అరకొర నిధులు.. అంతలోనే ఖర్చు
ABN , Publish Date - Oct 14 , 2026 | 01:27 AM
ఆత్మకు పదేళ్ల తర్వాత ఈసారి నిధులొచ్చాయి. అరకొరగా వచ్చిన డబ్బులు కొన్నాళ్లకే ఖర్చయ్యాయి. వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఉన్న వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) ఆధ్వర్యంలో జిల్లాలోని రైతాంగానికి అవసరమైన అవగాహన కార్యక్రమాలు, శిక్షణ తరగతులను ఈ నిధులతో నిర్వహిస్తారు.
(ఆంధ్రజ్యోతి, కరీంనగర్)
ఆత్మకు పదేళ్ల తర్వాత ఈసారి నిధులొచ్చాయి. అరకొరగా వచ్చిన డబ్బులు కొన్నాళ్లకే ఖర్చయ్యాయి. వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఉన్న వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) ఆధ్వర్యంలో జిల్లాలోని రైతాంగానికి అవసరమైన అవగాహన కార్యక్రమాలు, శిక్షణ తరగతులను ఈ నిధులతో నిర్వహిస్తారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచేందుకు రైతు మేళాలు, వ్యవసాయ క్షేత్ర ప్రదర్శనలను ఏర్పాటు చేస్తారు. వ్యవసాయ యాంత్రీకరణ, నూతన పద్ధతులపై సమగ్రమైన అవగాహన కల్పిస్తారు. 2010 నుంచి 2016 సంవత్సరం వరకు ఈ కార్యక్రమాలకు నిధులను అప్పటి ప్రభుత్వాలు కేటాయించాయి. కాలక్రమంగా నిధుల విడుదల ఆగిపోయింది. మళ్లీ ఈ ఏడాది జూలైలో జిల్లాకు 11.5 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. జిల్లాకు వచ్చిన నిధులను పశుసంవర్థక శాఖ, వ్యవసాయశాఖ, ఉద్యాన, పట్టు, మత్స్యశాఖలకు పంపిణీ చేశారు. ఆయా శాఖలకు చేరిన మొత్తాన్ని ఏ మేరకు పక్కాగా ఖర్చు చేశారనేది ప్రశ్నగానే మిగిలింది. వ్యవసాయ సీజన్ మధ్యలో వచ్చిన నిధుల వాడకంలో ఏ మేరకు నిబంధనలు పాటించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఫ గతంలో అడ్డగోలు వ్యవహారాలు
జిల్లాలో ఆత్మ నిధులు అంటేనే స్వాహాల పర్వమనే పంథా గతంలో కనిపించింది. ఈ నిధులు ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారని, చేయని పర్యటనలకు బిల్లులు పెట్టారనే రైతు సంఘాలు ఆరోపించాయి. 2016 వరకు ప్రతి ఏడాదికి ఉమ్మడి జిల్లా యూనిట్‌గా 57 లక్షల నుంచి 60లక్షల వరకు వచ్చాయి. అసలు చేయని పనులకు లెక్కలు రాశారనే విమర్శలు తరుచూ వినిపించేవి. బాహాటంగా మండల సర్వసభ్య సమావేశాలతోపాటు జిల్లాపరిషత్‌లో ఈ నిధులు పక్కదారి పట్టిన తీరుపైనే చర్చ జరిగేది. నిధులు దుర్వినియోగం అయిన తీరుపై విచారణలు జరిగిన సందర్భాలున్నాయి. అయితే శిక్షణకు రైతులను తక్కువగా తీసుకెళ్లి ఎక్కువ మంది పేర్ల నమోదు చేయడంతోపాటు భోజనాలు, వాహన ఖర్చులకు రెండింతల వ్యయాన్ని లెక్కల్లో చూపడంతో అక్రమాలు బయటపడ్డాయి. దీంతో కొన్నేళ్లుగా ఈ నిధులను అందించలేదు. మళ్లీ ఇటీవల రైతాంగానికి ఉపయుక్తంగా ఆత్మ కార్యక్రమాల్ని జరపాలని కొంత మొత్తాన్ని జిల్లాలకు కేటాయించారు.
ఫ పర్యవేక్షణ పెంచితేనే మేలు
జిల్లాలో బ్లాక్ అధికారుల పరిధిలో ఈ నిధులను దాదాపుగా 90 శాతం పూర్తిచేసినట్లు సమాచారం. నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారంగా వీటి ఖర్చులు జరిగాయా.? లేదా అనేది వ్యవసాయ శాఖలోని ఉన్నతాధికారులు పరిశీలించాల్సిన అవసరముంది. ఇటీవల ఖర్చు చేసిన నిధులకు సంబంధించి రసీదులు, యుటిలైజేషన్ సర్టిఫికేట్లను జిల్లా వ్యవసాయశాఖకు సమర్పిస్తున్నారు. వీటి ఆధారంగా అసలు క్షేత్రస్థాయిలో వీటిని పక్కాగా నిర్వహించారా..? లేదా అనేది ఆరా తీయాల్సిన అవసరముంది. చాలా రోజుల తర్వాత వచ్చిన నిధులను ఈ యాసంగికి ముందు పంటలపై రైతులకు ఉపయోగకరమైన కార్యక్రమాలకు వినియోగించాలని ఇతర జిల్లాల అధికారులు యోచిసున్నారు. కరీంనగర్ జిల్లాలో ఇందుకు విరుద్ధంగా జరగడంత్లో పారదర్శకత లోపించిందేమోననే సందేహాలు పలువురి నుంచి వ్యక్తమవుతున్నాయి. రైతుల ప్రయోజనం కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులు పక్కదారి పట్టకుండా ఉండేందుకు జిల్లా వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతోపాటు కలెక్టర్ ప్రత్యేకమైన శ్రద్ధ కనబర్చాల్సిన అవసరముంది.