ఆయిల్‌పామ్ సాగుతో దీర్ఘకాలిక ఆదాయం
ABN , Publish Date - Jul 02 , 2026 | 12:43 AM
ఆయిల్ పామ్ సాగుతో దీర్ఘకాలిక ఆదాయం సమకూరుతోందని, అన్నదాతలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకుని పంట సాగుకు ముందుకురావాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు.
ఎల్లారెడ్డిపేట, జూలై 1 (ఆంధ్రజ్యోతి): ఆయిల్ పామ్ సాగుతో దీర్ఘకాలిక ఆదాయం సమకూరుతోందని, అన్నదాతలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకుని పంట సాగుకు ముందుకురావాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో వివిధ శాఖల సమన్వయంతో వేయి ఎకరాలకు పైగా ఆయిల్‌పామ్ సాగుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలోని రైతులు పాతూరి రాజేందర్‌రెడ్డి, పాతూరి భూపాల్‌రెడ్డిలు 18 ఎకరాల్లో చేపట్టిన ఆయిల్ పామ్ సాగులో భాగంగా స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి బుధవారం ఆమె మొక్కలను నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ రైతులు సంప్రదాయ పంటలను సాగు చేయకుండా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే పంటలను వేయాలని అన్నారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పంటల వైవిధ్యం, ఆయిల్‌పామ్ సాగుపై అవగాహన సదస్సులను నిర్వహించి రైతులను ప్రోత్సహించేలా చర్యలు చేపట్టామన్నారు. ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు సూచించిన పంటలను రైతులు సాగుచేయాలన్నారు. ఎల్లారెడ్డిపేట, ఇల్లంతకుంట, తంగళ్లపల్లి, బోయినపల్లి మండలాల్లో 34 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్‌పామ్ సాగుకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. ఆయిల్ పామ్ పంట విక్రయాల్లో ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం జిల్లాకు సరిహద్దు సమీపాన ఉన్న సిద్ధిపేట జిల్లాలోని నర్మెట్టలో ఆయిల్ పామ్ పరిశ్రమను నెలకొల్పిందన్నారు. ఆయిల్ పామ్ సాగుపై అన్నదాతలు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లాలో పంటల సాగుకు అవసరమైన మేర ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎలాంటి కొరత లేదని, రైతులు ఆందోళన కు గురి కావద్దని అన్నారు. యూ రియా అవసరమైన రైతులు యాప్‌లో తమ వివరాలను నమోదు చేసుకుని కొనుగోలు చేయాలని అన్నారు. నమోదుపై అవగాహన లేని రైతుల కోసం రైతు వేదికలు, సహకార సంఘా లు, ప్రైవేటు డీలర్ల వద్ద సహాయకులు ఉంటారని అన్నారు. ఏమైనా సాంకేతిక సమస్యలు ఉత్పన్నమైతే తమ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రమేశ్, ఏఎంసీ చైర్‌పర్సన్ సబేరాబేగం, మండల ప్రత్యేక అధికారి అఫ్జల్‌బేగం, డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, ఉద్యానవన శాఖ అధికారి శరత్, తహసీల్దార్ సుజాత, ఎంపీడీవో సత్తయ్య, ఏవో రాజశేఖర్, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.