రోడ్డు భద్రతపై విద్యార్థులతో తల్లిదండ్రులకు లేఖ
ABN , Publish Date - Jul 27 , 2026 | 11:36 PM
రోడ్డు భద్రతపై విద్యార్థులతో తమ తల్లిదండ్రులకు లేఖ రాయించాలని రోడ్డు భద్రత కమిటీ కన్వీనర్, డీటీసీ అఫ్రీన్ సిద్దిఖీ సూచించారు. జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో రోడ్డు భద్రత హామీ ధ్రువపత్రం కార్యక్రమంపై ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, పాఠశాల సంఘాల సభ్యులతో సోమవారం సమావేశం నిర్వహించారు.
తిమ్మాపూర్, జూలై 27 (ఆంధ్రజ్యోతి): రోడ్డు భద్రతపై విద్యార్థులతో తమ తల్లిదండ్రులకు లేఖ రాయించాలని రోడ్డు భద్రత కమిటీ కన్వీనర్, డీటీసీ అఫ్రీన్ సిద్దిఖీ సూచించారు. జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో రోడ్డు భద్రత హామీ ధ్రువపత్రం కార్యక్రమంపై ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, పాఠశాల సంఘాల సభ్యులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీటీసీ అఫ్రీన్ సిద్దిఖీ మాట్లాడుతూ ఆరు నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులతో రోడ్డు భద్రతా నిబంధనలపై తల్లిదండ్రులకు లేఖ రాయించాలని సూచించారు. లేఖలో ట్రాఫిక్ నిబంధనలు, నియమాలను గుర్తు చేయాలన్నారు. తల్లిదండ్రులు ఆ లేఖను చదివి, నియమాలు కచ్చితంగా పాటిస్తామని హామీ ఇస్తూ సంతకం చేసి తిరిగి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. విద్యార్థులు ఆ సంతకంతో కూడిన హామీ పత్రాన్ని పాఠశాలల్లో సమర్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలు అరికట్టవచ్చని చెప్పారు. రోడ్డు భద్రత అనేది నినాదం మాత్రమే కాదని, అది ప్రతి ఒక్కరి జీవన విధానం కావాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో జైపాల్‌రెడ్డి, ఎంవీఐ ఉమామహేశ్వర్‌రావు, ఆర్టీవో సభ్యుడు పడాల రాహుల్ పాల్గొన్నారు.