సాగునీటిపై అవగాహన లేని ఎమ్మెల్యే..
ABN , Publish Date - Mar 15 , 2026 | 11:57 PM
సాగునీటిపై అవగాహన లేని ఎమ్మెల్యే సత్యనారాయణ ఇతరులు చెప్పింది మాట్లాడుతున్నాడని, కరువు మండలంలో రైతులకు సాగునీరు అంది వలసలు తగ్గిపోవడం ఆయనకు కనిపించడం లేదా అని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రశ్నించారు.
ఇల్లంతకుంట, మార్చి 15 (ఆంధ్రజ్యోతి) : సాగునీటిపై అవగాహన లేని ఎమ్మెల్యే సత్యనారాయణ ఇతరులు చెప్పింది మాట్లాడుతున్నాడని, కరువు మండలంలో రైతులకు సాగునీరు అంది వలసలు తగ్గిపోవడం ఆయనకు కనిపించడం లేదా అని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రశ్నించారు. మండలకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతులకు సాగునీటి అందించాలనే ఉన్నత లక్ష్యంతో కేసీఆర్ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇల్లంతకుంట మండలం గుండెకాయలాంటిది అన్నారు. గతంలో అన్ని గ్రామాల్లో కరువు తాండవించేదని, మధ్యమానేరు, అన్నపూర్ణ, రంగనాయకసాగర్‌ల ప్రాజెక్టుల నిర్మాణమే కాకుండా గ్రామాలకు కాలువలు నిర్మాణం చేపట్టారన్నారు. కాలువల ద్వారా నీరు రావడం వల్లనే గతంలో మండటెండల్లో మత్తడులు దుంకాయన్నారు. సాగునీటిపై అవగాహన లేని ఎమ్మెల్యే సత్యనారాయణ ఇతరులు చెప్పింది మాట్లాడుతున్నాడని విమర్శించారు. రైతులు నిరసన తెలుపుతుంటే వారి వద్ద పోలీసులను పెట్టి ముందు నుంచే ఎమ్మెల్యే పోయాడని విమర్శించారు. నిధులు విడుదల అయితే వారికి సమాధానం చెప్పవచ్చు కదా అన్నారు. రైతుల హక్కుల రక్షణ కోసం కాపలా కుక్కలుగా ఉంటామని పేర్కొన్నారు. కోట్ల రూపాయలతో ప్రాజెక్టుల నిర్మాణమే కాకుండా భూసేకరణ చేశామన్నారు. కేవలం రూ.3.19కోట్ల కోసం రెండున్నర సంవత్సరాలు పట్టిందన్నారు. ప్రజాసమస్యలు పట్టించుకోని ఎమ్మెల్యేకు కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కర్రుకాల్చి వాతలు పెట్టిన విషయం మర్చిపోవద్దన్నారు. ఎమ్మెల్యే అయి ఉండి రెండు కార్పొరేషన్ స్థానాలు గెలుచుకోలేని పరిస్థితి ఏమ్మెల్యేదని అన్నారు. రైతుల చేపట్టిన దీక్షను విరమించాలని, పనులు ప్రారంభించకపోతే బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలోనే నిరసన చేపడుతామన్నారు. రైతులను, బీఆర్‌ఎస్ నాయకులను అవమానించిన ఎమ్మెల్యే వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జడ్పీమాజీ వైస్‌చైర్మన్ సిద్దం వేణు, నాయకులు ఉడుతల వెంకన్న, కేవీఎన్‌రెడ్డి, జితేందర్‌గౌడ్, కట్ట వెంకట్‌రెడ్డి, బొల్లం వెంకటేశం, మీసరగండ్ల అనీల్‌కుమార్, సాదుల్, రాగటి రమేష్, సావనపెల్లి అనీల్, కూనబోయిన రఘు, పండుగు భాస్కర్, రడం ప్రవీణ్, ఒల్లాల రవి, కెశవేని శ్రీనివాస్, గొట్టెపర్తి అంజయ్య, ఆకుల శ్రీనివాస్, నవీన్, ఒరుపుల రాములు, పసుల బాలరాజు, బొప్ప శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.