Share News

పండుగను ప్రశాంతంగా జరుపుకుందాం..

ABN , Publish Date - Sep 13 , 2026 | 11:36 PM

వినాయక చవితి ఉత్సవాలకు అందరూ సిద్ధమవుతున్నారు. ప్రధాన కూడళ్లు, కాలనీలు, వీధుల్లో గణనాథులు కొలువుదీరుతున్నారు.

పండుగను ప్రశాంతంగా జరుపుకుందాం..
జమ్మికుంటలో సిద్ధమవుతున్న వినాయక మండపాలు

జమ్మికుంట, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): వినాయక చవితి ఉత్సవాలకు అందరూ సిద్ధమవుతున్నారు. ప్రధాన కూడళ్లు, కాలనీలు, వీధుల్లో గణనాథులు కొలువుదీరుతున్నారు. నిర్వాహకులు మండపాలను ఏర్పాటు చేస్తున్నారు. ఎటు చూసినా అలంకరణలు, విధ్యుత్‌ దీపాలతో సందడిగా కనిపిస్తోంది. ఉత్సవాల నిర్వహణలో భక్తి ఎంత ముఖ్యమో.. భద్రత కూడా అంతే కీలకం. మండపాల వద్ద చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉండడంతో ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మండపాల అలంకరణలో భాగంగా విద్యుత్‌ దీపాలు, సీరియల్‌ లైట్లు, సౌండ్‌ సిస్టమ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. నాణ్యత లేని వైర్లు, ఓవర్‌లోడ్‌ కనెక్షన్లు, విద్యుత్‌ తీగలు తడిసిపోవడం వల్ల షార్ట్‌సర్క్యూట్‌తో ప్రమాదం పొంచి ఉంటుంది. వర్షాలు కురిసే సమయంలో ఈ ముప్పు మరింత పెరుగుతుంది. మండపాలకు విద్యుత్‌ కనెక్షన్లు సక్రమంగా ఉన్నాయా, వైర్లు సురక్షితంగా అమర్చారా, ఎర్తింగ్‌ ఉందా అనే అంశాలపై జాగ్రత్తలు తీసుకోవాలి.

ఫ అగ్నిప్రమాదం జరుగకుండా..

మండపాల వద్ద కరెంటు దీపాలు, విద్యుత్‌ పరికరాలతో పాటు అలంకరణ సామగ్రి, వస్త్రాలు, ప్లాస్టిక్‌ పదార్థాలు వినియోగిస్తుంటారు. ఎక్కడైనా షార్ట్‌సర్క్యూట్‌ జరిగితే మంటలు వేగంగా వ్యాపించే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రతీ మండపం వద్ద తప్పనిసరిగా మంటలు ఆర్పే పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలి. మండపం చుట్టూ అత్యవసర సమయంలో ప్రజలు బయటకు వెళ్లేందుకు మార్గం ఖాళీగా ఉండేలా చూడాలి. ప్రధాన రహాదారులు, కూడళ్లకు సమీపంలో ఏర్పాటు చేసే మండపాలతో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తే వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి. అవసరమైన చోట బారికేడ్లు ఏర్పాటు చేసి, వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక స్థలం కేటాయించాలి. అత్యవసర సమయంలో అంబులెన్స్‌, అగ్నిమాపక వాహనాలు వెళ్లేందుకు మార్గం అందుబాటులో ఉండేలా చూడాలి.

Updated Date - Sep 13 , 2026 | 11:36 PM