Share News

‘సర్‌’పై నేతల నజర్‌..

ABN , Publish Date - Jun 17 , 2026 | 12:08 AM

కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌) కోసం అధికార యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది. పారదర్శకమైన, ఖచ్చితమైన తప్పులు లేని ఓటరు జాబితాను సిద్ధం చేసేందుకు ఎన్నికల సంఘం చర్యలు వేగవంతం చేసిన నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలు కూడా ప్రత్యేక దృష్టి పెట్టాయి.

‘సర్‌’పై నేతల నజర్‌..
సర్‌పై అవగాహన సమావేశంలో మాట్లాడుతున్న ఏఐసీసీ కార్యదర్శి సచిన్‌ సావత్‌

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌) కోసం అధికార యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది. పారదర్శకమైన, ఖచ్చితమైన తప్పులు లేని ఓటరు జాబితాను సిద్ధం చేసేందుకు ఎన్నికల సంఘం చర్యలు వేగవంతం చేసిన నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలు కూడా ప్రత్యేక దృష్టి పెట్టాయి. సర్పంచ్‌ ఎన్నికల నుంచి పార్లమెంట్‌ ఎన్నికల వరకు ఓట్ల బదలాయింపుపై నిఘా పెట్టే పార్టీలు ఇప్పుడు ఓటర్‌ జాబితా సవరణపై దృష్టి సారించాయి. కేంద్ర ప్రభుత్వం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో ఓటర్లను తొలగిస్తున్నారని ఆరోపణలు చేస్తూనే సర్‌ ప్రక్రియపై పార్టీలు తమ నాయకులకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓటర్‌ జాబితా సవరణలు ఓట్లు తొలగిపోకుండా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు బూత్‌ల వారీగా ఉన్న ఏజెంట్లు, ఇన్‌చార్జీలకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు. సిరిసిల్ల, వేములవాడ రెండు నియోజకవర్గాల్లో స్వయంగా బీఆర్‌ఎస్‌ నాయకులకు బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు పవర్‌ పాయింట్‌ ద్వారా అవగాహన కల్పించారు. అదేక్రమంలో రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్‌సావత్‌, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ఇతర నాయకులు శిక్షణ ఇచ్చారు. సవరణలలో బీఎల్‌వోలు కీలకంగా వ్యవహరించే పరిస్థితి ఉండడంతో వారికి సహకరిస్తూ ఓట్లు తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకునే విధంగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ తమ నాయకులను సన్నద్ధం చేసింది. జిల్లాలో పార్టీ నేతలు అందరూ పార్టీ కార్యక్రమాల కంటే ప్రధానంగా ఓటర్‌ జాబితా సవరణపైనే హడావుడి చేస్తున్నారు. దీంతో ఓటర్లలోను అయోమయ పరిస్థితి ఏర్పడింది. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ శాసనసభ నియోజకవర్గాల్లో బీఎల్‌వోలు ఓటర్ల జాబితా మ్యాపింగ్‌ను కొనసాగిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 84.43 శాతం పూర్తి చేశారు. ఇందులో సిరిసిల్ల నియోజకవర్గంలో 81.59 శాతం, వేములవాడ నియోజకవర్గంలో 87.48 పూర్తి చేశారు.

25 నుంచి ఇంటింటి సర్వే

ఓటర్‌ జాబితాలో అర్హులను గుర్తించి సమగ్ర ఓటర్‌ జాబితాను సిద్ధం చేసే దిశగా కేంద్ర ఎన్నికల సంఘం అంతా సిద్ధం చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇందుకోసం బీఎల్‌ఓలకు శిక్షణ ఇస్తున్నారు. జూన్‌ 24 వరకు సన్నాహక సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తారు. జూన్‌ 25నుంచి జూలై 24వరకు ఇంటింటి సర్వే, జూలై 24నాటికి పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణ, జూలై 31న ఓటర్‌ జాబితా ముసాయిదా వెల్లడిస్తారు. అదేరోజు నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులను స్వీకరిస్తారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 28 వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులను పరిష్కరిస్తారు. తుది ఓటర్‌ జాబితాను అక్టోబరు 1వ తేదీనవెల్లడిస్తారు. ఓటర్‌ జాబితాలో చనిపోయిన వారు, డూప్లికేట్‌, శాశ్వతంగా వలసపోయిన వారు, అనర్హుల పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగిస్తారు. 2002 సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకొని ఓటర్‌ లింకును పరిశీలిస్తారు. ఇప్పటికే ఓటర్‌ మ్యాపింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. మ్యాపింగ్‌పై ఓటర్లకు అవగాహన కూడా కల్పించారు. మూడు దశల్లో కొనసాగుతున్న ప్రక్రియలో ఇంటింటికి వెళ్లే బీఎల్‌వోలు 12 పేజీలతో కూడిన ఒక ప్రత్యేక ఎన్యూమరేషన్‌ ఫారాన్ని అందిస్తారు. ఫారం అందుకున్న ఓటర్‌ అందులోని వివరాలను స్వయంగా పూర్తి చేసి తిరిగి అధికారులకు అందించాల్సి ఉంటుంది. ఎన్మూమరేషన్‌ పారాన్ని తిరిగి అధికారులకు అందించకపోయిన వారికి ఇబ్బందులు తప్పవనే సంకేతాలు ఉన్నాయి. ఇంటికి వెళ్లిన సమయంలో డోర్‌ లాక్‌ చేసి ఉంటే మూడుసార్లు ఆ ఇంటిని సందర్శిస్తారు. మూడోసారి కూడా తాళం వేసి ఉంటే అక్కడ ఫోన్‌ నంబర్‌ రాసి తగిన సూచనలు చేస్తారు. జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలు ఓటు హక్కును కోల్పోకుండా ఓటర్లు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ఓటర్‌ తప్పనిసరిగా మ్యాపింగ్‌ చేయించుకోవాలి. 2002, 2025 ఓటర్‌ జాబితాలో పేరు ఉన్నవారు, బీఎల్‌వోలు ఇంటివద్దకు వచ్చిన సమయంలో సెల్ఫ్‌ మ్యాపింగ్‌లో చేయించుకోవాలి. 2002లో ఓటు హక్కు వయస్సు రాకపోవడంతో జాబితాలో పేరు లేకపోయినా ప్రస్తుతం ఓటర్‌ లిస్టులో పేరు ఉన్నవారికి ఇది వర్తిస్తుంది. 2002 నాటికి 18 సంవత్సరాల నిండి ఉన్న ఓటర్‌ జాబితాలో పేరు లేకపోతే బీఎల్‌ఓల ద్వారా సెల్ఫ్‌ మ్యాపింగ్‌ చేయించుకోవాలి.

