Share News

గుర్తులు ఖరారు

ABN , Publish Date - Jan 11 , 2026 | 12:48 AM

బల్దియా ఎన్నికల ఏర్పాట్లు వేగం పుంజుకుంటున్నాయి. జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ రెండు మున్సిపాలిటీలో అధికార యంత్రాంగం ఎన్నికల పనుల్లో నిమగ్నమయ్యారు. సోమవారం 12వ తేదీన తుది ఓటర్‌ జాబితా వెల్లడి కానున్నది. 13న పోలింగ్‌ స్టేషన్ల వారీగా ముసాయిదా ప్రచురిస్తారు.

గుర్తులు ఖరారు

- మున్సిపల్‌ స్వతంత్ర అభ్యర్థులకు 75 గుర్తుల కేటాయింపు

- జాతీయ, రాష్ట్ర, రిజిస్టర్‌ పార్టీలవి 13 గుర్తులు

- అభ్యర్థులు నచ్చకుంటే నోటాకు ఓటేసే అవకాశం

- బల్దియా ఎన్నికల్లో పుంజుకున్న వేగం

- రేపు తుది ఓటర్‌ జాబితా

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

బల్దియా ఎన్నికల ఏర్పాట్లు వేగం పుంజుకుంటున్నాయి. జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ రెండు మున్సిపాలిటీలో అధికార యంత్రాంగం ఎన్నికల పనుల్లో నిమగ్నమయ్యారు. సోమవారం 12వ తేదీన తుది ఓటర్‌ జాబితా వెల్లడి కానున్నది. 13న పోలింగ్‌ స్టేషన్ల వారీగా ముసాయిదా ప్రచురిస్తారు. 16న వార్డుల వారీగా పోలింగ్‌ స్టేషన్ల వారిగా ఓటర్ల వివరాలతో జాబితాలను టీ - పోల్‌ వెబ్‌పైట్‌లో అప్లోడ్‌ చేస్తారు. ఈనెల 20 తర్వాత షెడ్యూల్‌ వెల్లడి అయ్యే అవకాశం ఉందని చర్చ మొదలైంది. మరోవైపు ఎన్నికల కమిషన్‌ ఏర్పాట్లలో మరింత వేగాన్ని పెంచుతూ అభ్యర్థులకు కేటాయించాల్సిన గుర్తులను ప్రకటించింది. జాతీయ, రాష్ట్ర, రిజిస్టర్‌ పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులకు ఆయా పార్టీల గుర్తింపు సింబల్స్‌ కేటాయిస్తారు. స్వతంత్రులుగా బరిలో నిలిచేవారికి గుర్తులు కీలకంగా మారుతాయి. ఎన్నికల కమిషన్‌ ఐదు జాతీయ పార్టీలు, నాలుగు రాష్ట్ర పార్టీలు, మరో నాలుగు రిజిస్టర్‌ పార్టీల గుర్తులతో పాటు స్వతంత్ర అభ్యర్థుల కోసం 75 గుర్తులను వెల్లడించింది. నామినేషన్ల ఉపసంహరణల తర్వాత రిటర్నింగ్‌ అధికారి ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు పార్టీలు ఇచ్చిన బీఫామ్‌ ప్రకారం గుర్తింపు పార్టీల గుర్తులు కేటాయిస్తే స్వతంత్రులుగా ఉన్నవారికి అక్షర క్రమంలో కేటాయిస్తారు..

స్వతంత్రులకు గుర్తుల టెన్షన్‌..

