Share News

మామిడి ఘుమఘుమలు

ABN , Publish Date - May 11 , 2026 | 01:50 AM

వేసవికాలంలో భగభగమనే ఎండలతో పాటు నోరూరించే మామిడి రుచులు కూడా వారెవ్వా అనిపిస్తాయి. ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ నిల్వ మామిడి పచ్చళ్ల తయారీ బిజీబిజీగా మారిపోతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు మండలాలు, గ్రామాల్లో మామిడికాయ పచ్చడి ఘుమఘుమల వాసనలే వస్తున్నాయి.

మామిడి ఘుమఘుమలు

- మార్కెట్‌లో మామిడి కాయల అమ్మకాల జోరు

- జిల్లాలో ఇంటిల్లిపాది బిజీబిజీ

- నిల్వ పచ్చళ్లపైనా యుద్ధ ప్రభావం

- ఘాటెక్కిన కారం.. నూనెల ధర సలసల

- కాయలు, సరుకుల ధరల భారం

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

వేసవికాలంలో భగభగమనే ఎండలతో పాటు నోరూరించే మామిడి రుచులు కూడా వారెవ్వా అనిపిస్తాయి. ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ నిల్వ మామిడి పచ్చళ్ల తయారీ బిజీబిజీగా మారిపోతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు మండలాలు, గ్రామాల్లో మామిడికాయ పచ్చడి ఘుమఘుమల వాసనలే వస్తున్నాయి. ఈసారి పశ్చిమాసియా దేశాల్లో ఏర్పడ్డ యుద్ధం తెలుగింటి నిల్వ పచ్చళ్లపై కూడా పడింది. పచ్చళ్లకు అవసరమ్యే సరుకుల ధరలు పెరిగి సామాన్యులకు ఇబ్బందిగా మారింది. పచ్చళ్లకు ఉపయోగించే కారం ఘాటుకు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. నూనెల ధరలు సలసల కాగుతున్నాయి. ధరల ప్రభావం ఉన్న నిల్వ పచ్చడి ప్రతి సంవత్సరం 5 కిలోల వరకు చేసుకునే వారు కొంతమేరకు తగ్గించుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మార్కెట్‌లో చిన్నసైజు పచ్చడి మామిడికాయనే రూ.10 వరకు ధర పలుకుతోంది. పొరుసు పచ్చడికి ఉపయోగించే కాయల ధర రూ.15 నుంచి రూ 20 వరకు ఉన్నాయి. మంచి బ్రాండెడ్‌ పల్లి నూనె లీటర్‌ ప్యాకెట్‌ రూ.180, నువ్వుల నూనె కిలో రూ.520, పచ్చళ్లకు వాడే కారం రూ.800 వరకు ధర పలుకుతోంది. మెంతిపొడి కిలో రూ 100, ఆవాలు కిలో రూ 110, జీలకర్ర కిలో రూ 320 ధరలు పలుకుతున్నాయి. కానీ జిల్లాలో ప్రతి ఇంటిలోనూ పచ్చళ్ల ఆచార వ్యవహారాల పరంపర మాత్రం కొనసాగుతూనే ఉంది. జిల్లా కేంద్రంలోని మార్కెట్‌తో పాటు మండలాల్లోని మామిడి కాయల అమ్మకాలు సందడిగా మాకింది. మామిడి కాయలను ముక్కలు చేయించుకోవడం అందుకు కావాల్సిన సరుకుల కొనుగోళ్లతో మార్కెట్‌ కళకళాడుతున్న నిల్వ పచ్చడికి కావాల్సిన సరుకుల ధరలు చూసి అవేదన వ్యక్తం చేస్తున్నారు.

మామిడి పచ్చడితో ఆరోగ్యం...

పచ్చళ్లకు ప్రాంతాల వారీగా రకరకాల పేర్లు ఉన్నా మామిడికాయ పచ్చడి అంటే అందరికి నోరూరుతుంది. అవకాయ పచ్చడి రుచిచూస్తే ఎవరికైనా నాలుక జివ్వుమంటుంది. భోజనం చేసే సమయంలో అంచుకు మామిడి తోక్కు ఉంటే ఆ రుచే వేరుగా ఉంటుంది. మామికాయ పచ్చడిపై కొన్ని అపోహాలు ఉన్నా ఆరోగ్యానికి ఎంతో మంచిది రోజు తగిన మోతాదులో పచ్చడి తింటే జీర్ణశక్తి పెంచడమే కాకుండా మనిషి చలాకీగా ఉంటాడని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఆవాలు లేకుండా మామిడి పచ్చడి ఉండదు. ఆవాలు జీర్ణశక్తిని పెంచుతాయి. వర్షాకాలం, చలికాలం వేడిని కలిగిస్తుంది. జలుబు రాకుండా చేస్తుంది. శరీరంలోని నీరసాన్ని పోగొట్టి ఆకలిని పుట్టిస్తుంది. మెంతులు ఆవకాయలో కలపడం వల్ల శరీరానికి చలువ చేయడంతో పాటు మెంతులు మధుమేహ వ్యాధిని కూడా నివారిస్తుంది. మామిడికాయలో 37 కేలరీల శక్తి, విటమిన్‌లలో ఏ, సీతో పాటు సోడియం అధికంగా ఉంటుంది. కోలెస్ట్రాల్‌ ఉండదు కాబట్టి ఆరోగ్యానికి ఎలాంటి హానీ కలుగదు. ఒక కప్పు మామిడి పచ్చడిలో కొవ్వు 9 గ్రాములు, కార్బొహైడ్రేడ్‌ 3 గ్రాములు, క్యాలుషం, ఐరన్‌ వంటి పోషకాలు ఉంటాయి.

విదేశాలకు పచ్చళ్లు..

జిల్లా నుంచి విదేశాల్లో ఉన్న తమ కుటుంబ సభ్యులకు కూడా మామిడి పచ్చడిని తయారుచేసి పంపిస్తుంటారు. భోజన ప్రియులకు పచ్చడి లేకుంటే వెలితిగా అనిపిస్తుండగా, ఇక విదేశాల్లో ఉన్న వారు ఎంతో ఇష్టాన్ని కనబరుస్తున్నారు. విదేశాలకు పంపించడానికి ప్రత్యేకంగా పచ్చడి తయారుచేసి ఇచ్చేవారికి కూడా ఈ సీజన్‌లో ఉపాధి లభిస్తుంది.

మామిడి పచ్చడి తయారీ ఇలా...

పచ్చళ్లలో అగ్రస్థానంలో ఉండేది మామిడి. వేసవికాలంలో ఎవరి ఇంట్లోనైనా మామిడి పచ్చడి ఘుమఘుమలు.. ముక్కలు కొట్టిన కాయలు ఊరబెడుతూ.. ఊరిన తర్వాత వాటిలో ఎల్లిపాయలు, ఆవాలు వేసి పోప్‌ పెడుతుంటే వచ్చే వాసనే నోరూరిస్తుంది. మార్కెట్‌లో మంచి రకంగా ఉండే మామిడికాయలను తీసుకొని వాటిని ముక్కలుగా చేసుకుంటారు. సరైన మోతాదులో ఉప్పు, కారం, ఆవాల పొడి, జీలకర్ర, మెంతుల పొడిలు కలిపి ముక్కలకు పట్టించి ఊరబెడుతారు. తర్వాత వాటికి పోపు పెడతారు.

Updated Date - May 11 , 2026 | 01:50 AM