కల్యాణం.. వైభోగం
ABN , Publish Date - Mar 27 , 2026 | 11:54 PM
వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛరణలు భక్తులు జయ జయ ద్వానాల మధ్య సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. ఇల్లందకుంట మండల కేంద్రంలోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో శుక్రవారం సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవాన్ని ప్రధాన అర్చకుడు శేషం వంశీధరాచార్యులు, యాజ్ఞికుడు సీతారామచార్యులు, వేదపండితులు కన్నుల పండువగా జరిపించారు.
ఇల్లందకుంట, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛరణలు భక్తులు జయ జయ ద్వానాల మధ్య సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. ఇల్లందకుంట మండల కేంద్రంలోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో శుక్రవారం సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవాన్ని ప్రధాన అర్చకుడు శేషం వంశీధరాచార్యులు, యాజ్ఞికుడు సీతారామచార్యులు, వేదపండితులు కన్నుల పండువగా జరిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి దంపతులు, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌస్ ఆలం పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు, పూలమాలలు స్వామివారికి సమర్పించారు. అర్చకులు సుమారు 2గంటల పాటు వేద మంత్రాలతో మధ్యాహ్నం 12:10గంటలకు జిలకర బెల్లం పెట్టి సరిగ్గా 12:26గంటలకు సీతమ్మ మెడలో రామ చంద్రమూర్తి మాంగళ్యదారణ కార్యక్రమం గావించారు. కల్యాణాన్ని ప్రముఖులు, భక్తులు తిలకించి పునకింతులయ్యారు. కల్యాణ మహోత్సవ ప్రతి ఘట్టం భక్తులను ఆకట్టుకుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ నాయిని సుప్రీయ వీవీఐపీలకు, ప్రముఖులకు, వృద్ధులు, పిల్లలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి కందుల సుధాకర్, ఆలయ చైర్మన్ ఇంగిలే రామారావు, గ్రామ సర్పంచ్ దార సురేష్, ఉపసర్పంచ్ పెరుమాండ్ల రంజిత్, హుజూరాబాద్ ఆర్డీవో రమేష్‌బాబు, తహసీల్దార్ భాస్కర్, ఎంపీడీవో రాజేశ్వర్‌రావులు అన్ని ఏర్పాట్లు చేశారు. కల్యాణాన్ని తిలకించేందుకు సుమారు 30వేల మంది భక్తులు హాజరయ్యారు. మాజీ జడ్పీ చైర్‌పర్సన్ కనుమల్ల విజయ, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీ వొడితెల ప్రణవ్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్‌కుమార్, హుజూరాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని, జమ్మికుంట మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ పుల్లూరి స్వప్న తదితరులు హాజరయ్యారు.
ఫ భక్తులకు ఉచిత సేవలు
జమ్మికుంట కాటన్, రా రైస్, పారాబాయిల్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణానికి హాజరైన భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం, తాగునీటి వసతి కల్పించారు. అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్, కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌ల సౌజన్యంతో వేర్వేరుగా ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. పీహెచ్‌సీ వైద్యుడు డాక్టర్ మధుకర్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు.
ఫ భారీ బందోబస్తు
హుజూరాబాద్ ఏసీపీ వాసంశెట్టి మాధవి పర్యవేక్షణలో రూరల్ సీఐ లక్ష్మీనారాయణ, ఎస్‌ఐ కాంత్రికుమార్‌తో పాటు నలుగురు సీఐలు, 8మంది ఎస్‌ఐలు, 150మంది పోలీస్ సిబ్బంది భారీ బందోబస్తు నిర్వహించారు.
ఫ స్వల్ప తోపులాట
ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకువస్తున్న సందర్భంలో బారీకేడ్ల వద్ద ఒక్కసారిగా ఎమ్మెల్యేతో పాటు భక్తులందరూ ఒకేసారి రావడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఎస్‌ఐ క్రాంతికుమార్ కింద పడడంతో తోపులాట జరిగింది.
మహాశక్తి ఆలయంలో...
కరీంనగర్ కల్చరల్, మార్చి 27 (ఆంధ్రజ్యోతి) : చైతన్యపురి మహాశక్తి ఆలయంలో శ్రీసీతారాముల కల్యా ణం వైభవంగా నిర్వహించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్, కుటుంబ సభ్యులు కల్యాణంలో పాల్గొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి బండి సంజయ్ స్వయం గా ఆలపించిన గీతాల సీడీ విడుదల చేశారు. వందే మాతరం శ్రీనివాస్ సంగీత స్వరాలు కూర్చగా గీతాల రచయిత ఆకుల నాగేశ్వర్ వేడుకల్లో పాల్గొన్నారు. మంత్రి బండి సంజయ్ మరోసారి పాటలను ఆలపించి అందరినీ ఆకట్టుకున్నారు. కల్యాణ ప్రక్రియ ఆద్యంతం అలరించగా సీతారాముల కల్యాణ ప్రత్యేక అన్నప్రసాద వితరణ జరిగింది.