పంటలకు జీవం..
ABN , Publish Date - Jul 23 , 2026 | 12:51 AM
అన్నదాతల రెక్కల కష్టానికి ఆశలు కల్పిస్తూ కరుణించిన వరుణుడు పంటలకు జీవం పోశాడు.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
అన్నదాతల రెక్కల కష్టానికి ఆశలు కల్పిస్తూ కరుణించిన వరుణుడు పంటలకు జీవం పోశాడు. ఎల్‌నినో ప్రభావంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్న రైతులు జూన్ మాసంలో తొలకరి జల్లులకే పత్తి, మొక్కజొన్న పెసర, కూరగాయల విత్తనాలు వేసుకున్నారు. మరోవైపు వరి సాగుకు నారుమళ్లు సిద్ధం చేసుకున్న వర్షాలు లేక నాట్లు పడని పరిస్థితుల్లో ఆవేదన చెందుతున్న రైతులకు ఉపశమనం కలిగిస్తూ మూడు రోజులుగా కురుస్తున్న వర్షపు జల్లులకు పొలం బాట పట్టారు. జిల్లాలో ప్రధానంగా రైతులు వరి, పత్తి సాగు వైపే మొగ్గు చూపుతారు. జిల్లాలో2.48 ఎకరాల్లో వివిధ పంటలు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనా అంచనా వేసింది. జిల్లాలో ఇప్పటివరకు 95 వేల ఎకరాల్లో మాత్రమే వివిధ పంటలు సాగు చేశారు. ఇందులో ప్రధానంగా వ్యవసాయ శాఖ అంచనా వేసినట్లే 90 శాతం పత్తి సాగు పూర్తి చేశారు. జూన్ మాసంలోనే విత్తనాలు వేసుకున్న పత్తి రైతులు వర్షాలు మొఖం చాటేయడంతో ఆందోళనలో పడ్డారు. మరోవైపు వరి సాగు కోసం సిద్ధం చేసుకున్న నారుమళ్లు ముదిరిపోతున్న క్రమంలో అన్నదాతలు వర్షం కోసం ఆకాశం వైపు ఆశగా చూశారు. సోమవారం నుంచి కురుస్తున్న వర్షం బుధవారం కూడా కొనసాగడంతో రైతులు సాగు పనుల్లో బిజీబిజీగా మారిపోయారు. జిల్లాలో ఇప్పటికీ లోటు వర్షపాతం కొనసాగుతున్నా మూడు రోజులు కురిసిన వర్షానికి వాడిపోతున్న పత్తి, పెసర, మొక్కజొన్న, కూరగాయల పంటలకు ప్రాణం పోసింది. జిల్లాలో ఇప్పటికీ లోటు వర్షపాతం కొనసాగుతోంది. జూన్, జూలై మాసంలో సాధారణ వర్షపాతం 283.5 మిల్లీమీటర్ల వర్షానికి 190.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. బుధవారం ఉదయం జిల్లాలోని తంగళ్లపల్లిలో 12.3 మిల్లీమీటర్లు, ఎల్లారెడ్డిపేటలో 12.0 మిల్లీమీటర్లు, వీర్నపల్లి, వేములవాడలో 11.0 మిల్లీమీటర్లు, ముస్తాబాద్‌లో 10.8 మిల్లీమీటర్లు, సిరిసిల్లలో 10.1మిల్లీమీటర్లు, కోనరావుపేట, బోయిన్‌పల్లిలో 9.1 మిల్లీమీటర్లు, చందుర్తిలో 8.4మిల్లీమీటర్లు, రుద్రంగిలో 8.1మిల్లీమీటర్లు, ఇల్లంతకుంటలో 7.3 మిల్లీమీటర్లు, వేములవాడ రూరల్‌లో 6.9 మిల్లీమీటర్లు, గంభీరావుపేటలో 4.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
వరి నాట్లలో రైతులు నిమగ్నం
జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో నేపథ్యంలో రైతులు వరి సాగును ఆచితూచి సాగు చేస్తున్న క్రమంలో కురుస్తున్న కొద్దిపాటి వర్షాలకు వరి నాట్లలో రైతులు నిమగ్నమయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఖరీఫ్‌లో 1.91 లక్షల ఎకరాల్లో వరి సాగుకు సిద్ధమైన రైతులు అందుకు కావాల్సిన నారుమళ్లు సిద్ధం చేసుకున్నారు. వర్షాలు లేకపోవడంతో నారుమడులు నోరెళ్ళ పెడుతుంటే రైతులు నారును కాపాడుకోవడానికి ట్యాంకర్ల ద్వారా నీటిని పోసుకున్నారు. వరినాట్లు కూడా బోరు బావుల సౌకర్యం ఉన్న చోట 45వేల ఎకరాల వరకు నాట్లు వేసుకున్నారు. మరోవైపు ఆరుతడి పంటల వైపు వెళ్లాలని ప్రభుత్వం సూచిస్తున్న నేపథ్యంలో ఆందోళన చెందుతున్న రైతులు మూడు రోజులుగా కురుస్తున్న మోస్తరు వర్షానికి జోరుగా వరి నాట్లు మొదలుపెట్టారు. బుధవారం జిల్లాలో రైతులు పొలం పనుల్లో కనిపించారు. జిల్లాలో వరి సాగులో బోయిన్‌పల్లిలో 1500 ఎకరాలు, వేములవాడలో 1530 ఎకరాలు, వేములవాడ రూరల్‌లో 3వేల ఎకరాలు, చందుర్తిలో 2640 ఎకరాలు, కోనరావుపేటలో 2195 ఎకరాలు, రుద్రంగిలో 450 ఎకరాలు, ఎల్లారెడ్డిపేటలో 6800 ఎకరాలు, గంభీరావుపేట లో 4680 ఎకరాలు, వీర్నపల్లిలో 2600 ఎకరాలు, ముస్తాబాద్‌లో 6 వేల ఎకరాలు, సిరిసిల్లలో 1500 ఎకరాలు, ఇల్లంతకుంటలో 3400 ఎకరాలు తంగళ్ళపల్లిలో 6300ఎకరాల్లో వరి నాట్లు వేసుకున్నారు.
