Share News

శ్రీరస్తు..శుభమస్తు.. కల్యాణమస్తు

ABN , Publish Date - Nov 17 , 2026 | 01:29 AM

కార్తీక మాస ప్రారంభంతో జిల్లాలో పెళ్లిళ్ల సందడి మొదలైంది. మార్కెట్‌లో వివాహ అనుబంధ వ్యాపార దుకాణాల్లో రద్దీ పెరిగింది. బంగారం ధరలు కాస్త తగ్గినా ఫంక్షన్‌ హాళ్లు మొదలుకొని నిత్యావసరాల వరకు అన్నింటి ధరలు పెరిగాయి.

శ్రీరస్తు..శుభమస్తు.. కల్యాణమస్తు

- జిల్లాలో పెళ్లిళ్ల సందడి

- ప్రారంభమైన కార్తీక మాసం..

- వివాహాలకు ముహూర్తాలు

- దిగి వచ్చిన బంగారం ధరలు

జగిత్యాల, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): కార్తీక మాస ప్రారంభంతో జిల్లాలో పెళ్లిళ్ల సందడి మొదలైంది. మార్కెట్‌లో వివాహ అనుబంధ వ్యాపార దుకాణాల్లో రద్దీ పెరిగింది. బంగారం ధరలు కాస్త తగ్గినా ఫంక్షన్‌ హాళ్లు మొదలుకొని నిత్యావసరాల వరకు అన్నింటి ధరలు పెరిగాయి. నెల రోజుల నుంచి ఇప్పటి వరకు బంగారం ధరలు 10 గ్రాములకు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు తగ్గినట్లు మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. పేద, మధ్య తరగతి వర్గాల వారు పెళ్లి చేయాలంటే తలకు మించిన భారంగా మారుతోందని ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మూడుముళ్లతో వందల సంఖ్యలో నవ జంటలు ఒక్కటి కానున్నాయి. యువతీ యువకుల తల్లిదండ్రులు పెళ్లి పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నారు. జిల్లాలోని ప్రధాన పట్టణాలయిన జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, రాయికల్‌ పట్టణాలతో పాటు పలు గ్రామాల్లో అధిక సంఖ్యలో వివాహ వేడుకలు జరగనున్నాయి.

ఫ శుభ ముహూర్తాలు..

కార్తీకమాసం, మార్గ శిర మాసంలో (నవంబరు, డిసెంబరు) రెండు నెలలు వివాహాది ముహూర్తాలున్నాయని పురోహితులు చెబుతున్నారు. నవంబరులో 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు, 18 నుంచి 22 వరకు, 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ముహూర్తాలున్నాయంటున్నారు. డిసెంబరులో 2 నుంచి 4వ తేదీ వరకు, 10 నుంచి 13 వరకు, 15 నుంచి 19 వరకు, 22వ, 23వ తేదీల్లో, 27 నుంచి 31వ తేదీ వరకు వివాహాది శుభకార్యాలు ఉన్నట్లు పురోహితులు తెలిపారు.

ఫఫంక్షన్‌హాళ్లు, క్యాటరింగ్‌ ముందస్తు బుకింగ్‌లు...

జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో పెళ్లిళ్లు జరగనుండడంతో తల్లిదండ్రులు ముందస్తు పనులపై దృష్టి సారించారు. ఫంక్షన్‌హాళ్లు, క్యాటరింగ్‌, పురోహితులు, భాజా భజంత్రీలు, ఆర్కెస్ట్రా, డెకరేషన్‌, ఫొటో గ్రాఫీ, వీడియోగ్రఫీ, ఫ్రీ వెడ్డింగ్‌ షూట్‌ స్టుడియోలు ఇలా పెళ్లికి అవసరమైన వాటిని ముందస్తుగా బుక్‌ చేసుకోవడంపై దృష్టి సారించారు. వివాహాలకు అవసరమైన పట్టు వస్త్రాలు, దుస్తులు, బంగారు ఆభరణాలు ముందస్తు కొనుగోలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో సుమారు 150 వరకు ఫంక్షన్‌ హాళ్లు, 300 వరకు కమ్యూనిటీ హాళ్లు, పదుల సంఖ్యల్లో దేవాలయాల్లో పెళ్లి మండపాలున్నాయి. వీటిని ముందస్తుగా బుక్‌ చేసుకోవడంపై వివాహాల నిర్వాహకులు దృష్టి సారించారు.

ఫఊపందుకోనున్న వ్యాపారాలు...

పెళ్లిళ్ల సీజన్‌ ప్రారంభమవడంతో జిల్లాలోని ప్రధాన పట్టణాలల్లో పలు వ్యాపారాలు జోరుగా సాగనున్నాయి. షాపింగ్‌ మాల్స్‌, బట్టల దుకాణాలు, డ్రెస్సెస్‌, జ్యూవెల్లరీ దుకాణాలు, ఫంక్షన్‌ హాల్స్‌, క్యాటరింగ్‌ కేంద్రాలు, ఫ్లవర్‌ డెకరేటర్స్‌, వంట మాస్టర్స్‌ ఇలా పలు వ్యాపారాలు పుంజుకోనున్నాయి. ప్రధానంగా జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లిలో బంగారం, వస్త్ర వ్యాపారం ఎక్కువగా ఉంటుంది. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి నూతన డిజైన్లతో కూడిన వస్త్రాలను వ్యాపారులు తీసుకువచ్చి తమ దుకాణాల్లో విక్రయానికి సిద్ధంగా ఉంచారు. వినియోగదారులను ఆకర్శించడానికి డిస్కౌంట్‌లు, ఇతర బహుమతులను అందించడానికి ప్రయత్నిస్తున్నారు. వివాహాల సీజన్‌లో జిల్లా మొత్తంగా రోజుకు రూ. కోటి నుంచి రూ. మూడు కోట్ల వరకు వ్యాపార లావాదేవీలు జరుగుతాయని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Updated Date - Nov 17 , 2026 | 01:29 AM