Share News

కందులకు మద్దతు కరువు

ABN , Publish Date - Mar 13 , 2026 | 01:14 AM

రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు కరువైంది.

కందులకు మద్దతు కరువు

tచొప్పదండి, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు కరువైంది. పప్పు దినుసుల సాగు చేపట్టాలని ప్రభుత్వం ఓవైపు ప్రోత్సహిస్తూనే కొనుగోళ్లను మరిచింది. గత ఏడాది దిగుబడితోపాటు మంచి ధర రావడంతో రైతులు తిరిగి ఈసారి అధిక సంఖ్యలో కంది సాగును చేపట్టారు. ధరతోపాటు దిగుబడి కూడా తగ్గి రైతులను నష్టాలపాలు చేస్తుంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రం లేక రైతులు ప్రైవేట్‌ వ్యాపారులకు కందులను తక్కువ ధరలకే అమ్ముకుని నష్టపోతున్నారు.

ఫ మద్దతుత ధర రూ. ఎనిమిది వేలు

కేంద్ర ప్రభుత్వం కందులకు క్వింటాలుకు 8000 రూపాయలను మద్దతు ధరగా ప్రకటించింది. రైతులు కంది పంటను విస్తృతంగా సాగు చేశారు. పత్తి, మొక్కజొన్న పంటలో అంతర పంటగా కందిని రైతులు సాగు చేశారు. కొన్నిచోట్ల పూర్తిగా కందినే సాగు చేశారు. నెల రోజులుగా కంది పంట కోతలు ప్రారంభమయ్యాయి. కందులను చొప్పదండి వ్యవసాయ మార్కెట్‌కు తీసుకువస్తున్నారు. కొనుగోలు కేంద్రం లేకపోవడంతో రైతులు కందులను ప్రైవేట్‌ వ్యాపారులకే విక్రయిస్తున్నారు. క్వింటాలుకు ఆరు వేల నుంచి 7,500 రూపాయలను మాత్రమే వ్యాపారులు చెల్లిస్తున్నారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చేసేదేమీ లేక తమ పంటను రైతులు ప్రైవేట్‌ వ్యాపారులకు తక్కువ దరలకే విక్రయిస్తున్నారు.

ఫ స్పందించని అధికారులు

గతంలో కందుల కొనుగోలుకు మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో చొప్పదండిలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతుల నుంచి కందులను కొనుగోలు చేశారు. మూడేళ్ల క్రితం కందులకు బహిరంగ మార్కెట్లో మంచి ధరలు పలకడంతో మార్క్‌ఫెడ్‌ కొనుగోళ్లను నిలిపివేసింది. గత ఏడాది మార్క్‌ఫెడ్‌ అధ్వర్యంలో కందులను కొనుగోలు చేశారు. ప్రస్తుతం అధికారులు స్పందించడం లేదు. దీంతో రైతులు క్వింటాల్‌ కందులకు దాదాపు వెయ్యి రూపాయలను కోల్పోతున్నారు. అధికారులు స్పందించి చొప్పదండిలో కందుల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రైతులు ఈ సందర్భంగా కోరుతున్నారు.

ఫ 15 రోజులుగా మార్కెట్‌కు..

చొప్పదండి వ్యవసాయ మార్కెట్‌కు 15 రోజులుగా కందులను విక్రయానికి రైతులు తీసుకువస్తున్నారు. ఇప్పటివరకు వెయ్యి క్వింటాళ్ళ వరకు రైతులు ప్రైవేట్‌ వ్యాపారులకు అమ్ముకున్నారు. మరో రెండు నెలల పాటు సీజన్‌ కొనసాగుతుంది. పెద్ద మొత్తంలో కందులు మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉంది. చొప్పదండితో పాటు పొరుగు మండలాలైన జూలపల్లి, ఎలిగేడు, రామడుగు, ధర్మారం, మండలాల నుంచి రైతులు చొప్పదండి వ్యవసాయ మార్కెట్‌కు కందులను తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో చొప్పదండిలో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వం ప్రారంభించాలని రైతుల కోరుతున్నారు.

Updated Date - Mar 13 , 2026 | 01:14 AM