బడ్జెట్‌పై మిశ్రమ స్పందన
ABN , Publish Date - Mar 21 , 2026 | 01:42 AM
శాసనసభలో డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో జగిత్యాల జిల్లాకు ప్రత్యేకంగా నిధులు ఏమీ కేటాయించనప్పటికీ, రాష్ట్రంలో జిల్లా వాటాగా పలు రకాలుగా నిధులు పొందనుంది. ఈ బడ్జెట్ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయగా, ఇందులో సాగునీటి ప్రాజెక్టులకు కేటాయింపులు పెంచారు. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీకి అనుగుణంగా ఆరు గ్యారెంటీలు సంక్షేమ పథకాల కొనసాగింపు వంటివి జగిత్యాల జిల్లా ప్రజలకు మేలు చేకూర్చనున్నాయి.
- అన్ని వర్గాలకు ఊరట అంటున్న కాంగ్రెస్ నేతలు
- అంకెల గారడీ అని కొట్టి పారేస్తున్న ప్రతిపక్షాలు
- ప్రభుత్వ పథకాలకు నిధులతో జగిత్యాలకు లబ్ధి
- ప్రత్యేకంగా కనిపించని జిల్లా ప్రస్తావన
- రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం భట్టి
జగిత్యాల, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): శాసనసభలో డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో జగిత్యాల జిల్లాకు ప్రత్యేకంగా నిధులు ఏమీ కేటాయించనప్పటికీ, రాష్ట్రంలో జిల్లా వాటాగా పలు రకాలుగా నిధులు పొందనుంది. ఈ బడ్జెట్ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయగా, ఇందులో సాగునీటి ప్రాజెక్టులకు కేటాయింపులు పెంచారు. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీకి అనుగుణంగా ఆరు గ్యారెంటీలు సంక్షేమ పథకాల కొనసాగింపు వంటివి జగిత్యాల జిల్లా ప్రజలకు మేలు చేకూర్చనున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగాన్ని చదివి వినిపించారు. ఈ నేపథ్యంలో జిల్లాకు చేకూరే లబ్ధి గతంతో పోలిస్తే సాగు, సంక్షేమంలో స్వల్పంగా మెరుగు కనిపిస్తోంది. కాగా బడ్జెట్ కేటాయింపులపై జిల్లాలో మిశ్రమ స్పందన వచ్చింది. పలురంగాల ప్రజలను ఆకర్షించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని అధికార పార్టీ నేతలు అంటుండగా...అంకెల గారెడీగా ఉందని ప్రతిపక్ష నేతలు కొట్టిపారేస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్‌పై ప్రధాన రాజకీయ పార్టీల నేతలు, ప్రజాప్రతినిదులు, వివిధ రంగాల నిపుణులు అందించిన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి..
అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా..
- అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి
ముఖ్యమంత్రి రేవంతరెడ్డి నేతృత్వంలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ బ్రహ్మాండంగా ఉంది. అభివృద్ధి, సంక్షేమం రెండు గుర్రాలుగా ఉండే విధంగా బడ్జెట్‌ను రూపొందించారు. అన్నివర్గాలకు సమాన ప్రాధాన్యతనిచ్చారు. గోదావరి పుష్కరాలకు తొలి విడత కింద రూ. 500 కోట్లు కేటాయించారు. ఆరు గ్యారెంటీల సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపు జరిపారు.
పేదవారి కల నెరవేర్చేలా..
- డాక్టర్ మాకునూరి సంజయ్‌కుమార్, ఎమ్మెల్యే, జగిత్యాల
సమాజంలోని అన్నివర్గాలకు ఆమోదయోగ్యంగా ఉండేలా ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ పేదవాడి ఇంటి కల నెరవేర్చడమే కాకుండా, కడుపు నింపే విధంగా ఉంది. యువతకు ఉపాధి అవకాశాలు పెంచే విధంగా బడ్జెట్ రూపకల్పన చేశారు. రైతులు, మహిళలు, మైనార్టీలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంక్షేమ ఫలాలు అందనున్నాయి.
ఏ ఒక్క వాగ్ధానం నెరవేర్చేలా లేదు
- డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, ఎమ్మెల్యే, కోరుట్ల
రాష్ట్ర బడ్జెట్ మసిపూసి మారేడు కాయ చేసే విధంగా ఉంది. మైనార్టీ సబ్ ప్లాన, బీసీ సబ్ ప్లాన్లకు తగిన విధంగా కేటాయింపులు లేవు. రాజీవ్ యువ వికాసం కేటాయింపులున్నప్పటికీ వ్యయం చేయడం లేదు. ఆరు గ్యారెంటీల హామీకి బడ్జెట్ కేటాయింపులు లేవు. మహిళలకు తులం బంగారం, మహాలక్ష్మి పథకాలకు కేటాయింపులు లేవు. ఉద్యోగుల, రిటైర్మెంటు ఎంప్లాయీస్ సంక్షేమాన్ని విస్మరించారు. యువత, విద్యార్థులు, రైతులు, మహిళలు, వృద్ధులు ఇలా అన్ని రంగాల వ్యక్తులు, కులాల సంక్షేమాన్ని పట్టించుకోలేదు.
జనరంజకంగా ఉంది
- గాజెంగి నందయ్య, డీసీసీ అధ్యక్షుడు
రాష్ట్ర బడ్జెట్ జనరంజకంగా ఉంది. సామాన్య, మధ్య, పేదతరగతి ప్రజలందరికీ ఫలాలు అందేలా కేటాయింపులున్నాయి. వ్యవసాయ శాఖకు, సివిల్ సప్లయి శాఖకు కేటాయింపులు పెంచారు. సన్నబియ్యం పథకం అందరికీ అందేలా ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా’ను ప్రవేశపెట్టడం గొప్ప విషయం.
