క్షతగాత్రులకు తక్షణ వైద్య సేవలందేలా చర్యలు
ABN , Publish Date - Jul 10 , 2026 | 12:18 AM
వేములవాడ అర్బన్ మండలం అనుపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన క్షతగాత్రులకు తక్షణ వైద్య సేవలను అందేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
సిరిసిల్ల టౌన్, జూలై 9 (ఆంధ్రజ్యోతి) : వేములవాడ అర్బన్ మండలం అనుపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన క్షతగాత్రులకు తక్షణ వైద్య సేవలను అందేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. గురువారం రాత్రి జిల్లా కేంద్రం జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో చికిత్స పొదుతున్న క్షతగాత్రులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎస్పీ మహేష్ బి. గితే, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ పరామర్శించారు. అనుపురం రోడ్డు ప్రమాద ఘటనపై ప్రభుత్వ విప్ దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందడంపై సంతాపం తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. జిల్లా వైద్యశాలలో క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితులను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులందరికి మెరుగైన వైద్య సేవలను అందించేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధి కారులను ప్రభుత్వ విప్ ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ చేపడతామని బస్సు డ్రైవర్ నిర్లక్షమా...? వాహన భద్రతా లోపమా? ఇతర కారణాల వల్ల ప్రమాదం జరిగిందా? అనే అంశాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సూదూర ప్రాంతాల నుంచి వచ్చిన బాధిత కార్మిక కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, టీపీసీసీ మాజీ కార్యదర్శి గడ్డం నర్సయ్య, పట్టణ మాజీ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ తదితరులు ఉన్నారు.