మెరుపు దగా..
ABN , Publish Date - May 15 , 2026 | 01:05 AM
వేసవిలో అందరికి అందుబాటులో ఉండేవి మామిడి పండ్లు.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
వేసవిలో అందరికి అందుబాటులో ఉండేవి మామిడి పండ్లు. నోరూరించే మామిడి పండ్ల మెరుపు చూడగానే కొనాలనిపిస్తుంది. కానీ ఆరోగ్యానిచ్చే పండ్లు విషతుల్యం అవుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిషేధం ఉన్నా కార్బైడ్‌తో మామిడిపండ్లను మగ్గిస్తున్నారు. ఈసారి కాస్త ముందుగానే మామిడిపండ్లు మార్కెట్‌లోకి వచ్చాయి. ధరలు మాత్రం భగ్గుమంటున్నాయి. కిలో రూ.80 నుంచి రూ.100వరకు అమ్ముతున్నారు. కార్బైడ్ మగ్గిస్తున్న పండ్లను తింటే అనారోగ్యం పాలవుతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పండ్లలోనే రారాజుగా పిలిచే మామిడి పండ్ల మెరుపు చూసి ఎక్కువ ధరకైనా కొనుగోలు చేస్తున్నారు. మామిడి తోటలు లీజుకు తీసుకున్న వ్యాపారులు వడగండ్ల వర్షాలను దృష్టిలో పెట్టుకొని అప్పుడే కోతలు మొదలు పెట్టారు. కార్బైడ్ రసాయనాలతో మాగబెడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రధానంగా సిరిసిల్ల, వేములవాడ మార్కెట్‌లో మెరుస్తూ కనిపిస్తున్న పండ్లను చూసి సంబురపడుతున్నా రసాయనాలతో మగ్గించడంతో కొత్త రోగాలు తెచ్చుకుంటామనే భయం కూడా వెంటాడుతోంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో మండీలను ఏర్పాటు చేసి కృత్రిమంగా కాల్షియం కార్బొనేట్‌తో మాగబెడుతూ జిల్లాలోని పలు మండలాలకు సరఫరాకు సిద్ధం చేశారు.
తియ్యని పండు విషతుల్యం..
తియ్యని పండ్ల వెనక విషతుల్యం దాగి ఉంది. వివిధ ప్రాంతాల నుంచి మామిడి కాయలను దిగుమతి చేసుకొని రసాయనాలతో మాగబెడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆహార భద్రత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో మామిడి పండ్లే కాకుండా ఇతర పండ్లు కూడా కృత్రిమ పద్ధతుల్లోనే మాగబెట్టి అమ్మకాలు సాగిస్తున్నారు. సిరిసిల్లలోని చుట్టుపక్కల మామిడి తోటల నుంచి వ్యాపారులు గుత్తగా కాయలను తీసుకవచ్చి నిషేధిత కార్బైడ్ రసాయనాలను వాడుతూ పండ్లను మాగబెట్టడం వల్ల ఇతర పండ్ల కంటే మిలమిల మెరుస్తూ ఉండడంతో ఎక్కువ ధరకు అమ్మకాలు సాగిస్తున్నారు. కార్బైడ్ ఇతర రసాయనాలతో మాగబెట్టిన పండ్లు తినడం వల్ల అనేక రోగాలకు గురయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అల్సర్, కాలేయం, క్యాన్సర్, గొంతునొప్పి, రక్తహీనత, కిడ్నీ, నరాల వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటిని తినడం వల్ల అనేక రోగాలు వస్తుండడం దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు గతంలోనే వీటిని నిషేధించింది. కార్బైడ్‌తో మాగబెట్టిన పండ్లను తినడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది.
ఇథేలీన్ గ్యాస్‌పై అవగాహన లేక..
కాల్షియం కార్బెడ్ రసాయనం వినియోగించడాన్ని 2012 మార్చిలోనే అప్పటి ప్రభుత్వం హైకోర్టు ఆదేశాల మేరకు నిషేధించింది. అయినా వాడడం మాత్రం ఆగడం లేదు. ప్రభుత్వ ఆదేశాలు ఖచ్ఛితంగా ఉన్నా ఆహార కల్తీ నిరోధక శాఖలు మాత్రం పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. నిషేధిత కార్బైడ్ సరఫరా జరుగుతున్నా రైతుల్లో కూడా అవగాహన కల్పించడంలేదు. కాల్షియం కార్బైడ్‌కు బదులు ఇథెలీన్ గ్యాస్ ద్వారా పండ్లను మాగబెడితే ఆరోగ్యకరంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. మాగబెట్టే గదులను ఉపయోగించాలని తెలిపింది. ఇందు కోసం కేంద్ర ప్రభుత్వం రైపనింగ్ చాంబర్‌ల ఏర్పాటు కోసం రాయితీ కూడా కల్పిస్తున్నారు. కానీ ఇథెలీన్ వాడకం రైపనింగ్ చాంబర్‌ల ఏర్పాటుపై అధికారులు అవగాహన కల్పించడం లేదు. రైపనింగ్ చాంబర్ ద్వారా ఇథెలీన్ గ్యాస్‌ను వదిలి పండ్లను మూడు రోజుల పాటు మాగబెడుతారు. దీనివల్ల పండ్లు సహజసిద్ధంగా మాగినట్లుగా ఉండడంతో పాటు మంచి రంగుతో పాటు రుచి కూడా ఉంటుంది. కానీ ఇథెలీన్ గ్యాస్ ఉపయోగించడం వల్ల ఖర్చు పెరుగుతుందని రైతులు ఉపయోగించడం లేదని తెలుస్తోంది.
