Share News

‘ప్రశంస’పై ప్రశ్నలెన్నో..

ABN , Publish Date - Aug 17 , 2026 | 01:07 AM

స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేయడం ఆనవాయితీ

 ‘ప్రశంస’పై ప్రశ్నలెన్నో..

- ఉత్తములకా.. ఉత్తవారికా..

- ప్రశంసాపత్రాలకు ఇష్టారాజ్యంగా ఉద్యోగుల ఎంపిక

- చివరి నిమిషంలో జాబితా తయారు

- క్షేత్రస్థాయి సిబ్బందిని గుర్తించని అధికారులు

- నిజమైన అర్హులకు దక్కలేదనే విమర్శలు

(ఆంధ్రజ్యోతి, కరీంనగర్‌)

స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేయడం ఆనవాయితీ. ఈ ప్రశంసాపత్రాలకు ఉద్యోగుల ఎంపిక తీరుపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఈసారి జిల్లావ్యాప్తంగా 290 మందికి ప్రశంసాపత్రాలు అందించారు. వారిలోఎంతమంది ఉత్తమ పనితీరుని కనబర్చారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏ ప్రాతిపదికన వారిని ఎంపిక చేశారనే విషయంలోనూ చర్చలు జరుగుతున్నాయి. గతంలో పలుమార్లు తీసుకున్న వారే తాజా జాబితాలో చోటు దక్కించుకుని దర్జాగా పత్రాన్ని అందుకుని వారికి వారే శభాష్‌ అని భుజం తట్టుకున్నారు. కలెక్టరేట్‌లోని వివిధ విభాగాల్లో పనిచేసే వారికి అవకాశాన్ని కల్పించారు. ఉత్తమ ప్రశంసా పత్రాన్ని అందుకునే వారి జాబితాను చివరి నిమిషయంలో సిద్ధం చేశారు. దీంతో నిజమైన అర్హుల స్థానంలో కొందరు అనర్హుల పేర్లు వచ్చి చేరాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఫ జిల్లా కేంద్రంలో ఉన్నవారికే పెద్దపీట

మొత్తం జాబితాను పరిశీలిస్తే కలెక్టరేట్‌తోపాటు ఆయా శాఖల్లోని జిల్లా కేంద్రంలో ఉన్న వారికే పెద్దపీట వేసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. వాస్తవానికి ఈ ఎంపికలో నిత్యం ప్రజలతో గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందించే పంచాయతీ కార్యదర్శులు, ఏఎన్‌ఎం, ఆశావర్కర్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, ఉపాధ్యాయులు, మండల పరిధిలో కీలకంగా వ్యవహరిస్తున్న ఉద్యోగులు, సిబ్బంది ఊసే కనిపించలేదు. మండలస్థాయి కార్యాలయాల్లో పనిచేసే వారిని గుర్తించనే లేదు. తమ ఆరోగ్యాలను ఫణంగా పెట్టి పనిచేసే పారిశుధ్య కార్మికులకు ఒకరిద్దరికి ఇచ్చి మమ అనిపించారు. కలెక్టరేట్‌లో పనిచేసే ఆయా విభాగాల్లో గతంలో ఇవే ప్రశంసా పత్రాలను అందుకున్న ఉద్యోగుల్లో చాలామందికి మళ్లీ ఈ సారి కూడా అందించడం విస్మయాన్ని కలిగించింది. కలెక్టరేట్‌లో పనిచేసే వారే ఈ జాబితాలో ఎక్కువగా ఉండడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

ఫ ఇలా.. ఇష్టారాజ్యంగా..

- కలెక్టరేట్‌ కార్యాలయ సిబ్బంది రాత్రికి రాత్రి జాబితాలో అనుకున్న వారిని అందలమెక్కించే విధంగా పేర్లు చేర్చారని తెలిసింది. ఒక క్రమ సంఖ్య కింద మరో సంఖ్య ఉండగా.. మధ్యలో బై నంబర్లతో కొందరి పేర్లు చేర్చినట్లు సమాచారం

- పోలీసు, రెవెన్యూ శాఖల్లో గతంలో తీసుకున్న వారు మళ్లీ ఈసారి అందుకున్నారు. కొందరి పేర్లు వినిపించినప్పుడు ఈయనకి కూడా ప్రశంసా పత్రం ఇచ్చారా..? అని సొంత శాఖల్లోని వారే ముక్కున వేలేసుకున్నారు.

- ఆయా శాఖల్లో బాగా పనిచేసిన వారెవరు అని ఎలా నిర్ధారించారనే విషయం ఎవరికీ తెలియదు. ఎంపిక విషయంలోనూ సరైన ప్రామాణికాలు పాటించకపోవడం ఇబ్బందిగా మారింది.

- ఐదారేళ్లుగా పలుసార్లు ప్రశంసాపత్రాలను పొందిన వారికే మళ్లీ మళ్లీ ఇస్తున్నారు. గణతంత్ర వేడుకలతోపాటు జూన్‌ రెండో తేదీన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో తీసుకున్న వారూ మళ్లీ పొందారు.

ఫ కమిటీ ఉంటేనే పారదర్శకంగా...

జిల్లాస్థాయిలో అందుకునే ప్రశంసాపత్రాలకు ఎలాంటి గుర్తింపూ ఉండడం లేదు. ఈ సారి స్వచ్ఛంద సంస్థల వారి ఆనవాళ్లు కనిపించలేదు. ఆర్టీసీలో ఇటీవల కాలంలో మంచి సేవలు కనబర్చిన డ్రైవర్ల ప్రస్తావనే లేదు. సామాజిక సేవా కార్యక్రమాల్లో రాణిస్తున్న వారి పేర్ల జాడే లేదు. గతంలో ఇంత మందికి కాకుండా ఎంపిక చేసిన వంద మంది నిజమైన అర్హులను ఆయా శాఖల్లో బ్యాలెట్‌ బాక్స్‌ విధానంతో గుర్తించేవారు. వచ్చిన అర్జీల విషయంలో అదే శాఖలోని వారితో ఆరా తీసి ఎక్కువ మంది ఆమోదమున్న వారికి తుది జాబితాలో చోటిచ్చేవారు. కాలక్రమంగా ఇలాంటి ఎంపిక మాయమైంది. ఇష్టమొచ్చిన వారికి చోటు దక్కింది. వాస్తవానికి ఎంపిక చేసిన వ్యక్తి ఎందుకు ఎంపికయ్యాడనే విషయాన్ని జాబితాలోనూ పొందుపర్చాలి. జిల్లా స్థాయిలో ఎంపిక కోసం ఉన్నతాధికారులతో కమిటీ వేసి కొన్ని ప్రమాణాల ఆధారంగా నిజమైన ఉత్తములను గుర్తించే పంథా ఇకపై ఉండాలి. కనీసం వచ్చేసారి అయినా ఉత్తోళ్లకు కాకుండా ఉత్తములకు ఛాన్స్‌ ఇస్తే పనిచేసే వారిలో పోటీ తత్వం పెరుగుతుంది. తమకు ఆ ప్రశంసాపత్రం దక్కాలనే ఉద్దేశం అన్ని విభాగాల్లోని ఉద్యోగులు, సిబ్బందిలో మంచి మార్పు ఉత్తమ పనితీరు పరంగా కనిపించే వీలుంది.

Updated Date - Aug 17 , 2026 | 01:07 AM