Share News

మహిళలు వివక్షకు గురికాకుండా చట్టాలు

ABN , Publish Date - May 28 , 2026 | 01:00 AM

మహిళలు నిర్భయంగా పని చేయా లని, పనిచేసే ప్రదేశంలో మహిళలు ఎలాంటి వివక్షకు గురికాకుండా, స్వేచ్ఛగా నిర్భయంగా పనిచేసేందుకు చట్టం సౌకర్యాలను కల్పిస్తుందని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ పేర్కొన్నారు.

మహిళలు వివక్షకు గురికాకుండా చట్టాలు

సిరిసిల్ల, మే 27 (ఆంధ్ర జ్యోతి): మహిళలు నిర్భయంగా పని చేయా లని, పనిచేసే ప్రదేశంలో మహిళలు ఎలాంటి వివక్షకు గురికాకుండా, స్వేచ్ఛగా నిర్భయంగా పనిచేసేందుకు చట్టం సౌకర్యాలను కల్పిస్తుందని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా సంక్షేమ వారోత్సవాల సందర్భంగా పని ప్రదేశంలో మహిళల పై లైంగిక వేధింపుల నివారణ నిషేధం, పరిష్కారాల చట్టం-2013పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 278 ఇంటర్నల్‌ కమిటీ సభ్యులను ఆహ్వానించి వారికి అంతర్గత ఫిర్యాదుల కమిటీ గురించి వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మహిళలపై లైంగిక వేధింపుల నివారణ నిషేధం పరిష్కారాల చట్టం లోని నిబంధనలు ఉల్లంఘించినట్లయితే ఉద్యోగం నుంచి తొలగించడం తోపాటు జైలుశిక్షలు కూడా ఉంటాయని హెచ్చరించారు. ప్రతి యజ మాని, కార్యాలయ అధిపతి మహిళలు స్వేచ్ఛగా నిర్భయంగా పనిచేసే వాతావరణాన్ని కల్పించాలన్నారు. యజమాని, అధికారి ఈ బాధ్యతలో విఫలమైతే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడంతోపాటు రూ.50 వేల జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు. పని ప్రదేశం అంటే కార్యాలయంతోపాటు విధి నిర్వహణలో భాగంగా చేసే ప్రయా ణాలు, సందర్శనలు, ఫీల్డ్‌ ట్రిప్పులు, కార్యాలయంతో సంబంధం ఉన్న ప్రతిచోట పని ప్రదేశం కిందికి వస్తాయని వివరించారు. అలాగే చట్టాన్ని దుర్వినియోగం చేసే వారిపై, తప్పుడు ఫిర్యాదులు చేసే వారికి కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణ కేంద్రం శిక్షకులు ప్రభాకర్‌, జిల్లా లోకల్‌ లెవెల్‌ కమిటీ సభ్యులు అఫ్జల్‌ బేగం, జ్యోతి, మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌ రాజేశ్వరి,సీడీపీవోలు సౌందర్య, ఉమారాణి, సుచరిత, డీ-హబ్‌ కోఆర్డినేటర్‌ రోజా, డీసీపీవో కవిత, సఖీ అడ్మిన్‌ మమత, జిల్లా అధికా రులు బీసీ సంక్షేమ అధికారి సౌజన్య, పరిశ్రమల జీఎం హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 28 , 2026 | 01:00 AM