగా చేపట్టి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించవచ్చు.
ఫ పాత సబ్స్టేషన్లకు ఆధునిక హంగులు
మరోవైపు జిల్లాలో 25 సంవత్సరాలకు పైగా సేవలందిస్తున్న 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లను దశలవారీగా ఆధునికీకరిస్తున్నారు. సుదీర్ఘకాలం వినియోగంతో తుప్పుపట్టిన పరికరాలు, పాతబడిన విద్యుత్ వ్యవస్థలను గుర్తించి వాటి స్థానంలో కొత్త పరికరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు ఆరు సబ్స్టేషన్ల ఆధునికీకరణ పనులు పూర్తికాగా, మరో 13 సబ్స్టేషన్లలో పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి.
ఫ వేసవి, వ్యవసాయ అవసరాలకు ఊరట
జిల్లాలో గృహ, వాణిజ్య, పారిశ్రామిక అవసరాలతో పాటు వ్యవసాయ విద్యుత్ వినియోగం కూడా అధికంగానే ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో, వ్యవసాయ అవసరాలు పెరిగే సమయంలో సబ్స్టేషన్లపై విద్యుత్ లోడ్ పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పాత పరికరాలపై ఒత్తిడి పెరిగి సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో సబ్స్టేషన్ల ఆధునికీకరణ, కండక్టర్ల సామర్థ్యం పెంపు, ఆర్టీఎఫ్ఎంఎస్ ద్వారా నిరంతర పర్యవేక్షణ వంటి చర్యలు కీలకంగా మారనున్నాయి. పెరిగే విద్యుత్ డిమాండ్‌ను సమర్థంగా నిర్వహించేందుకు ఇవి దోహదపడనున్నాయి.
ఫ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా
- గంగాధర్ రావు, సూపరింటెండింగ్ ఇంజినీర్, పెద్దపల్లి సర్కిల్
వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సేవలను అందించడమే టీజీఎన్పీడీసీఎల్ ప్రధాన లక్ష్యం. పెద్దపల్లి సర్కిల్ పరిధిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తున్నాం. ఆర్టీఎఫ్ఎంఎస్ ద్వారా సబ్స్టేషన్లను స్కాడాతో అనుసంధానించి మొదటి దశలో వంద శాతం లక్ష్యాన్ని పూర్తి చేశాం. దీనివల్ల విద్యుత్ ఫీడర్ల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అంతరాయాలు, ఓవర్‌లోడ్, వోల్టేజ్ హెచ్చుతగ్గులను తక్షణమే గుర్తించి పరిష్కరించే అవకాశం ఏర్పడింది. మరోవైపు 25 ఏళ్లకు పైగా సేవలందిస్తున్న పాత సబ్స్టేషన్లను దశలవారీగా ఆధునికీకరిస్తున్నాం. ఇప్పటివరకు ఆరు సబ్స్టేషన్లలో పనులు పూర్తి చేయగా, మరో 13 చోట్ల పనులు కొనసాగుతున్నాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయాలను తగ్గించి ప్రజలకు మెరుగైన సేవ లు అందించేందుకు కృషి చేస్తున్నాం.