బీఆర్‌ఎస్‌కు వలసల బెడద
ABN , Publish Date - Jan 21 , 2026 | 01:37 AM
తెలంగాణ ఉద్యమకాలంలో, రాషా్ట్రన్ని సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత దశాబ్దంపాటు జిల్లా బీఆర్‌ఎస్‌కు కంచుకోటగా నిలిచింది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషనలో మేయర్ పీఠాన్ని అధిష్ఠించిన ఆ పార్టీ ప్రస్తుత కార్పొరేషన ఎన్నికల సమయంలో గుండె చెదురుతున్న వాతావరణం కనిపిస్తున్నది. గ
- పార్టీని వీడుతున్న మాజీ కార్పొరేటర్లు
- ఎమ్మెల్యేలకు సవాల్‌గా మారిన ఎన్నికలు
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
తెలంగాణ ఉద్యమకాలంలో, రాషా్ట్రన్ని సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత దశాబ్దంపాటు జిల్లా బీఆర్‌ఎస్‌కు కంచుకోటగా నిలిచింది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషనలో మేయర్ పీఠాన్ని అధిష్ఠించిన ఆ పార్టీ ప్రస్తుత కార్పొరేషన ఎన్నికల సమయంలో గుండె చెదురుతున్న వాతావరణం కనిపిస్తున్నది. గత ఎన్నికల్లో ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేని కాంగ్రెస్ ఈసారి అధికారపార్టీగా గెలుపుకలలు కంటోంది. కార్పొరేషనపై కాషాయ జెండాను రెపరెపలాడించడం ఖాయమని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. గతంలో అధికారపీఠాన్ని అలంకరించిన బీఆర్‌ఎస్ నుంచి రోజుకొకరుగా మాజీ కార్పొరేటర్లు పార్టీని వీడుతున్నారు.
ఫ అసెంబ్లీ ఎన్నికల తర్వాత లెక్కలు తారుమారు
కరీంనగర్ కార్పొరేషన జిల్లా రాజకీయాలకు ఆయువు పట్టులాంటిది. కార్పొరేషనతోపాటు కరీంనగర్ రూరల్, కొత్తపల్లి మండలాలు కలిస్తే కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం. కరీంనగర్ కార్పొరేషనను దక్కించుకున్న వారికే అసెంబ్లీ ఎన్నికల్లోనూ అనుకూల ఫలితాలు వస్తాయని అన్ని పార్టీలు విశ్వసిస్తాయి. అసెంబ్లీ నియోజకవర్గంలోని మూడు వంతుల ఓట్లు ఈ కార్పొరేషన పరిధిలోనే ఉండడంతో అన్ని రాజకీయ పక్షాలు ఇక్కడ విజయం సాధించడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. ఇప్పుడు కూడా అన్ని పార్టీలు అదే ఆలోచనతో కార్పొరేషన ఎన్నికలపై దృష్టి సారిస్తున్నాయి. కరీంనగర్ కార్పొరేషన పరిధిలో గత ఎన్నికల సమయంలో 60 డివిజన్లు ఉండగా వాటిలో 33 స్థానాలను కైవసం చేసుకున్న బీఆర్‌ఎస్ స్పష్టమైన ఆధిక్యతతో మేయర్ పదవిని చేపట్టింది. బీఆర్‌ఎస్‌కు చెందిన వై సునీల్‌రావు మేయర్‌గా అదే పార్టీకి చెందిన చల్ల స్వరూపరాణి డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో 13 స్థానాలను బీజేపీ, ఆరు స్థానాలను ఎంఐఎం, ఎనిమిది స్థానాలను ఇండిపెండెంట్లు దక్కించుకున్నారు. ఒక ఇండిపెండెంట్ ఎన్నికల తర్వాత ఎంఐఎంలో చేరగా, ఏడుగురు ఇండిపెండెంట్లు ఆనాటి అధికార పార్టీ అయిన బీఆర్‌ఎస్‌లో చేరారు. బీజేపీలో గెలిచిన ఒక కార్పొరేటర్ ఎన్నికల తర్వాత కొంత కాలానికి బీఆర్‌ఎస్‌లో చేరారు. అయిదేళ్ళపాటు ఈ పాలకవర్గం కొనసాగగా కార్పొరేషన రాజకీయాల్లో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఇండిపెండెంట్లు, బీజేపీ సభ్యుడి చేరికతో 41 స్థానాలకు చేరుకున్న బీఆర్‌ఎస్ నుంచి తొమ్మిది మంది కాంగ్రెస్‌లో చేరారు. దీంతో పాలకవర్గం గడువు ముగిసేనాటికి ఒక్కస్థానం కూడా లేని కాంగ్రెస్ తొమ్మిది మంది కార్పొరేటర్ల బలాన్ని పొందింది. బీఆర్‌ఎస్ బలం 32కు పడిపోయింది. బీజేపీ 12, ఎంఐఎం ఏడుగురు కార్పొరేటర్లతో ఉంది.