ప్రజలకు తప్పుదోవ పట్టిస్తున్నారు..
- కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు
అంకెల గారడీ బడ్జెట్‌ను మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. అబద్దపు మాటలు, హామీల బడ్జెట్‌ను రూపొందించారు. వాగ్ధానాలను నెరవేర్చేలా బడ్జెట్‌లో కేటాయింపులు జరగలేదు. కళ్లబొల్లి మాటలు, ఉత్త కబుర్లతో సీఎం రేవంతరెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.
కాగితాలకే పరిమితం..
- యాదగిరి బాబు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు
రాష్ట్రప్రభత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కాగితాలకే పరిమితం అయ్యేలా కనిపిస్తోంది. జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణాలకు అవసరమైన నిధులు కేటాయించలేదు. పేద ప్రజల సంక్షేమానికి, పల్లెలు, పట్టణాల అభివృద్ధిని ప్రభుత్వం విస్మరించింది. ప్రభుత్వం అంకెల గారడీగా బడ్జెట్ ఉంది.
పెండింగ్ బిల్లుల ప్రస్తావన లేదు..
- తిరుక్కోవెల శ్యామ్‌సుందర్, టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు
విద్యారంగానికి కేటాయింపుల్లో ప్రభుత్వం మాటతప్పింది. గత సంవత్సరం కంటే స్వల్పంగా కేటాయింపులు పెరిగాయి. ఉపాధ్యాయ, ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, పీఆర్‌సీ ప్రస్తావన బడ్జెట్‌లో లేకపోవడం బాధాకరం. విద్యారంగానికి 15 శాతం బడ్జెట్ కేటాయిస్తామన్న హామీ నెరవేర్చలేదు.
నాణ్యవైన విద్య అందేలా..
- నునావత రాజు, టీజీయూఎస్ జిల్లా అధ్యక్షుడు
ప్రతీ విద్యార్థికి నాణ్యమైన విద్యా అవకాశాలు అందేలా బడ్జెట్ రూపకల్పన జరిగింది. విద్యా వ్యాప్తిలో విప్లవాత్మక మార్పును తీసుకొని రావడానికి, సామాజిక సమానత్వం వంటి లక్ష్యాలను సాధించడానికి ఒక మెరుగైన దిశగా బడ్జెట్ ఉపయోగపడుతుంది. ఉపాధ్యాయుల శిక్షణ, శిక్షణాపరికారాలు, బేస్‌డ్ టెక్నాలజీకి మరింత మద్దతు ఇచ్చేలా బడ్జెట్‌ను రూపొందించారు.
వాస్తవికతకు దూరంగా..
- దావ వసంత, జడ్పీ మాజీ చైర్‌పర్సన
వాస్తవికతకు దూరంగా బడ్జెట్ అంచనా ఉంది. సాగు నీటి ప్రాజెక్టు నిర్మాణం, అభివృద్ధిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేనట్లు స్పష్టమైంది. ఉద్యోగ, ఉపాధి కల్పనలో ప్రభుత్వ వైఫల్యం కనబడింది. గ్రామీణాభివృద్ధి కోసం కేటాయించిన నిధుల కొరత బడ్జెట్ డొల్లతనం, ప్రభుత్వ పనితీరును తేటతెల్లం చేశాయి. విద్యా, వైద్య, ఉద్యోగ, ఉపాధి, గ్రామీణ, రైతు ఇలా అన్ని వర్గాల ప్రజలను మభ్యపెట్టేలా అంకెల గారడీతో బడ్జెట్‌ను రూపొందించారు.
నిరుద్యోగుల ఆశలు గల్లంతు..
- దొనికెల నవీన, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు
భట్టి బడ్జెట్..అంతా బోగస్ మాదిరిగా ఉంది. సకల జనులకు దక్కింది గుండు సున్నాగా స్పష్టమైంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో స్కాములు తప్ప...స్కీములు లేవని బడ్జెట్ ద్వారా అర్థమైంది. ఆరు గ్యారెంటీల హామీ నెరవేర్చేలా బడ్జెట్‌లో కేటాయింపులు లేవు. నిరుద్యోగుల ఆశలను బడ్జెట్ గల్లంతు చేసింది. గోదావరి పుష్కరాలకు అరకొరగా కేటాయింపులు జరిపారు. విద్యాశాఖకు సరైన విధంగా కేటాయింపులు చేయలేదు.
ప్రజల ఆశయాలకు అనుగుణంగా..
- బండ శంకర్, టీపీసీసీ సెక్రెటరీ
రాష్ట్ర బడ్జెట్ ప్రజల ఆశయాలకు అనుకూలమైన బడ్జెట్‌గా దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, అభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్ ఉంది. సకల జనులకు ఆమోదయోగ్యంగా బడ్జెట్ రూపకల్పన జరిపిన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కకు, సారథ్యం వహించిన ముఖ్యమంత్రి రేవంతరెడ్డికి ధన్యవాదాలు.
ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అభినందనీయం
- కొట్టాల తిరుపతి, తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ సంఘం జిల్లా అధ్యక్షుడు
ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించడం అభినందనీయం. దీనివల్ల సుమారు రెండు లక్షల మంది పేద విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. విద్యార్థుల హాజరు శాతం పెరుగుతుంది.