గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు
ABN , Publish Date - Mar 04 , 2026 | 01:06 AM
జిల్లాలో 2027 జూన 26వ తేదీ నుంచి జూలై 7వ తేదీ వరకు జరగనున్న గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది.
జగిత్యాల, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 2027 జూన 26వ తేదీ నుంచి జూలై 7వ తేదీ వరకు జరగనున్న గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. ఇందుకోసం రూ. 942.80 కోట్లు కేటాయింపులు జరపాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ నిధులతో జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం ఎర్ధండి నుంచి మల్లాపూర్, రాయికల్, బీర్‌పూర్ మండలాల్లోని గోదావరి నది తీర ప్రాంతాలతో పాటు ధర్మపురి లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం, వెల్గటూరు మండలం కోటిలింగాల వంటి ప్రధాన క్షేత్రాల తీరాలను అభివృద్ధి చేయాలని సంకల్పించారు. గోదావరి తీరాన ఉన్న చిన్న ఆలయాల వద్ద కూడా స్నాన ఘట్టాల నిర్మాణం, మరమ్మతులు చేపట్టనున్నారు. ప్రధానంగా భక్తుల సౌకర్యాలు, పార్కింగ్ స్థలాలు, ఘాట్ల అభివృద్ధిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. దక్షిణ భారత కుంభమేలా తరహాలో ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, ముందస్తు సన్నద్ధతపై కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. గోదావరి పుష్కరాలకు దాదాపుగా 15 నెలల వ్యవధి ఉన్నందున శాశ్వత మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై ఇప్పటినుంచే దృష్టి సారిస్తున్నారు. ఒకే రోజు రెండు లక్షల మంది భక్తులు పుష్కర ఘాట్లకు తరలివచ్చినా ఇబ్బంది లేకుండా రహదారుల నిర్మాణం, వాహనాల పార్కింగ్, తాగునీరు, స్నానాల ఘాట్లు, అవసరమైన అన్ని వసతులు ఉండేలా కార్యాచరణ సిద్ధం చేశారు. సీఎం రేవంత రెడ్డితో చర్చించి ఆమోదం పొందడానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి గ్రీనసిగ్నల్ అందగానే టెండర్ల ప్రక్రియ, పనులు ప్రారంభించడానికి సమాయత్తం అవుతున్నారు.
- గోదావరి తీర ప్రాంతాల్లో...
ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి, కోమటి కొండాపూర్, మూలరాంపూర్, బర్తీపూర్, వేములకుర్తి, వేములకుర్తి రాత్నాల మడుగు, ఫకీర్‌కొండాపూర్, మల్లాపూర్ మండలం వెంపల్లి వెంకట్రావుపేట, వాల్గొండ, మొగిలిపేట, ఒబులాపూర్, కొత్త దాంరాజ్‌పల్లి, పాత దాంరాజ్‌పల్లి, రాయికల్ మండలం బోయినిపల్లి, బీర్‌పూర్ మండలం చిన్నకొల్వాయి, రేకుర్తి, కమ్మునూరు, ధర్మపురి, తిమ్మాపూర్, రాయపట్నం, దమ్మన్నపేట, రాజారాం, జైనా, దొంతాపూర్, ఆరెపల్లి, వెల్గటూరు మండలం కోటిలింగాల, చెగ్యాం, ముక్కత్రావుపేట గోదావరి తీర ప్రాంతాల్లో పుష్కర ఘాట్లను ఏర్పాటు చేస్తున్నారు.
- ప్రధాన ఆలయాల అభివృద్ధికి ప్రాధాన్యం..
గోదావరి తీరంలోని ప్రధాన ఆలయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమిచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. శాశ్వత పుష్కర ఘాట్ల నిర్మాణం చేపట్టడానికి ప్రయత్నిస్తున్నారు. రెండో ప్రాధాన్యంగా పుష్కర స్నానాలకు వీలుగా ఉండే గోదావరి తీర ప్రాంతాలను అభివృద్ధి చేయడం వంటి వాటిపై దృష్టి సారించారు. జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం ఎర్ధండి నుంచి వెల్గటూరు మండలం కోటిలింగాల వరకు అధికారులు క్షేత్రస్థాయి సందర్శనలు జరుపుతున్నారు. అవసరమైన అభివృద్ధి పనుల జాబితాను తయారు చేశారు. హోల్డింగ్ ఏరియా, పారిశుధ్య నిర్వహణ, ప్రజారవాణా, డ్రోనల ద్వారా పర్యవేక్షణ, లైటింగ్, తాగునీరు ఏర్పాట్లపై ప్రణాళికలు సిద్ధం చేశారు.
- ప్రాథమిక సర్వే పూర్తి..