పత్తి సాగుపై ఆశలు
జిల్లాలో నల్లరేగళ్లలో తెల్ల బంగారం పండించడానికి పూనుకున్న రైతులకు వర్షాలు లేక మొలకెత్తిన పత్తి ఆవేదనను నింపింది. విత్తనాలు భూమిలోనే మాడిపోకుండా, మొలకెత్తిన మొక్కలను కాపాడుకోవడానికి రైతులు వాటర్ ట్యాంకర్లు, స్ర్పింక్లర్లు ఏర్పాటు చేసుకొని మొక్కలకు నీటిని అందించారు. జిల్లాలో 47120 ఎకరాల్లో పత్తి సాగు లక్ష్యంగా ఉండగా, రైతులు ఇప్పటికే 46 వేల ఎకరాల్లో విత్తనాలు వేసుకున్నారు. జిల్లాలో ఇప్పటివరకు బోయిన్‌పల్లిలో 6680 ఎకరాలు, వేములవాడలో 4602 ఎకరాలు, వేములవాడ రూరల్‌లో 4250 ఎకరాలు, చందుర్తిలో 5862 ఎకరాలు, కోనరావుపేటలో 4241 ఎకరాలు, రుద్రంగిలో 2370 ఎకరాలు, ఎల్లారెడ్డిపేటలో 3186 ఎకరాలు, గంభీరావుపేటలో 120 ఎకరాలు, వీర్నపల్లిలో 400 ఎకరాలు, ముస్తాబాద్‌లో 500 ఎకరాలు, సిరిసిల్లలో 650 ఎకరాలు, ఇల్లంతకుంటలో 12570 ఎకరాలు తంగళ్ళపల్లిలో 490ఎకరాలో పత్తి సాగు చేసుకున్నారు. దీంతోపాటు పెసర 2693 ఎకరాలు, కందులు 515 ఎకరాలు, కూరగాయలు 841 ఎకరాలు సాగు చేసుకున్నారు. నీటి కోసం ఎదురు చూస్తున్న రైతులకు వర్షం లాభం చేకూరుస్తుందని రైతులు సంబర పడుతున్నారు.
జిల్లాలో ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన
ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రైతులకు స్వల్పకాలిక పంటలు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, నువ్వులు, ఆయిల్‌పామ్ వంటి ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించే దిశగా అధికారులు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మండల, గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నారు. వ్యవసాయ శాఖతో పాటు ఇతర ఎనిమిది శాఖల అధికారులు సమావేశంలో పాల్గొంటూ రైతుల అవగాహన కల్పిస్తున్నారు. స్వయంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సదస్సుల్లో పాల్గొంటూ అవగాహన కల్పిస్తున్నారు.
ఖరీఫ్ సాగుకు నీళ్లు ఇచ్చే అవకాశం లేదు..
లోటు వర్షపాతం, జలాశయాల్లో నీటి లభ్యత తక్కువగా ఉన్న కారణంగా ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో పంటల సాగు కోసం నీళ్లు ఇచ్చే అవకాశం లేదని నీటిపారుదల ఆయకట్టు అభివృద్ధి శాఖ సీఈ సత్యనారాయణరెడ్డి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శ్రీరాజరాజేశ్వర మిడ్ మానేరు ప్రాజెక్ట్, ఎగుమానేరు, మల్కపేట, అన్నపూర్ణ రిజర్వాయర్లలో తక్కువ వర్షపాతంతో నీటి లభ్యత తక్కువ ఉన్న కారణంగా ఖరీఫ్ సీజన్లో పంటల సాగుకు నీళ్లిచ్చే అవకాశం లేదని, రైతులు గమనించాలని కోరారు.
జిల్లాలో ఖరీఫ్ సాగు అంచనా
మండలం వరి పత్తి ఇతర మొత్తం
గంభీరావుపేట 19200 150 521 19871
ఇల్లంతకుంట 23800 12800 1638 38238
ముస్తాబాద్ 25000 650 1229 26879
సిరిసిల్ల 4600 750 97 5447
తంగళ్లపల్లి 21600 1300 1152 24052
వీర్నపల్లి 8096 200 00 8296
ఎల్లారెడ్డిపేట 18600 3300 14 21914
బోయినపల్లి 13000 7000 1260 21260
చందుర్తి 15600 5500 412 21512
కోనరావుపేట 19200 4400 587 24187
రుద్రంగి 6180 1820 2287 10287
వేములవాడ 5440 5050 452 10942
వేములవాడ రూరల్ 11050 4200 372 15622
--------------------------------------------------------------------------------------------------------------------------------------------
మొత్తం 191366 47120 10021 248507
----------------------------------------------------------------------------------------------------