ఫ ఇతర పార్టీల్లోకి వరుస కడుతున్న నాయకులు
ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయి కాంగ్రెస్ అధికారపార్టీగా మారడంతో ఆ పార్టీకి మద్దతు పెరుగుతూ వస్తున్నది. కరీంనగర్ ఎంపీగా గెలుపొందిన బండిసంజయ్‌కుమార్ కేంద్ర ప్రభుత్వంలో హోంశాఖ సహాయమంత్రి పదవి చేపట్టడంతో జిల్లా రాజకీయాల్లో ఆయన పాత్ర కీలకంగా మారింది. బీజేపీకి పట్టణ ప్రాంతంలో ఆదరణ పెరగడం, దానికి కేంద్రమంత్రిగా బండి సంజయ్ ప్రభావం తోడవడంతో పలువురు బీఆర్‌ఎస్ నేతలు ఆ పార్టీ వైపు మొగ్గుచూపుతున్నారు. బీజేపీకి ప్రజల్లో ఆదరణ ఉన్నా కొన్ని డివిజన్లలో ప్రజల్లో పరిచయం, పలుకుబడి ఉన్న నేతలు లేరు. ఆ లోటును భర్తీ చేస్తూ బీజేపీ అభ్యర్థులుగా బరిలో నిలిచి కార్పొరేటర్లుగా విజయం సాధించాలని పలువురు మాజీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు ఆలోచిస్తున్నారు. బీఆర్‌ఎస్ కార్పొరేటర్‌గా ఉన్న బండారి వేణు రెండు రోజుల క్రితం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా మాజీ కార్పొరేటర్లు గూడూరి మురళి, పెద్దపల్లి రవీందర్ బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. మేయర్‌గా పనిచేసిన సునీల్‌రావు తన పదవీకాలం ముగియగానే మాజీ కార్పొరేటర్లు శ్రీదేవి చంద్రమౌళి, లెక్కల స్వప్నవేణుతో కలిసి బీజేపీలో చేరారు. మరికొంత మంది తాజా మాజీ కార్పొరేటర్లు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల వైపు చూస్తున్నారని, వారంతా ఆయా పార్టీల నేతలతో మంతనాలు జరుపుతూ ఒకటిరెండు రోజుల్లో ఆయా పార్టీలో చేరే అవకాశాలున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఫ పట్టు నిలుపుకుంటారా..
జిల్లాలో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న కరీంనగర్ కార్పొరేషనతోపాటు చొప్పదండి, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల్లో చొప్పదండి మినహా మిగతా మూడు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో ఉన్నాయి. కీలకమైన కరీంనగర్ కార్పొరేషనలో గెలుపు గుర్రాలను ఎంపిక చేసి గెలిపించే బాధ్యత మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌పై ఉంది. హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలను గెలిపించుకునే బాధ్యత బీఆర్‌ఎస్ అక్కడి ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై ఉంచింది. ఈ మూడు కూడా గతంలో బీఆర్‌ఎస్ పాలకవర్గాల పాలనలోనే ఉన్నాయి. ఇప్పుడు వాటిని దక్కించుకోవడం ఆ పార్టీకి సవాల్‌గా మారింది.