మాగబెట్టిన పండ్లను ఇలా గుర్తించండి..
కాయలను కార్బైడ్ ద్వారా మాగబెట్టి, రంగుమార్చి యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. వీటిని గుర్తించడానికి నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. కార్బైడ్‌తో మాగబెట్టిన మామిడి పండ్లపై ఆకుపచ్చని మచ్చలుంటాయి. పసుపు వర్ణం ఎక్కువగా ఉంటుంది. ఈ పండు తినే సమయంలో నోట్లో కొంచెం మంట కూడా ఉంటుంది. కడుపులో నొప్పి, గొంతు నొప్పి, డయేరియా ఉంటే కార్బైడ్ వాడినట్లుగా గుర్తించవచ్చు. సహజసిద్ధంగా మాగితే ఆకుపచ్చ, పసుపు రంగులు కలిసినట్టుగా ఉంటుంది. పండును కొసినపుడు గుజ్జు ఎరుపు, పసుపు కలిసినట్టుగా ఉంటుంది. పండ్లలో రసం ఎక్కువగా ఉంటుంది. తొడిమ లోపటికి కృంగినట్లుగా ఉంటుంది.
రసాయనాలు ఎందుకు వాడుతున్నారు..
మామిడి పండ్లతో పాటు ఇతర పండ్లపై రసాయనాలను స్ర్పే చేయడం వల్ల వేగంగా పండుతాయి. ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ప్రధానంగా మామిడి, యాపిల్, అరటి, సపోట, దానిమ్మ, జామ, బొప్పాయి, ఆరెంజ్‌లపై వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కాల్షియం కార్బైడ్ ఇది పౌడర్ రూపంలో ఉంటుంది. పౌడర్ ప్యాకెట్లను పండ్ల మధ్యలో పెట్టి దానిపై టార్పాలిన్ కప్పి నీళ్లు చల్లుతారు. ఈ పౌడర్ నుంచి ఎసీటెలిన్ గ్యాస్ ద్వారా పండ్లు సరిగా పండకపోయిన అందంగా కనిపిస్తాయి. అరటి పండ్లపై ఎథోపాన్ రసాయనాన్ని చల్లుతారు. చెట్టు నుంచి గెలను తీసి స్ర్పే చేయడం లేదా నీటిలో ముంచడం వల్ల అరటికాయ పక్వానికి వస్తుంది. యాపిల్ పండ్లపై పారాపిన్ అనే మైనాన్ని వినియోగిస్తారు. దీనిని మండించి వచ్చే ఆవిరిని యాపిల్ పండ్లకు పడుతారు. దీనివల్ల పండ్లలోని నీటి శాతం అలాగే ఉండిపోతుంది.
వీటివల్ల జరిగే నష్టాలు..
రసాయనాలు ఉపయోగించి పండ్లను పక్వానికి తేవడం వల్ల మనిషి అవయవాలపై ప్రభావం చూపుతుంది. కడుపులో అల్సర్లు, నాడీ సంబంధిత వ్యాదులు, చర్మ వ్యాదులు, చూపు మందగించడం, క్యాన్సర్ వంటివి వస్తాయి. గర్భిణులు తినడం వల్ల గర్భాశయ వ్యాధులు, పిల్లలో జన్యుపరమైన లోపాలు వస్తాయి. చిన్నపిల్లలో నాడీ వ్యవస్థ, మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
జాగ్రత్తలు తీసుకోవాలి..
కృత్రిమంగా పండించిన పండ్లు ఎంతో ఆకర్షణీయంగా ఉండి అన్ని ఒకే రంగులో కనిపిస్తాయి. పండును కోస్తే లోపల సరిగా పండకపోవడం, రుచిగా లేకపోవడం, పండిన వాసన రాకపోవడం ద్వారా గుర్తించవచ్చు. ముఖ్యంగా వీలైనంతవరకు ప్రతి పండు తొక్కతీసి తినడం మంచిది. యాపిల్‌కు మైనం పూత ఉన్నట్లు అనుమానం కలిగితే మూడు నిమిషాలు వెనిగర్ సొల్యూషన్‌లో ఉంచాలి. నీటితో శుభ్రం చేయాలి. ద్రాక్ష, బొప్పాయి పండ్లను ఉప్పు నీటితో కడిగి తినాలి. మామిడి పండును వేగంగా ప్రవహించే నీటిలో మూడు నిమిషాలు ఉంచి తినాలి.