Share News

మాదకద్రవ్యాలను నిర్మూలిద్దాం..

ABN , Publish Date - Jun 21 , 2026 | 12:25 AM

మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా పిలుపునిచ్చారు.

మాదకద్రవ్యాలను నిర్మూలిద్దాం..

కరీంనగర్‌ క్రైం, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో పోలీస్‌ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నార్కోటిక్‌ కోఆర్డినేషన్‌ జిల్లా కమిటీ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... మాదకద్రవ్యాల నియంత్రణ సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. డ్రగ్స్‌రహిత జిల్లాగా కరీంనగర్‌ను తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు అందించాలని సూచించారు. ‘మాదకద్రవ్యాలకు నో చెప్పండి-ఆరోగ్యకరమైన జీవితాన్ని ఎంచుకోండి’ అనే సందేశాన్ని విస్తృతంగా వ్యాప్తి చేయాలని కలెక్టర్‌ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ నషా ముక్త్‌ మిత్రగా నమోదు చేసుకోవాలని, ఆన్‌లైన్‌ ద్వారా ప్రతిజ్ఞ చేయాలని విజ్ఞప్తి చేశారు. సీపీ గౌస్‌ ఆలం మాట్లాడుతూ... ఈ నెల 26న నిర్వహించే అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. డిసిక్ట్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌(డీసీపీఓ) పర్వీన్‌ మాట్లాడుతూ... ‘నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌‘ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17 నుంచి చేపడుతున్న వివిధ కార్యక్రమాలను వివరించారు. అనంతరం నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో ఆర్డీవోలు షర్మిల, జల కుమారి, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాసరావు, నార్కోటిక్స్‌ ఇన్‌స్పెక్టర్‌ రఫిక్‌ ఖాన్‌ పాల్గొన్నారు.

ఫ రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో కృషి చేయాలి

రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని కలెక్టర్‌ చిత్రామిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాలులో నిర్వహించిన జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని, ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. నగరంలోని ప్రధాన రహదారులపై వీధి దీపాల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, వెలుతురు లేని ప్రాంతాల్లో అదనపు లైటింగ్‌ సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. సీపీ గౌస్‌ ఆలం మాట్లాడుతూ ట్రాఫిక్‌ నిబంధనలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతోపాటు నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలో వర్షపు నీరు నిలిచే 16 ప్రాంతాలను ఇప్పటికే గుర్తించినట్లు ఆయన వెల్లడించారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. ఆర్టీఏ సభ్యుడు పడాల రాహుల్‌ మాట్లాడుతూ.. తీగలగుట్టపల్లి ఆర్వోబీ వద్ద రోడ్డు గుంతల కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరారు. సమావేశంలో అడిషనల్‌ కలెక్టర్‌ అశ్విని తానాజీ వాఖడే, నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రపుల్‌దేశాయ్‌, నేషనల్‌ హైవేస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ భరద్వాజ్‌, టౌన్‌ ఏసీపీ వెంకటస్వామి, ఆర్‌అండ్‌బీ ఈఈ నరసింహచారి పాల్గొన్నారు.

Updated Date - Jun 21 , 2026 | 12:25 AM