Share News

మొక్క జొన్న రైతుకు మంచి రోజులు!

ABN , Publish Date - Oct 02 , 2026 | 06:01 AM

రాష్ట్రంలో మొక్కజొన్న రైతులకు మంచి రోజుల వచ్చాయి. ప్రస్తుత సీజన్‌లో మద్దతు ధరను మించి మక్కల రేటు పలుకుతుండడంతో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.

మొక్క జొన్న రైతుకు  మంచి రోజులు!
shekharreddy

  • క్వింటాల్‌కు రూ.2,450-2,600 దాకా ధర

  • రాష్ట్రంలో 5.93 లక్షల ఎకరాల్లో మక్కల సాగు

  • ఫౌల్ట్రీ, పారిశ్రామిక అవసరాలతో డిమాండ్‌

జగిత్యాల, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మొక్కజొన్న రైతులకు మంచి రోజుల వచ్చాయి. ప్రస్తుత సీజన్‌లో మద్దతు ధరను మించి మక్కల రేటు పలుకుతుండడంతో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. క్వింటాల్‌ మొక్కజొన్నకు మద్దతు ధర రూ.2,410 ఉండగా.. వ్యాపారులు అంతకన్నా ఎక్కువ ధర చెల్లిస్తున్నారు. జగిత్యాల జిల్లాలో పలువురు వ్యాపారులు కల్లాల వద్దకే వచ్చి మొక్కజొన్నకు క్వింటాల్‌కు రూ.2,450 నుంచి రూ.2,600 ధర చెల్లించి కొంటున్నారు. వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం గత ఏడాది వానాకాలం సీజన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 6.44 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు అయింది. ఎల్‌నినో ప్రభావంతో ఈ సారి 5.93 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. జగిత్యాల జిల్లాలో 38,910 ఎకరాల్లో సాగు చేయగా, ఎకరాకు సగటున 30 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనాలున్నాయి. పౌల్ట్రీ పరిశ్రమ, పశుదాణా, పారిశ్రామిక అవసరాలకు మక్కను అధికంగా వినియోగిస్తుండడంతో డిమాండ్‌ పెరిగింది. మరోవైపు, వచ్చే యాసంగి సీజన్‌లో క్రాప్‌ హాలిడే ఉంటుందన్న చర్చ కూడా ధర పెరగడానికి కారణమైందని రైతులు భావిస్తున్నారు. దీనికి అనుగుణంగానే ప్రైవేటు వ్యాపారులు పోటాపోటీగా అధిక ధరకు కల్లాల్లోనే మక్కలు కొంటున్నారు. ఒక వైపు దిగుబడులు బాగుండడం, మంచి ధర లభిస్తుండడంతో రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

300 క్వింటాళ్లు విక్రయించా

వానాకాలం సీజన్‌లో పది ఎకరాల్లో మొక్కజొన్న సాగు ప్రారంభించా. ఎకరాకు 30 క్వింటాళ్ల చొప్పున దిగుబడి వచ్చింది. ప్రస్తుతం పంట కోత పూర్తవడంతో మెట్‌పల్లి వ్యాపారికి కల్లంలోనే అమ్మేశా. సుమారు 300 క్వింటాళ్ల మొక్కజొన్నను రూ.2,450 చొప్పున విక్రయించా.

- శేఖర్‌రెడ్డి, మొక్కజొన్న రైతు,

కోమటి కొండాపూర్‌, జగిత్యాల

Updated Date - Oct 02 , 2026 | 06:04 AM