Share News

పెంపకందారులు జీవాలకు బీమా చేయించుకోవాలి

ABN , Publish Date - Sep 27 , 2026 | 12:31 AM

గొర్రెలు, మేకలకు పెంపకందారులు తప్పనిసరిగా బీమా చేయించుకోవాలని పశు సంవర్ధక, డెయిరీ అభివృద్ధి, మత్స్య, క్రీడలు, యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.

పెంపకందారులు జీవాలకు బీమా చేయించుకోవాలి

కరీంనగర్‌ అర్బన్‌, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): గొర్రెలు, మేకలకు పెంపకందారులు తప్పనిసరిగా బీమా చేయించుకోవాలని పశు సంవర్ధక, డెయిరీ అభివృద్ధి, మత్స్య, క్రీడలు, యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. కరీంనగర్‌ ఇందిరాగార్డెన్స్‌లో జిల్లా గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం మొదటి మహాసభను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొర్రెలు, మేకల బీమాకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించి పథకం ప్రారంభానికి శ్రీకారం చుట్టారు. ఈ సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ... గొర్రెలు, మేకల కాపరులు 13 రూపాయలు మాత్రమే చెల్లించి మేక లేదా గొర్రెకు బీమా చేసుకోవాలని, మిగతా సొమ్ము ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. గొర్రెలతో పాటు పెంపకం దారులకు బీమా కల్పించేలా చూస్తామని తెలిపారు. గొర్రెల పెంపకం దారులపై ఉన్న రుణాల మాఫీకి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. గొల్లకురుమలు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని, తర్వాత తరం మరింత అభివృద్ధి చెందేలా ప్రోత్సహించాలని సూచించారు. కరీంనగర్‌లో గొర్రెల పెంపకం దారుల సహకార సంఘానికి కేటాయించిన ఐదెకరాల స్థలాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

ఫ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ... బడుగు బలహీన వర్గాలకు, కులవృత్తిదారుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. జిల్లాలో గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం ఎన్నికలు ఏకగ్రీవం చేసుకోవడం అభినందనీయమన్నారు. కులవృత్తిదారులందరికీ 55 సంవత్సరాలకే పెన్షన్‌ ఇవ్వాల్సిందిగా ప్రతిపాదిస్తామని తెలిపారు. కుల వృత్తులను కాపాడుకుంటూనే తమ బిడ్డల చదువుకు ప్రాధాన్యం ఇవ్వాలని గొల్ల కురుమలకు సూచించారు. తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి కోపరేటివ్‌ ఫెడరేషన్‌ చైర్‌పర్సన్‌ సరిత తిరుపతయ్య మాట్లాడుతూ.. కరీంనగర్‌ జిల్లాలో బీమా పథకం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ... గొల్ల కురుమలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. సమావేశంలో యాదవ, కురుమ కార్పొరేషన్‌ చైర్మన్‌ రఘునాథ్‌ యాదవ్‌, పశుగణన అభివృద్ధి చైర్మన్‌ చరణ్‌కౌశిక్‌యాదవ్‌, పశుసంవర్థక శాఖ ఎండీ సుబ్బారాయుడు, జేడీ లింగారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ సత్తు మల్లేశం, మున్నూరుకాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ బొమ్మ శ్రీరామ్‌ చక్రవర్తి, కరీంనగర్‌ జిల్లా గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు బాషవేని మల్లేష్‌ యాదవ్‌, ఉపాధ్యక్షుడు చిగుర్ల శ్రీనివాస్‌ కురుమ, సుడా మాజీ చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ కార్పొరేషన్‌ అధ్యక్షుడు, కార్పొరేటర్‌ వైద్యుల అంజన్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 27 , 2026 | 12:31 AM