సిరిసిల్ల, వేములవాడ రెండు మున్సిపాలిటీలో 67వార్డులు ఉన్నాయి. ఇందులో సిరిసిల్ల మున్సిపాలిటీలో 39 వార్డులు, వేములవాడ మున్సిపాలిటీలో 28 వార్డులు ఉన్నాయి. ప్రతి వార్డులో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఇందుకోసం ఎన్నికల కమిషన్‌ వెల్లడించిన స్వతంత్ర అభ్యర్థుల గుర్తులు అభ్యర్థుల్లో టెన్షన్‌కు గురిచేస్తోంది. ఓటర్లు గుర్తుపట్ట లేని విధంగా కొన్ని గుర్తులు కూడా ఉండడంతో పార్టీ గుర్తుల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. జాతీయ పార్టీల గుర్తులు ఆమ్‌ ఆద్మీ పార్టీ గుర్తు చీపురు, బీఎస్పీ గుర్తు ఏనుగు, బీజేపీ గుర్తు కమలం, ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ నిచ్చెన, సీపీఎం గుర్తు సుత్తి-కొడవలి-నక్షత్రం, కాంగ్రెస్‌ గుర్తు చెయ్యి ఉన్నాయి. రాష్ట్ర పార్టీలో ఏఐఎంఐఎం గుర్తు గాలిపటం, బీఆర్‌ఎస్‌ గుర్తు కారు, టీడీపీ గుర్తు సైకిల్‌, వైఎస్‌ఆర్‌సీపీ గుర్తు ఫ్యాన్‌, రిజిస్టర్‌ అయి ఇతర రాష్ర్టాల్లో ఉన్న పార్టీల గుర్తుల్లో ఫార్వర్డ్‌ బ్లాక్‌ సింహం, సీపీఐ కంకి-కొడవలి, జనసేన పార్టీ గాజు గ్లాస్‌ గుర్తులు ఉన్నాయి. స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించే గుర్తుల్లో ఎయిర్‌ కండిషనర్‌, యాపిల్‌, గాజులు, పండ్లబుట్ట, బ్యాట్‌, బ్యాటరీ టార్చ్‌, బైనాక్యులర్‌, సీసా, బ్రెడ్‌, బకెట్‌, కెమెరా, క్యారంబోర్డ్‌, చెయిన్‌, కుర్చీ, చపాతీ రోలర్‌, కోటు, కొబ్బరి తోట, మంచం, కప్పు, సాసర్‌, కటింగ్‌ ప్లేయర్‌, డ్రిల్లింగ్‌ మెషిన్‌, డంబెల్స్‌, విద్యుత్‌ స్తంభం, ఎన్వలప్‌కవర్‌, పిల్లనగ్రోవి, ఫుట్‌బాల్‌, ఫుట్బాల్‌ ఆటగాడు, గౌను, గరాటా, గ్యాస్‌ సిలిండర్‌, గ్యాస్‌పొయ్యి, గ్రామ్‌ఫోన్‌, ద్రాక్ష పండ్లు, పచ్చిమిరపకాయ, తోపుడు బండి, హెడ్‌ఫోన్‌, హాకీ కర్ర-బంతి, పనసపండు, బెండకాయ, పోస్ట్‌డబ్బా, గొళ్లెం, లూడో, అగ్గిపెట్టె, మైక్‌, ముకుడు, ప్యాంట్‌, పెన్‌డ్రైవ్‌, అనాస పండు, కుండ, ప్రెషర్‌ కుక్కర్‌, రిఫ్రిజిరేటర్‌, ఉంగరం, సేఫ్టీపిన్‌, కుట్టు మిషన్‌, కత్తెర, నౌక, సితార్‌, సాక్స్‌, సోఫా, స్పానర్‌, స్టెతస్కోప్‌, స్టూల్‌, స్విచ్‌బోర్డ్‌, టేబుల్‌, టెలిఫోన్‌, టూత్‌బ్రష్‌, ట్రంపెట్‌, టైర్స్‌, వయోలిన్‌, వాల్‌నట్‌, వాటర్‌మిలన్‌, బావి, ఈల, ఊలు-సూది గుర్తులు ఖరారు చేశారు. ఇందులో చాలా గుర్తులు ఓటర్లను ఆకట్టుకోవడానికి, ప్రచారం చేయడం కష్టంగానే ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

పార్టీ గుర్తులే మేలు..

సిరిసిల్ల, వేములవాడ రెండు మున్సిపాలిటీలో ప్రధాన పార్టీలో టికెట్లు ఆశిస్తున్నవారు పార్టీ గుర్తులు ఉంటేనే గెలుపునకు తోడవుతుందని భావిస్తున్నారు. రెండు మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల్లో టికెట్లు లభించని పక్షంలో రిజిస్టర్‌ పార్టీల నుంచి బీఫాం తెచ్చుకొని బరిలో నిలవాలనే ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే సిరిసిల,్ల వేములవాడ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజెపీ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాయి. సన్నాహా సమావేశాలు నిర్వహించి అభ్యర్థులను ముందుకు నడిపించే దిశగా ఆ పార్టీల నేతలు మార్గనిర్దేశం చేశారు. రిజర్వేషన్లు ఖరారు ఎలా ఉన్నా అందుకు అనుగుణంగా అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. ఏ క్షణమైన నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉండడంతో జిల్లాలోని ముఖ్య నేతలు అప్రమత్తమై ఎన్నికల్లో తమ ప్రాబల్యాన్ని చాటుకునే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎన్నికల సంఘం గుర్తులు కూడా ఖరారు చేయడంతో పార్టీ టికెట్‌ లభించని వారు రెబల్స్‌ బరిలో దిగితే వచ్చే గుర్తులపై చర్చ పెడుతున్నారు. రెండు మున్సిపాలిటీలో ఓటర్ల లెక్క కూడా సోమవారం తేలిపోనున్నది. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో 122836 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 59522 మంది, మహిళలు 63290 మంది, జెండర్లు 24 మంది ఉన్నారు. ఇందులో మహిళలు అధికంగా ఉన్నారు. పురుషుల కంటే 3768 మంది మహిళలు ఎక్కువగా ఉన్నారు. సిరిసిల్ల మున్సిపాలిటీలో 39 వార్డులు ఉండగా 81959మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 39942 మంది, మహిళలు 42011 మంది, జెండర్లు ఆరుగురు ఉన్నారు. వేములవాడ మున్సిపాలిటీలో 28 వార్డులు ఉండగా 40877మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 19580 మంది, మహిళలు 21279 మంది, జెండర్లు 18మంది ఉన్నారు.

Updated Date - Jan 11 , 2026 | 12:48 AM