జిల్లాలో 4,01,605 మంది ఓటర్ల మ్యాపింగ్‌

ఓటర్‌ జాబితా ప్రక్షాళన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చివరిసారిగా 2002లో ఎస్‌ఐఆర్‌ సర్వే జరిగింది. అప్పటి ఓటర్‌ జాబితాతో పాటు 2025 ఓటర్‌ జాబితాను బీఎల్‌వోలకు అందించి దీని ఆధారంగా ప్రతి ఇంటికి వెళ్లి పాత లిస్టులోని పేర్లు కొత్త జాబితాలోను ఉంటే మ్యాపింగ్‌ చేస్తున్నారు. వారి సంతాన వివరాలను కూడా సేకరిస్తున్నారు. కుటుంబీకుల పేర్లు జాబితాలో ఉంటే మ్యాపింగ్‌ చేస్తున్నారు. ప్రతి బూత్‌ స్థాయి అధికారులు 2025 ఓటర్‌ జాబితాలోని 40ఏళు,్ల ఆపైన ఉన్న వారి ఓటర్లను 2002 ఓటర్‌ జాబితాలో గుర్తించి బీఎల్‌వోలు యాప్‌లో అప్డేట్‌ చేస్తున్నారు. తర్వాత వారి పిల్లల పేర్లను వివరాలను యాప్‌లో పొందపరుస్తున్నారు. ఓటర్‌ జాబితా మ్యాపింగ్‌ సర్వేలో కేంద్ర ప్రభుత్వం గుర్తించిన 11కార్డులను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఓటర్‌ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ జిల్లాలో జోరుగా సాగుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ శాసనసభ నియోజకవర్గ పరిధిలో 4,75,694 మంది ఓటర్లు ఉండగా ఎస్‌ఐఆర్‌లో భాగంగా బీఎల్‌వోలు ఇంటింటి సర్వేలో 4,01,605 మంది ఓటర్లకు మ్యాపింగ్‌ చేశారు. రెండు నియోజకవర్గాల్లో 84.43 శాతం పూర్తయింది ఇందులో సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్న వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, సిరిసిల్ల, తంగళ్ళపల్లి, ముస్తాబాద్‌ మండలాల్లో 2,46,562 మంది ఓటర్లు ఉండగా, 2,01,167 మంది ఓటర్ల మ్యాపింగ్‌ పూర్తి చేసారు. 81.59శాతం జరిగింది. వేములవాడ నియోజకవర్గంలో మేడిపల్లి, భీమారం, కథలాపూర్‌, రుద్రంగి, చందుర్తి, వేములవాడ రూరల్‌, వేములవాడ అర్బన్‌, కోనరావుపేట మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో 2,29,132 మంది ఓటర్లు ఉండగా, 2,00,438 మంది ఓటర్ల మ్యాపింగ్‌ పూర్తి చేశారు. 87.48 శాతంగా ఉంది.

ఓటర్‌ జాబితా మ్యాపింగ్‌ లెక్క ఇదీ..

సిరిసిల్ల నియోజకవర్గం

మండలం మొత్తం ఓటర్లు మ్యాపింగ్‌ ఓటర్లు శాతం

వీర్నపల్లి 11,606 10,720 92.37

ఎల్లారెడ్డిపేట 40,195 34,402 85.59

గంభీరావుపేట 36,737 32,444 88.31

సిరిసిల్ల 80,541 57,145 70.95

తంగళ్ళపల్లి 39,569 32,256 81.52

ముస్తాబాద్‌ 37,914 34,200 90.20

మొత్తం 2,46,562 2,01,167 81.59

వేములవాడ నియోజకవర్గ

మండలం మొత్తం ఓటర్లు మ్యాపింగ్‌ ఓటర్లు శాతం

మేడిపల్లి 24,535 2,121 8.66

భీమారం 17,744 15,273 86.07

కథలాపూర్‌ 38,184 31,803 83.29

రుద్రంగి 8,699 8,500 97.71

చందుర్తి 28,257 25,741 91.10

వేములవాడ రూరల్‌ 18,998 17,670 93.01

వేములవాడ అర్బన్‌ 58,143 48,902 84.11

కోనరావుపేట 34,572 31,288 90.50

మొత్తం 2,29,132 2,00,438 87.48

Updated Date - Jun 17 , 2026 | 12:08 AM