Share News

మెగా జాబ్‌మేళాకు విశేష స్పందన

ABN , Publish Date - May 06 , 2026 | 12:20 AM

ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు విశేష స్పందన లభించింది.

మెగా జాబ్‌మేళాకు విశేష స్పందన

కరీంనగర్‌ టౌన్‌, మే 5 (ఆంధ్రజ్యోతి): ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు విశేష స్పందన లభించింది. కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు చెందిన మూడు వేల మంది నిరుద్యోగ యువతీ, యువకులు ఈ మేళాకు హాజరై వివిధ కంపెనీలు నిర్వహించిన ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. అభ్యర్థుల కోసం 95 స్టాల్స్‌తోపాటు సందేహాలను నివృత్తిచేసేందుకు హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేశారు. ఈ జాబ్‌ మేళాలో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ కంపెనీలతోపాటు కరీంనగర్‌కు చెందిన కంపెనీలు పాల్గొన్నాయి. ఐటీ, నాన్‌ ఐటీ, హెల్త్‌కేర్‌, ఆర్గానిక్‌, డెయిరీ, వ్యవసాయం తదితర రంగాలకు చెందిన 90 కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించాయి. 997 మంది ఇంటర్వ్యూలో ప్రాథమికంగా ఉద్యోగాలకు ఎంపికైనట్లు ఆయా కంపెనీలు ప్రకటించాయి. మరో 478 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసి నియామక పత్రాలను అందజేశారు. కలెక్టర్‌ చిత్రా మిశ్రా పర్యవేక్షణలో నిర్వహించిన ఈ జాబ్‌మేళాకు వివిధశాఖల అధికారులు పకడ్బందీ ఏర్పాట్లుచేశారు.

ఫ మూడునెలలకొకసారి జాబ్‌ మేళా నిర్వహిస్తాం..

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన ఈ జాబ్‌మేళా అధికారుల సమన్వయంతో విజయవంతమైందని కలెక్టర్‌ చిత్రా మిశ్రా ప్రకటించారు. ఇకపై జిల్లాలో మూడు నెలలకొకసారి జాబ్‌మేళాను నిర్వహిస్తామని తెలిపారు. జిల్లాకేంద్రంతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ జాబ్‌మేళాలను నిర్వహిస్తామని, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో కె మహేశ్వర్‌, జిల్లా ఉపాధికల్పనాధికారి తిరుపతిరావు, డీవైఎస్‌వో శ్రీనివాస్‌గౌడ్‌, పరిశ్రమలశాఖ జీఎం సాల్మన్‌రాజు, మెప్మా పీడీ స్వరూపరాణి, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి పాల్గొన్నారు.

Updated Date - May 06 , 2026 | 12:20 AM