Share News

వానాకాలం సాగుకు సిద్ధమవ్వండిలా..

ABN , Publish Date - Jun 03 , 2026 | 12:14 AM

రోహిణి కార్తె ప్రారంభం కావడంతో రైతులు వ్యవసాయ పనులకు సన్నద్ధమవుతున్నారు. వేసవి దుక్కులు, భూసార పరీక్షలు, నేల స్వభావాన్ని బట్టి పంటల సాగు ఇతర సాగు విధానాలపై రైతులు, మెళకువలు, అవగాహన కలిగి ఉండాలని, వేసవి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని ఏడీఏ సునీత తెలిపారు.

వానాకాలం సాగుకు సిద్ధమవ్వండిలా..

హుజూరాబాద్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): రోహిణి కార్తె ప్రారంభం కావడంతో రైతులు వ్యవసాయ పనులకు సన్నద్ధమవుతున్నారు. వేసవి దుక్కులు, భూసార పరీక్షలు, నేల స్వభావాన్ని బట్టి పంటల సాగు ఇతర సాగు విధానాలపై రైతులు, మెళకువలు, అవగాహన కలిగి ఉండాలని, వేసవి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని ఏడీఏ సునీత తెలిపారు.

ఫ లోతు దుక్కులతో మేలు...

లోతు దుక్కులు దున్నినప్పుడు భూమిలో ఉండే పురుగులు, తెగుళ్లు నశిస్తాయి. భూమిలో దాగి ఉన్న లేదా నిద్రావస్థలో ఉన్న పురుగులు, తెగుళ్లను కలగజేసే శిలీంద్రాలకు సూర్యరశ్మి సోకి నశిస్తాయి. దుక్కిలో బయట పడిన గుడ్లు, ప్యూపాలను పక్షులు తిని నాశనం చేస్తాయి. కాబట్టి తొలకరిలో వేసే పైర్లకు వీటి తాకిడి తక్కువ ఉంటుంది. భూమిలో తొమ్మిది అంగుళాల లోతు తగ్గకుండా దుక్కులు దున్నుకోవడం శ్రేయస్కరం.

ఫ కలుపు నివారణ...

తుంగ, గరిక వంటి కలుపు మొక్కలు పొలాల్లో పెరిగి పంటలనునాశనం చేస్తాయి. కలుపు మొక్కలు పెరిగి భూమిలోని నీటిని, పోషక పదార్థాలను గ్రహించి సత్తువ లేకుండా చేస్తాయి. దీనివల్ల భూసారం తగ్గడమే కాకుండా భూమిలోని లోతైన పొరల్లో తేమ తగ్గుతుంది. తుంగ, గరిక వేర్లు దుబ్బుగా ఉండి నేలలో బాగా విస్తరించి ఉండడం వల్ల నివారణ కష్టమవుతుంది. వేసవిలో దుక్కి బాగా దున్నినప్పుడు ఈ కలుపు వేర్లు దుంపలు ఏరి వీటిని అరికట్టవచ్చు. వేసవిలో లోతుగా దున్ని తొలకరి వర్షాలకు గొర్రు, గుంటుకలతో చదును చేస్తే నేల బాగా గుల్ల బారుతుంది. పైర్ల వేర్లు బాగా విస్తరించడానికి అనుకూలంగా ఉంటుంది. నేలకోతకు గురికాకుండా వాలుకు అడ్డంగా దున్నడం, వర్షపు నీటికి ప్రవాహానికి అడ్డంగా చిన్నపాటి మట్టి, రాతి కట్టడాలు ఏర్పాటు చేసుకోవాలి. పొలంలో గట్టిపొర ఏర్పడితే ఎర్రని ఇసుక మట్టిని తోలడం వల్ల భూమి బాగుపడుతుంది. వేసిన పంట నుంచి వేర్లు సులభంగా భూమిలోకి దిగుతాయి. వేసవిలోనే సేంద్రీయ ఎరువులు పంట పొలాలకు తరలించుకోవాలి. నీటి లభ్యత ఉన్న రైతులు పెంట కుప్పలపై నీటిని ఆడపదడపా చిలుకరించడం వల్ల తొందరగా ఎరువుగా మారుతుంది.

ఫ పంట మార్పిడి తప్పనిసరి...

ఒకే భూమిలో ఏటా ఒకే పంటను కాకుండా వేర్వేరు పంటలు సాగు చేసుకొని పంట మార్పిడి చేసుకోవాలి. రైతులు ఒకే రకమైన పంటను వరుసగా సాగు చేస్తూ దిగుబడులు రాక నష్టపోతున్నారు. ఒకే పంటను ఏళ్ల తరబడి పండించడం వల్ల చీడపీడలు వృద్ధి చెందుతాయి. ఆ పంట వేర్లు వ్యాపించిన మేర భూమి పొరలు నిస్సారమవుతాయి. పంట మార్పిడితో నేలసారాన్ని కాపాడుకోవడంతో పాటు తేమను సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు. వివిధ రకాల వేరు వ్యవస్థలు కలిగి భిన్నంగా పెరిగే పైర్లను పంట మార్పిడి కోసం ఎంపిక చేసుకోవాలి. పత్తి, మొక్కజొన్న, పొద్దు తిరుగుడు వంటి పైర్లు నేల లోపలి నుంచి పోషకాలు తీసుకుంటాయి. పోషకాలు ఎక్కువగా తీసుకునే నువ్వులు, పొద్దు తిరుగుడు వంటి పంటలకు భూమికి పోషకాలు సమకూర్చే అవసరాల పైర్లతో పంట మార్పిడి చేసుకోవాలి. ఇవి బెట్ట పరిస్థితులను తట్టుకుంటాయి. వరుసగా పప్పుధాన్యాల పంటలు కాకుండా నూనె పంటలు సాగు చేయాలి. మిరుప, టమాట, వేరుశనగ, పంటలను ఆశించే లద్దె పురుగు నివారణకు జొన్న, సజ్జ, రాగి పంటల ఎర పంటలుగా వేసుకోవాలి. టమాట, మిరుప, పుచ్చ పంటల్లో బంతిని కూడా ఎర పంటగా కొన్ని సాళ్లు వేసుకొని తెగుళ్లు, ఆకుముడత నివారించవచ్చు. పంట మార్పిడి చేసేటప్పుడు అనుకూలమైన పంటలు ఎంచుకోకపోతే చీడపీడల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. బెండ తర్వాత పత్తి వేయొద్దు. జొన్న సాగు చేసిన వెంటనే మిరప వేయకూడదు. ఈ పంటలకు ఒకే రకమైన చీడపీడలు ఆశించి నష్ట పరుస్తాయి.

ఫ భూసార పరీక్షల ఆధారంగా పంటలు...

రైతులు ముఖ్యంగా పండ్లతోటలు సాగు చేసే రైతులు భూసార పరీక్షలు చేయించి పంటలు సాగు చేసుకోవాలి. లేకపోతే ఐదేళ్ల వరకు పెంచి కాపుకొచ్చే దశలోనే క్షీణించి రైతుకు పెట్టుబడి నష్టపోయే ప్రమాదం ఉంది. భూసార పరీక్షలు ద్వారా తమ నేల ఏ పంటలకు అనుకూలమో నిర్ధారించుకోవాలి.

Updated Date - Jun 03 , 2026 | 12:14 AM