మాదక ద్రవ్యాలను నిర్మూలిద్దాం..
ABN , Publish Date - Jul 22 , 2026 | 11:54 PM
మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ చిత్రా మిశ్రా కోరారు.
కరీంనగర్ క్రైం, జూలై 22 (ఆంధ్రజ్యోతి): మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ చిత్రా మిశ్రా కోరారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా స్థాయి నార్కోటిక్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలలు, కళాశాలలో మత్తు పదార్థాల దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గ్రామాల వారీగా ప్రాజెక్టుల పరిధిలో నమోదైన కేసుల వివరాలను తెలుసుకున్నారు. నెలవారి ప్లాన్‌తోపాటు ఏడాది పాటు చేసే కార్యక్రమాలను రూపొందించాలన్నారు. ఈ సందర్భంగా సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ.. విద్యాసంస్థలు, దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫిర్యాదు వస్తే వెంటనే స్పందించి తనిఖీలు కొనసాగిస్తున్నట్లు వివరించారు. డీఈవో చైతన్య జైనీ మాట్లాడుతూ.. పాఠశాలల్లో మాదక ద్రవ్యాల నిరోధక క్లబ్బులు ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగేశ్వరరావు తెలిపారు. డీడబ్ల్యూవో సరస్వతి మాట్లాడుతూ.. విద్యాసంస్థల్లో వలంటీర్ల సహాయంతో తరచుగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాఖడే, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ పాల్గొన్నారు.