‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ను విజయవంతం చేద్దాం
ABN , Publish Date - Mar 06 , 2026 | 11:59 PM
రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మార్గదర్శకత్వంలో 99 రోజులపాటు ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని రాష్ట్ర వ్యవసాయ, సహకారశాఖ మంత్రి, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు పిలుపునిచ్చారు.
కరీంనగర్, మార్చి 6 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మార్గదర్శకత్వంలో 99 రోజులపాటు ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని రాష్ట్ర వ్యవసాయ, సహకారశాఖ మంత్రి, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు పిలుపునిచ్చారు. శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాను అన్నిరంగాల్లో ప్రగతి పథంలో తీసుకెళ్లి అగ్రభాగాన నిలుపుతామన్నారు. రెండున్నర సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ఈ కార్యక్రమాన్ని సీఎం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణాల్లో ప్రధాన సమస్యల పరిష్కారం, సంక్షేమ, అభివృద్ధి పనులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఉమ్మడి జిల్లాలో ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీకి సంబంధించిన సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. వ్యవసాయరంగానికి లక్ష కోట్లు బడ్జెట్ కేటాయించింది తెలంగాణ రాష్ట్రం మాత్రమేనన్నారు. అత్యధికంగా పంట పండించడంలోనూ, ధాన్యం సేకరించడంలోనూ రాష్ట్రానికి సాటి ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఇరిగేషన్, విద్యుత్ రంగంలోనూ మంచి ఫలితాలను ప్రభుత్వం సాధిస్తుందని తెలిపారు. జిల్లా యంత్రాంగం ముందుండి 99 రోజులపాటు ఈకార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు స్వచ్చందంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఫ జిల్లాను ఆదర్శంగా నిలపాలి..
- మంత్రి పొన్నం ప్రభాకర్
రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని రాజకీయాలకతీతంగా అందరూ కలిసి విజయవంతం చేసి జిల్లాను ఆదర్శంగా నిలపాలని పిలుపునిచ్చారు. పరిసరాల పరిశుభ్రత, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఇళ్లలో చెడిపోయిన కంప్యూటర్లు, టీవీలు, ఇతర ఎలక్ర్టానిక్, ఎలక్ర్టికల్ పరికరాలు, వస్తువులను ఈ వేస్ట్ విధానం ద్వారా సేకరించాలని అధికారులకు సూచించారు. రహదారి భద్రత కింద ఏప్రిల్ 13 నుంచి 18 వరకు హోంశాఖ, రవాణాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలను చేపడతామని చెప్పారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో సత్వరమే స్పందించి క్షతగాత్రుల ప్రాణాలను కాపాడిన వారికి ప్రభుత్వం రహవీర్ పేరిట 25వేల ప్రోత్సాహకం అందిస్తుందని మంత్రి పొన్నం తెలిపారు.
ఫ నిరంతరాయంగా సంక్షేమ పథకాలు
- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ప్రజా సంక్షేమ కార్యక్రమాలను సీఎం రేవంత్‌రెడ్డి నిరాటకంగా కొనసాగిస్తున్నారన్నారు. విద్యా విధానంలో వినూత్న మార్పులు, సంక్షేమ రంగంలో సత్పలితాలు సాధించడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని తెలిపారు. 99 రోజులపాటు ప్రజల వద్దకే పాలన చేపట్టడం ద్వారా ప్రజలకు నమ్మకం, విశ్వాసం, భరోసా మరింత పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీ గడ్డం వంశీ, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు, హౌసింగ్ ఏడీ కె లక్ష్మి, కలెక్టర్లు చిత్రా మిశ్రా, గరిమా అగర్వాల్, కోయ హర్ష, సత్యప్రసాద్, కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, ఎస్పీలు మహేష్ బి గీతే, అశోక్‌కుమార్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్‌రెడ్డి, డాక్టర్ సంజయ్‌కుమార్, మేడిపల్లి సత్యం, విజయరమణారావు, ఠాకూర్ మక్కాన్ సింగ్, కరీంనగర్, రామగుండం మేయర్లు కొలగాని శ్రీనివాస్, మహంకాళి స్వామి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, ఉమ్మడి జిల్లాల అధికారులు పాల్గొన్నారు.