గోదావరి పుష్కరాలు 2015 జూలై 14వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరిగాయి. ఆ సమయంలో లక్షలాదిగా ప్రజలు తరలివచ్చి పుణ్య స్నానాలు ఆచరించారు. జిల్లాకు అనేక ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. ఆ మేరకు వసతుల కల్పనపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ సలహాలు, సూచనల మేరకు జిల్లా అధికార యంత్రాంగం దృష్టిసారించింది. జిల్లాలో ‘ఈవె’ౖ కన్సల్టెన్సీ సంస్థ క్షేత్రస్థాయిలో ప్రాథమిక సర్వే చేసింది. స్థానికంగా ఉన్న పరిస్థితులను అంచనా వేసి ఎలాంటి సౌకర్యాలు కల్పించాల్సి ఉందో అధ్యయనం చేసింది.
- పుణ్య స్నానాలు...పుణ్య క్షేత్రాలు..
జిల్లాలో గోదావరి నది సుమారు 50 కిలోమీటర్లపైనే వివిధ మండలాలు, గ్రామాల సరిహద్దు గుండా ప్రవహిస్తోంది. నదీ తీరం వెంట రోడ్డు, ఆధ్యాత్మిక, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. భక్తులు అధికంగా పుణ్యస్నానా లు ఆచరించే గోదావరి తీరప్రాంతాలైన..ఇబ్రహీం పట్నం, మల్లాపూర్, రాయికల్, బీర్‌పూర్, ధర్మపురి, వెల్గటూరు మండలాల్లోని సమీప ప్రాంతాల్లో గోదావరి తీరం వెంట పుష్కర ఘాట్లు ఉన్నాయి. ఇప్పుడవి చాలాచోట్ల పాడైపోయాయి. ఇవేకాకుండా కొన్నిచోట్ల భక్తులు గోదావరి తీరం వెంట తమకు వీలున్న చోట్ల నదీ స్నానాలకు వెళ్తుంటారు. జిల్లాలో గోదావరి తీరం వెంట ఆధ్యాత్మిక కేంద్రాలు, దేవస్థానాలు ఉన్నాయి. ధర్మపురి లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం, వెల్గటూరు మండలం కోటిలింగాల దేవస్థానం, మల్లాపూర్ మండ లం వాల్గొండ రామలింగేశ్వర స్వామి దేవస్థానాలు న్నాయి. ఈ ప్రాంతాలను కలుపుతూ పుష్కర పనుల పై ఓ రూట్‌మ్యాప్, మాస్టర్ ప్లాన రూపొందించారు.
- రూ. 942.80 కోట్లతో ప్రతిపాదనలు..
జిల్లాలోని ధర్మపురి, వెల్గటూరు, రాయికల్, బీర్ పూర్, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాల్లో గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు సుమారు రూ. 942.80 కోట్లతో అధికారులు ప్రతిపాదనలు రూ పొందించారు. ఇందులో 41 పుష్కర ఘాట్లు అభివృద్ధి చేయనున్నారు. ధర్మపు రి మున్సిపాలిటీలో ఐదు ఘాట్లు, ధర్మపు రి మండలంలో ఏడు ఘాట్లు, వెల్గటూరు మండలంలో నాలుగు ఘాట్లు, రాయికల్ లో ఒక ఘాట్, బీర్‌పూర్ మండలంలో ఆరు ఘాట్లు, మల్లాపూర్‌లో 10 ఘాట్లు, ఇబ్రహీంపట్నం మండలంలో ఎనిమిది ఘాట్లు అభివృద్ధి చేయాలని సంకల్పిం చారు. పంచాయతీరాజ్ రహదారులు, ఆర్‌అండ్‌బీ రహదారులు, 4,920 టాయి లెట్లు, 1,794 దస్తులు మార్చుకొను గదుల నిర్మాణం, శానిటేషన, పార్కింగ్, దేవాలయ అభివృద్ధి తదితర పనులు చేపట్టడానికి ప్రాథమికంగా నిర్ణయించారు.
- పార్కింగ్ కోసం 6,420 ఎకరాలు..
జిల్లాలోని ధర్మపురి, వెల్గటూరు, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, రాయికల్, బీర్‌పూర్ మండలాల్లో పార్కిం గ్ కోసం 6,420 ఎకరాల స్థలాలను సేకరించడా నికి ప్రతిపాదించారు. ఇందులో ధర్మపురి, వెల్గటూరు మండలాల్లో 2,540 ఎకరాలు, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, రాయికల్, బీర్‌పూర్ మండలాల్లో 3,880 ఎకరాలను పార్కింగ్ కోసం ప్రైవేటు స్థలాలను సేకరిం చాలని నిర్ణయించారు. ఇందుకుగానూ సంబంధిత స్థలాల్లో క్రాప్‌హాలిడే ప్రకటించి రూ. 13.04 కోట్లను కేటాయించాలని నిర్ణయించారు.