బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించుకుందాం
ABN , Publish Date - Jan 12 , 2026 | 11:50 PM
మార్కెట్‌రోడ్ వేంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను ఈ నెల 23 నుంచి ఘనంగా నిర్వహించుకుందామని రాష్ట్ర బీసి సంక్షేమ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.
కరీంనగర్ కల్చరల్, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): మార్కెట్‌రోడ్ వేంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను ఈ నెల 23 నుంచి ఘనంగా నిర్వహించుకుందామని రాష్ట్ర బీసి సంక్షేమ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. సోమవారం ఆలయంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం ఆలయం నుంచి ఒక్క రూపాయి తీసుకోకుండా ఉత్సవాలు నిర్వహించామని, ఈ యేడు కూడా శ్రీవారి ఉత్సవాలకు దాతలు గతంలో కంటే మరింతగా స్పందించి ముందుకు రావాలని కోరారు. భక్తులకు ఇబ్బంది కలుగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగానికి సూచించారు. 23 నుంచి 29 వరకు ఉత్సవాలు జరుగుతాయని, 30న సమ్మక్క జాతర దృష్ట్యా ఫిబ్రవరి 1న శ్రీవారి శోభాయాత్ర ఉంటుందని తెలిపారు. కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ గతంలో ఏర్పడిన కొన్ని సమస్యలను అధిగమిస్తూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని అన్నారు. పోలీసు, ఫైర్, రెవెన్యూ, మున్సిపల్, వైద్య ఆరోగ్య, విద్యుత్ శాఖలతోపాటు పలు స్వచ్ఛంద, ఆధ్యాత్మిక, ధార్మిక సంస్థల సహకారం ఉంటుందని తెలిపారు. సమావేశంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, డీసీసీ కార్పొరేషన్ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్, ఆర్డీవో మహేశ్వర్, ఏసీపీ వెంకటస్వామి, ఆలయ వ్యవస్థాపక వంశ పారంపర్య ధర్మకర్తలు చకిలం శ్రీనివాస్, చకిలం గంగాధర్, ఈవో కందుల సుధాకర్ పాల్గొన్నారు.
ఫ దాతల నుంచి విశేష స్పందన...
మంత్రి పొన్నం ప్రభాకర్ కోరిక మేరకు పలువురు వ్యాపార, వాణిజ్య సంస్థల బాధ్యులు, నగర ప్రముఖులు, నాయకులు ప్రత్యక్షంగా పరోక్షంగా స్పందించి విరాళాలు ప్రకటించారు. 85 లక్షల రూపాయల వరకు విరాళాలు అందాయని ఈవో తెలిపారు.